కొండగట్టు చోరీలో అంతుపట్టని దొంగల ఆంతర్యం!.
జగిత్యాల్ పోలీస్ క్విక్ యాక్షన్.!
J.Surender Kumar,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గర్భాలయంలో ఉన్న బంగారు విగ్రహాన్ని దొంగలు తాకలేదు, దీంతోపాటు స్వామివారి మూలవిరాట్ విగ్రహాన్ని కూడా వారు ముట్టనట్టు విశ్వసనీయ సమాచారం, దీంతో దొంగల ఆంతర్యం ఏమిటో ? అంతు పట్టని మిస్టరీగా మారింది. శ్రీ ఆంజనేయ స్వామి గర్భాలయంకు ఇరువైపులా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి ఉప ఆలయాలు ఉన్నాయి. ఆలయంలో దొంగతనం జరిగింది అనే సమాచారంతో జగిత్యాల పోలీసులు హుటా హుటినా సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు చెదిరిపోకుండా ఆలయాన్ని కొన్ని గంటల పాటు మూసి విచారణ చేపట్టడం, విచారణ సమయంలోనే వివిధ సెల్ ఫోన్ నెట్వర్క్ కు కొన్ని గంటల పాటు అంతరాయం కలగడం తెలిసిందే.
బంగారు శ్రీరామ రక్ష తోక వారం !
భద్రంగా ఉంది ?.
స్వామివారి మూల విగ్రహం శంకు, చక్రం బంగారు శ్రీరామరక్ష తో వారం, పాదుకలు, ఉత్సవమూర్తి, అంతరాలయంలో తోరణం, శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో వెండి తోరణం, పాదుకలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, శ్రీరామ పట్టాభిషేకం వస్తువులు భద్రంగా ఉన్నట్టు సమాచారం. మూలవిరాట్ స్వామి వారి వెనుక గల తోరణం తొలగిస్తున్న సమయంలో ఇనుప చువ్వ ఆంజనేయస్వామి కిరీటానికి తగిలి పడిపోవడంతో దొంగలు ఆకిరీటాన్ని ఎత్తుకెళ్లి ఉండవచ్చని దొంగతనం జరిగిన తీరుతెనులపై విచారణ చేపడుతున్న క్లూస్ టీం బృందం వారు నిర్ధారించుకున్నట్టు సమాచారం. దీనికి తోడు మూల విగ్రహం పై ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లభించనట్టు అనధికారిక సమాచారం.

హుండీ ముట్టలేదు!.
స్వామి వారి ఆలయ మంటపంలో గల హుండీలో లక్షలాది రూపాయల కానుకలు మిశ్రమ బంగారం, వెండి భక్తులు వేసి ముక్కులు తీర్చుకుంటారు. గతంలో అనేక ఆలయాల్లో జరిగిన దొంగతనాలలో స్వామివారి నగలు, ఆభరణాలతో పాటు, హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు, పగలగొట్టి డబ్బులు ఎత్తుక వెళ్ళిన సంఘటనలు తెలిసినవే. కానీ కొండగట్టు స్వామి వారి హుండీని దొంగలు తాకకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్టీల్ తలుపులు, తాళాలు కట్ చేసిన దొంగలకు, హుండీ తాళం పగలకొట్టడం సులువైన పని.
సవాలుగా స్వీకరించిన పోలీసులు!
దొంగతనంను జగిత్యాల పోలీస్ యంత్రాంగం సవాల్ గా స్వీకరించి, కొన్ని గంటల వ్యవధిలోని పది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి, అనుమానిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలించారు. సెల్ టవర్ , ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ వివరాలు, లొకేషన్ ట్రేస్ అవుట్ డాటా, ఆలయ ప్రాంగణంలో పరిసర ప్రాంతాలలోని 20 రోజులసీ సీ ఫుటేజ్ డాటాలను సేకరించి అనుమానితుల కదలికలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అతి త్వరలో దొంగలను పట్టుకొని దొంగలించిన ఆభరణాలను రికవరీ చేస్తాం, అనే ధీమాలో జగిత్యాల్ పోలీసు యంత్రాంగం ఉంది.