వైకుంఠ వైభవం- ధర్మపురి ఆలయం- పువ్వుల మయం-ఆలయ ప్రాంగణం!

ముక్కోటి ఏకాదశి ఉత్సవ నేపథ్యంలో..

(J. Surender Kumar)

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం ముక్కోటి ఏకాదశి ఉత్సవ నేపథ్యంలో అల వైకుంఠపురి వైభవం కు ధీటుగా అందంగా ముస్తాబయింది. ఆలయ ప్రాంగణం వివిధ రకాల రంగు రంగుల పూల మాయం అయింది. వేలాదిమంది భక్తజనం ఇతర ప్రాంతాల నుండి అర్ధరాత్రి నుంచి తరలివచ్చి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. తెల్లవారుజామున నుంచి భారీ సంఖ్యలో భక్తజనం క్యూ లైన్ల లో నిలబడి ఉన్నారు.
అర్ధరాత్రి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్ కు వేద మంత్రంలతో అభిషేక, పూజాది కార్యక్రమాలు జరిగాయి. ప్రాతః కాలం లోఅందంగా పూలతో అలంకరించిన పుష్ప వేదికపై శ్రీ నరసింహ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, ఉగ్ర నరసింహ స్వామి, ఉత్సవ మూర్తులను కూర్చుండబెట్టారు.
ఉదయం 5 గంటల 30 నిమిషాలకు. అర్చకులు వేద పండితులు వేదమంత్రాలతో ఉత్తర ద్వారం తెరిచారు. భక్తజనం, ప్రముఖులు, వీఐపీలు, ఉత్తర ద్వారం నుండి స్వామివారి నీ దర్శించుకున్నారు.

పూలమయం ఆలయం!

లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన వివిధ రకాల రంగుల పువ్వులను రాజగోపురాలకు, ప్రాంగణంలోని వివిధ ఆలయాలకు భక్తజనం అబ్బుర పడేలా అందంగా అలంకరించారు.

ఉత్తర ద్వారం నుంచి స్వామి వారి వేదిక వరకు కళ్ళు చెదిరేలా వివిధ ఆకృతులతో, పూలను అందంగా అలంకరించారు. రంగవల్లులు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతి , వేదమంత్రోత్సవాల ఘోషతో, సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శ్రవణానంద గా గాయకుల భక్తి పాటల హోరు, భక్తుల గోవింద నామస్మరణ భజనలతో. ఆలయ ప్రాంగణం అలవైకుంఠపురి వైభవాన్ని తలపించింది.

సాంప్రదాయం వీడని అర్చకులు వేద పండితులు!

ముక్కోటి ఏకాదశి సోమవారం భరణి నక్షత్రం కావడంతో,
ఆలయ ప్రాంగణంలోని యమధర్మరాజు కు పూజాది కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. భక్తజనం క్యూలైన్లు స్వామి ఆలయం ముందు నుండే బారికేట్లతో ఏర్పాటు చేశారు. దీంతో అర్ధరాత్రి స్వామివారికి అభిషేకాలు, ఆయుష్ హోమం ,పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తుల దర్శనానికి తగు ఏర్పాట్లు చేశారు

. దీంతో భక్తజనం అర్చకులను, వేద పండితులను ప్రశంసించారు. ప్రతి నెల ఈ నక్షత్రాన యమధర్మరాజుకు ఆయుష్ హోమం అభిషేకం పూజాది కార్యక్రమాలు జరుగుతాయి.

ప్రత్యేక ఆశీర్వచన వేదిక ఏర్పాటు చేశారు!

దాతలను, వీఐపీలు, ప్రముఖులను ఆశీర్వదించి వారికి స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు అందజేయడం కోసం అన్నదాన ప్రాంగణంలో ప్రత్యేక ఆశీర్వచన వేదికను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన ఆలయంలో , దాతల విఐపిల రద్దీ తగ్గి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనానికి అవకాశం ఏర్పడింది .

వేదిక ఏర్పాటు గూర్చి పలువురు అభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. రాజకీయాలకతీతంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, D.C.C అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, తదితరులకు స్వామివారి శేష వస్త్రం బహుకరించి వేద ఆశీర్వచనం చేశారు.

అభివృద్ధి కమిటీ సభ్యులు తీరు ఆదర్శనీయం!

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సామాన్య భక్తుల మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం అర్ధరాత్రి నుంచి వారు ఆలయ ప్రాంగణంలో ఉండి సేవలు అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులమంటూ

ఆర్భాటాలను, వారు ప్రదర్శించలేదు. అధికారులు, సిబ్బంది ,అర్చకులు, వేద పండితులు, స్వీపర్లు, ఆదివారం నుంచి ఏర్పాట్లలో నిమగ్నమే వారు నిద్రలేని రాత్రులు గడిపి భక్తుల ప్రశంసలను అందుకున్నారు.

