రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు!
J. Surender Kumar,
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి చేసిన ఆరోపణలు అవాస్తవమని రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు అన్నారు.
శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలీలకు మున్సిపల్ చైర్మన్ పదవులు ఇచ్చి తమ సామాజిక వర్గం పై తనకున్న ప్రేమను, గౌరవాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చాటుకున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పద్మశాలీలకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చి వారిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే ఎంతగానో శ్రమించారన్నారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనను ఎన్నికలకు పది రోజుల ముందే తన పేరును ప్రకటించి మునిసిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కావాలని కోరిన పెద్ద మనసున్న నాయకుడు సంజయ్ కుమార్ అని ఆయన కొనియాడారు. జనరల్ స్థానాల్లో కూడా బలహీన వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇచ్చారని రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా అందులో నాలుగింటిని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారికి బీఫాం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి మంచి మనసున్న ఎమ్మెల్యేను పట్టుకొని దొరతనం ప్రదర్శిస్తున్నాడని, బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నాడంటూ మాట్లాడటం శ్రావణికి సరికాదన్నారు. అన్ని కులాల అభివృద్ధిని కాంక్షిస్తూ కుల సంఘాల భవనాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా 65 లక్షల రూపాయలు పద్మశాలి కుల బాంధవులకు కమ్యూనిటీ హాల్ తదితర అవసరాల కోసం కేటాయించినట్లు వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ అప్పటి ఎంపీ కవితను ఒప్పించి 15 లక్షల రూపాయలను ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఇప్పించిన ఎమ్మెల్యేను పట్టుకొని బీసీల అంటే ఆయనకు చిన్న చూపు అని మాట్లాడటం తమకు నచ్చలేదన్నారు. రాజకీయంగా బలహీన వర్గాలు ఎదగాలనే సంకల్పంతోనే ఆయన రాజకీయ పదవులతో పాటు, పార్టీ పదవులను కూడా ఇచ్చి గౌరవించారన్నారు. తనకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని, అలాగే ఎలిగేటి అనిల్ కు మండల యూత్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా హనుమాండ్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రాయికల్ యువజన అధ్యక్షునిగా కూడా పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. 2014 నుంచి సంజయ్ తో కలిసి పని చేస్తున్నానని, ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన ఏనాడు ఇతరుల గురించి పర్సనల్ కామెంట్ చేయడం చూడలేదన్నారు. ఏదైనా తప్పు జరిగితే సరిచేసుకోవాలంటూ సూచించేవారని, ఏనాడు బలహీన వర్గాలు అని ఎవరిని చిన్న చూపు చూడలేదన్నారు. తాము ఏదో పనిమీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కేటీఆర్, కవిత తదితర నేతలను కలిసి వచ్చేవారమని శ్రావణి పేర్కొన్నట్లు నాకు చెప్పకుండా మీరు ఎలా వారిని కలిశారంటూ ఏనాడు మమ్మల్ని ఎమ్మెల్యే ప్రశ్నించలేదన్నారు. కర్కశత్వం, క్రూరత్వం అనే మాటలు శ్రావణి కి ఎలా వచ్చాయో అర్థం కావడంలేదని, ఎమ్మెల్యే అలాంటి గుణం ఉన్న వ్యక్తి కానే కాదన్నారు. ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో చూస్తారని, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చూడకుండా తన వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్తారని అలాంటి వ్యక్తిని దొరతనమంటూ మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యే సామాన్య జీవనానికి అలవాటు పడ్డ వ్యక్తి అని, బడుగు బలహీన వర్గాల వారి ఇంటికి వెళ్లి పలకరించే మంచి మనసున్న నేతగా ఆయన అభివర్ణించారు. సమావేశాల్లో పురపాలక మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత శ్రావణిని పేరు పెట్టి పిలిచే వాళ్లని, కవిత గారిని ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం కల్పించారని, అగ్ర నాయకత్వం ఆమె పట్ల అంతస్థాయిలో గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోకుండా దొరల రాజ్యం అంటూ మాట్లాడటం సరికాదన్నారు. శ్రావణి రాజీనామా విషయంలో తొందరపడిందని, రాజీనామాకు ముందు ఆలోచించి ఉంటే బాగుండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను టార్గెట్ చేసి శ్రావణి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో రాయికల్ మున్సిపల్ కౌన్సిలర్లు మేకల కాంతం, సువర్ణ సత్యనారాయణ, లతిక అనిల్, సాయికుమార్, మహేందర్ బాబు, శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు