నేడు క్యాన్సర్ దినోత్సవం !
క్యాన్సర్ పై విజయం సాధిద్దాం!

యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రతి సంవత్సరం క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. వ్యాధి గురించి మరియు దానిని ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4, 1933న జరుపుకున్నారు. యూ ఐ సి సి కొన్ని ఇతర ప్రధాన క్యాన్సర్ సంస్థలు, చికిత్సా కేంద్రాలు, పరిశోధనా సంస్థలు మరియు రోగుల సమూహాల మద్దతుతో ఈ రోజును నిర్వహిస్తుంది.

కేన్సర్‌కు కారణాల్లో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం, ఆహారపదార్థాల్లో రంగులు వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్‌కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ క్యాన్సర్‌కు కారకాలు. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ వైరస్. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు. 9 ఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే అండాశయం, గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.
క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.
కేన్సర్ చికిత్సను కూడా వయస్సును బట్టి నిర్ధరిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్ థెరఫీ లాంటివి చేసినా, లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధరణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధికాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ కేన్సర్లు వస్తే వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ఆచారం క్యాన్సర్ కలిగి ఉన్న ప్రపంచ ప్రభావాన్ని తగ్గించడం మరియు వ్యక్తిగత, సామూహిక మరియు ప్రభుత్వ చర్యలను ఉత్ప్రేరకపరచడం ద్వారా క్యాన్సర్ రోగులకు మరియు ప్రాణాలతో బయటపడిన వారికి సహాయాన్ని అందించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ గురించి తప్పుడు సమాచారం మరియు కళంకాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటుంది.
భారతదేశంలో, రొమ్ము, నోటి, గర్భాశయ, ఊపిరితిత్తులు, కడుపు మరియు కొలొరెక్టల్ క్యాన్సర్‌లు అత్యంత సాధారణమైన క్యాన్సర్‌లు.ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. అవగాహనతోనే ఈ వ్యాధిని అరికట్టేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
.

వ్యాసకర్త: యం.రాం ప్రదీప్ తిరువూరు, 9492712836