పీఠాధిపతులు రాలేదు!

ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానందసరస్వతి స్వామి, శ్రీ శ్రీ విశ్వంజీ స్వామి. రాలేదు. ప్రతి ముక్కోటి ఏకాదశి వారే ముందుగా ముక్కోటి ద్వారా తెరవడం సాంప్రదాయంగా ఈ క్షేత్రంలో కొనసాగుతున్నది.

పూల కోసం రెండు లక్షల దాతల విరాళం!

వాహనాల పార్కింగ్ కు అద్దెకు స్థలం!
ముక్కోటి సందర్భంగా పువ్వుల అలంకరణ కోసం దుబాయ్ 30 కోట్ల లాటరీ విజేత కుటుంబం,₹1.50 లక్షలు, బిజెపి రాష్ట్ర నాయకుడు, ప్రముఖ బిల్డర్, డి రామ సుధాకర్ రావు, అర లక్ష రూపాయలు దేవస్థానంకు అందించారు. ఆలయ అధికారుల, సిబ్బంది వాహనాల, భక్తుల వాహనాల పార్కింగ్, కోసం రామ్ సుధాకర్ రావు, స్థలమును ఆలయం కు అద్దెకిచ్చారు. ప్రతినెల అద్దె డబ్బులు స్వామి వారి హుండీ లో వేయాల్సిందిగా దాత రామ సుధాకర్ కోరారు.

భక్తులకు ఉచిత బాదం పాలు పంపిణీ!

వేలాదిమంది భక్తజనంకు ఉచిత బాదంపాలను. ఆలయ ప్రాంగణంలో పంపిణీ చేశారు. స్థానిక మిత్ర యూత్ ఆధ్వర్యంలో (1998-99 ఎస్ ఎస్ సి మిత్ర బృందం,) తెల్లవారుజాము నుంచి పాలను పంపిణీ చేశారు.

భారీ బందోబస్తు!

ధర్మపురి క్షేత్రంలో నంది విగ్రహం వరకే వాహనాలను అనుమతించారు. ఇద్దరు సిఐలు,10 మంది ఎస్ఐలు 150 మంది పోలీసులతో పాటు, హోంగార్డులతో సిఐ కోటేశ్వర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

క్యూ లైన్ లో కొన్ని సందర్భాలలో భక్తులు కొందరు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేయడంతో. స్థానిక ఎస్సై కిరణ్ జోక్యంతో శాంతించారు. పుష్ప వేదిక వద్ద విధులు నిర్వహిస్తున్న పెగడపల్లి ఎస్సై ని, రాజగోపురం వద్ద కానిస్టేబుల్ ను క్యూలైన్ డ్యూటీ నుంచి సీఐ కోటేశ్వర్ తప్పించి సమస్యను పరిష్కరించారు.

కళాకారుల ప్రదర్శన అద్భుతం!

శేషప్ప కళావేదికపై నరేందర్ శర్మ , జగదీష్ భక్తి పాటలు భక్తులను పరవశింప చేశాయి. డోలు వాయిద్య కళాకారుల విన్యాసాలు, స్వామివారి సేవ ఊరేగింపు ముందు నృత్యా ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

పారిశుద్ధ్య పనితీరు సూపర్!

క్షేత్రంలో అర్ధరాత్రి నుంచి స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, వీధులను శుభ్రపరచి తడి, చెత్త పొడి చెత్త వాహనాల్లో తరలించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆలయం వరకు, నంది విగ్రహం నుంచి గాంధీ విగ్రహం బస్టాండ్, పుష్కర స్తూపం, పటేల్ స్తూపం వరకు చెత్త చెదారం లేకుండా. రోడ్లను తెల్లవారు జాము 3 గంటల వరకే శుభ్రపరచారు.

మంత్రి భక్తజనం కు క్షమాపణలు చెప్పాలి!

ఉత్తర ద్వార దర్శన కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ కోసం.45 నిమిషాలు ఆలస్యం చేశారని, డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు, ప్రవర్తించిన తీరు భక్తుల మనోభావాలను గాయపరిచిందన్నారు. మంత్రి ఈశ్వర్ భక్తులకు క్షమాపణ చెప్పాలని పాత్రికేయుల సమావేశంలో ఆయన డిమాండ్. ఆలయ అధికారులు తీరుపై చర్యల కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఉత్తర ద్వారం తెరవడం అంశంపై సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ విజ్ఞతకే వదిలి వేస్తున్నాను అని లక్ష్మణ్ కుమార్ అన్నారు..