అణగారిన వర్గాల ఆశాజ్యోతి!
బ్రిటీష్ వారు తొలుత తమ రాజ్య విస్తరణలో భాగంగా బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.ఈ నేపథ్యంలో బెంగాల్ లో 18,19వ శతాబ్దాలలో అనేకమంది సంఘ సంస్కర్తలు, రచయితలు,కవులు విశేష కృషి చేసి వివిధ సమస్యలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు.వారు చేసిన కృషికి కొనసాగింపుగా మహా శ్వేతా దేవి తన రచనల ద్వారా అణగారిన వర్గాల(ముఖ్యంగా గిరిజనుల)సమస్యలని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.
1926 జనవరి14న ఢాకాలో జన్మించిన ఆమె అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వ విద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వ విద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేశారు. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు.
నగ్జల్బరీ ఉద్యమం నేపథ్యంగా ఆమె 1975 లో రాసిన ‘హజార్ చౌరాసీర్ మా ‘( 1084 తల్లి) ఆమె ను ఒక జాతీయ స్థాయి రచయితగా మార్చేసింది. ఆ నవలకే ఆమెకు 1996 లో * జ్ఞానపీ పురస్కారం * లభించింది.ఆ ఇరవయ్యేళ్ళ మధ్యకాలంలొ ఆమె అసంఖ్యాకంగా కథలు, నవలలు రాసింది. వాటిల్లో బిర్సాముండా ఇతివృత్తంగా రాసిన ‘అరణ్యేర్ అధికార్ ‘( 1977, తెలుగులో ‘ఎవరిదీ అడవి ‘), అగ్నిగర్భ (1978), ‘బసాయి తుడు ‘, ‘ఛోటీ ముండా ఏవం తార్ తీర్ ‘(1980) లాంటి సుప్రసిద్ధ రచనలున్నాయి. ఆమె ముఖ్యమైన నవలలు, కథలు ఇంగ్లీషులోకి, చాలా భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వాతంత్ర్యానంతర బెంగాల్ నుంచి అంత విస్తారంగా అనువాదమైన రచయిత మరొకరు లేరని చెప్పవచ్చు.
మామూలుగా గొప్ప సాహిత్య సృజన చేసినవాళ్ళు, ప్రజాజీవితంతో మమేకం కావటం అరుదు. ప్రజల్తో కలిసి తిరిగినా వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి సంఘాన్నీ, రాజ్యాన్నీ నిలదీసేవాళ్ళు మరీ అరుదు. సామాజికంగా ఎంతో క్రియాశీలకంగా ఉండే ఉద్యమకారులు స్వయంగా రచయితలైన వాళ్ళు లేకపోరు గానీ, సాహిత్యశిల్ప దృష్ట్యావారిని గొప్ప రచయితలుగా గుర్తించలేం. కాని మహాశ్వేతాదేవిలో ఈ రెండు పార్శ్వాలూ ఎంతో శ్రేష్టంగా వికసించేయి. అందుకనే, ఆమె లేదంటే, ఈ దేశం నిజంగా పేదదైందనిపిస్తుంది.
.ఆమె గిరిజనుల సమస్యల గురించి తన రచనలలో సవివరంగా రాశారు. ఎన్నో సత్కారాలు పొందారు. 90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28 గురువారం న తుది శ్వాస విడిచారు.
వ్యాసకర్త!
యం.రాం ప్రదీప్, తిరువూరు 9492712836