పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత !

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ!

(J. Surender Kumar)

రాష్ట్రంపై చలి, మంచు దుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.

రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.6 డిగ్రీల సెల్సీయస్‌ నమోదయింది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌లో 4.7, సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లిలో 5.7, న్యాల్కల్‌లో 5.9 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 7.5 డిగ్రీలు, మెదక్‌ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్‌లలో 8 డిగ్రీ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

మధ్యప్రదేశ్‌, విదర్భ ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.
మరో 4 రోజులపాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, వారం తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.