నేడు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి!
*****.
న్యాయవాదిగా,మంత్రిగా,ముఖ్యమంత్రి గా ఆయన విశేష సేవలు చేశారు.దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పేరు పొందారు.25 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానం లో ఏనాడు ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులడలేదు. ముఖ్యమంత్రిగా 27నెలలు పాటు పనిచేసి, ఆ పదవి నుండి వైదొలగే నాటికి ఆయనకు సొంత ఇల్లు, సెంటు భూమి కూడా లేదు.ఇటువంటి నాయకులు ఈనాడు మనకు కన్పించరు.
రాజకీయాల్లో వివిధ పదవులు పొందాక పెద్దగా సంపాదించుకోని వారి జాబితాలో మనకు ఎక్కువగా కమ్యూనిస్టులే కన్పిస్తారు. ఇటువంటి నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు.వారిలో సంజీవయ్య ఒకరు.
సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించారు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివారు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవారు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించారు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరారు. 1935లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో ఎస్.ఎస్.ఎల్.సీ జిల్లాలోనే ప్రధమ స్థానం పొందారు.
సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా మాట్లాడేవారు.
1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.
వ్యాస కర్త-యం. రాం ప్రదీప్, 9492712836 తిరువూరు