రేపు సిఎం కెసిఆర్ కొండగట్టు పర్యటన వాయిదా!

ఎల్లుండి సీఎం రాక !


J. Surender Kumar,

సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా పడింది. రేపు భక్తుల రద్దీ కారణంగా.. సీఎం పర్యటన ఎల్లుండి కి వాయిదా పడింది. సీఎం కేసీఆర్ ఎల్లుండి కొండగట్టుకు రానున్నారు.
ఈ నెల 15 వ తేదీన హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉదయం 09.40 గంటలకు కొండగట్టు చేరుకుంటారు.


ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండ‌గ‌ట్టును ఆల‌యాన్ని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌నున్నారు. కోనేరు పుష్క‌రిణి, కొండ‌ల‌రాయుని గుట్ట‌, సీతమ్మ వారి క‌న్నీటిధార‌, భేతాళ స్వామి ఆల‌యంతో పాటు త‌దిత‌ర ప్రాంతాల‌ను సీఎం ప‌రిశీలించ‌నున్నారు.
దేవస్థానం అభివృద్ధికి ఇటీవలే 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన దృష్ట్యా ఆలయ అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనుల పై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు.


అనంతరం ఆలయం వద్దే అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 01.00 గంటకు తిరిగి హైదరాబాద్ కు వెళతారు.
15వ తేదీన కొండగట్టుకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో సోమవారం పర్యటన ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత, స్థానిక శాసనసభ్యులు సుంకే రవి శంకర్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ ఏ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత , మందామకరంద్, తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పర్యటన ఏర్పాట్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మంగళవారం ఉదయం కల్లా పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.


కొండగట్టు ఆంజనేయస్వామి స్వామి ఆలయ అభివృద్ధి పనుల ఎంపిక కోసం సిఎం కేసిఆర్ ఈ నెల 15 వ తేదీన కొండగట్టు లో పర్యటిస్తున్న దృష్ట్యా మంగళవారం రాత్రి 08.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 02.00 గంటల వరకు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి భక్తులను అనుమతించమని కలెక్టర్ తెలిపారు.
భద్రత, పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా దర్శనాలు

తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలనీ కలెక్టర్ యాస్మిన్ భాష విజ్ఞప్తి చేశారు.