J. SURENDER KUMAR,
ఇంట్లో డబ్బులు పెడితే దొంగలు చొరబడి దోచుకుని వెళ్తారని భయంతో ఇంట్లో ఉన్న డబ్బు, ఖరీదైన నగలను ప్రజలు బ్యాంకులో భద్రపరచుకుంటారు. ఖాతాదారులకు బ్యాంక్ లు వినియోగదారుల నుండి రుసుము తీసుకొని ప్రత్యేక లాకర్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. లాకర్ లో దాచుకున్న ₹ 2.15 లక్షల కరెన్సీ నోట్లు చెదలు పురుగులు తినేసిన సంఘటన ఓ జాతీయ బ్యాంక్ లో జరిగింది.

ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిరామ్ మాగ్రిలో, మహేష్ నివసిస్తున్నాడు. అతని భార్య సునీతా మెహతా. అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులో తన పేరు మీద లాకర్ తీసుకుంది. సునీత తన విలువైన వస్తువులు, ₹2.15 లక్షల కరెన్సీ నోట్లను లాకర్‌లో దాచుకుంది.. కొన్ని నెలల తరువాత గత గురువారం లాకర్ తెరిచి ఒకేసారి అవాక్కయింది. అందులో కరెన్సీ నోట్లు పూర్తిగా చెదల
పురుగులు తినేసిన దృశ్యం కనబడింది. .దీంతో షాక్‌కు గురైన సునీత బ్యాంకు యాజమాన్యాన్ని ఆశ్రయించింది. వారు కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సునీతా మెహతా మాట్లాడుతూ.. గతేడాది మేలో బ్యాంకు లాకర్‌ను తెరిచాను. అప్పుడు డబ్బు భద్రంగా ఉంది అన్నారు.
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘కస్టమర్‌కు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. సమస్యను పరిష్కరించడానికి మేము కస్టమర్‌ను తిరిగి బ్యాంకుకు పిలిపించాము. లాకర్ లోపల తేమ ఉంది, కరెన్సీ డబ్బులను చెదపురుగులు తినేశాయి, ” అంటూ అధికారి వివరించారు.