J. Surender Kumar,
భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో ఇన్ కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫిబ్రవరి 14 మంగళవారం ఈ సోదాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ, యుకెలో ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల్లోనే, బీబీసీకి చెందిన దిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన మత ఘర్షణలపై ఆ డాక్యుమెంటరీ ఉంటుంది.
‘‘ఆదాయపు పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ అంశం వీలైనంత త్వరలోనే పరిష్కారం అవుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని బీబీసీ న్యూస్ ఒక ప్రకటనలో తెలిపింది.

నిజానికి ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ కేవలం యుకెలో మాత్రమే ప్రసారం అయినప్పటికీ, భారత ప్రభుత్వం మాత్రం, ఎవరూ ఆన్లైన్ లో ఈ డాక్యుమెంటరీని షేర్ చేయకుండా ఆపే ప్రయత్నం చేసింది. ‘‘వలసవాద మనస్తత్వంతో భారత్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా’’ ఆ డాక్యుమెంటరీని వర్ణించింది భారత ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా ఆ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఈ సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రభుత్వంపై క్రిటికల్ గా ఉన్న మీడియాను వేధించడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారు’’ అని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.
ప్రధాని మోదీ రాజకీయ రంగ ప్రవేశం నుంచి మొదలు, అనేక అంశాలపై బీబీసీ డాక్యుమెంటరీలో ప్రస్తావన ఉంది. గుజరాత్ అల్లర్ల క్రమం, ఘటనల గురించి ఉంది.
యుకె విదేశాంగ శాఖకు సంబంధించిన పత్రాల్లో గుజరాత్ అల్లర్ల గురించిన నివేదికలో ఉన్న విషయాలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి. అయితే గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఆరోపణలను మోదీ తిరస్కరిస్తూ వచ్చారు. మోదీని విచారణ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని 2013లో సుప్రీం కోర్టు చెప్పింది.
ఆ డాక్యుమెంటరీపై స్పందన కోసం బీబీసీ భారత ప్రభుత్వాన్ని సంప్రదించిందనీ, కానీ దానికి భారత ప్రభుత్వం నిరాకరించిందనీ, గత నెలలో బీబీసీ ప్రకటించింది. లోతైన పరిశోధన, విస్తృతమైన ఇంటర్వ్యూలు, అనేకమంది ప్రత్యక్ష సాక్షులు, నిపుణులతో, అన్ని రంగాల వారూ, బీజేపీ ప్రతినిధులు సహా అందరి ఇంటర్వ్యూలతో డాక్యుమెంటరీ రూపొందించినట్టు బీబీసీ ప్రకటించింది.
భారత ప్రభుత్వంపై వివిధ అధ్యయనాలు ప్రచురించే, క్రిటికల్ గా వార్తలు ప్రసారం చేసే సంస్థలను భారత ప్రభుత్వం లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.
మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వ వైఖరితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ 2020లో భారతదేశంలో తన కార్యకలాపాలు నిలిపివేసింది. ఆక్స్ఫామ్ సహా దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో కూడా గతంలో అనేకమార్లు సోదాలు జరిగాయి.