ఆ ఆర్డినెన్సే కనుక ఉంటే రాహుల్ గాంధీ అనర్హత వేటు పడేది కాదా?

J.SURENDER KUMAR,.

నాలుగేళ్ల క్రితం నాటి ఒక ‘క్రిమినల్ పరువు నష్టం’ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో, దాన్ని కారణంగా చూపిస్తూ ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు.

2013 సెప్టెంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను అసంబద్ధమైనదిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1), ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ, తాజా పరిణామాల నేపథ్యంలో లోక్‌సభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.


అయితే, ఇలాంటి పరిస్థితుల్లో తక్షణం అనర్హత వేటు పడకుండా తనను కాపాడగలిగే ఒక ఆర్డినెన్స్‌ను గతంలో రాహుల్ గాంధీ వ్యతిరేకించారు.

ఆ ఆర్డినెన్స్‌లో ఏముంది?

ఈ రోజు లోక్‌సభ సభ్యత్వం విషయంలో తాను ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి రక్షించగలిగే ఒక ఆర్డినెన్స్‌ను పదేళ్ల కిందట రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ‘‘అసంబద్ధమైనదిగా’’ రాహుల్ గాంధీ 2013 సెప్టెంబర్‌లో అభివర్ణించారు.
2013లో యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
ఈ ఆర్డినెన్స్‌లోని కొన్ని షరతుల ప్రకారం, కోర్టులో దోషులుగా తేలిన తర్వాత కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయరాదని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు.
‘‘కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేల’’పై యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ‘‘అసంబద్ధమైనది’’గా అభివర్ణించిన రాహుల్ గాంధీ, దాన్ని చింపి పారేయాలని అన్నారు.
ఆ ఆర్డినెన్స్ గురించి అప్పట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘ఈ దేశంలోని ప్రజలు నిజంగా అవినీతిపై పోరాడాలనుకుంటే, ఇలాంటి చిన్న చిన్న రాజీలను చేయకూడదు.
ఇప్పుడు ఒక చిన్న రాజీకి తలొంచితే, ముందు ముందు అన్ని రకాల ఒత్తిడిలకు తలొగ్గాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం దక్కి ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో సూరత్ కోర్టు తీర్పు కారణంగా క రాహుల్ గాంధీ ఈ అనర్హత వేటు నుంచి బయటపడి ఉండేవారు.

చట్టసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నాయకులు ఎవరంటే..


లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ఇటీవలన పార్లమెంట్‌లో తన సభ్యత్వాన్ని కోల్పోయారు. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో 2023 జనవరి 11న ఆయన చట్టసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో దోషిగా తేలిన కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్, 2013లో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
2013లో దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దోషిగా తేలారు. దీంతో ఆ సమయంలో బిహార్‌లోని సారణ్ ఎంపీగా ఉన్న ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
దాణా కుంభకోణం కేసులో జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన జగదీశ్ శర్మ కూడా దోషిగా తేలడంతో 2013లో ఆయన కూడా లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జగదీశ్ శర్మ, బిహార్‌లోని జెహనాబాద్‌ ఎంపీగా ఉన్నారు.
2019లో ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్‌ను రాంపూర్‌లోని కోర్టు దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఎస్పీ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయన తప్పుడు వయస్సును చెబుతూ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీపై కూడా అనర్హత వేటు పడింది. 2013 అల్లర్ల కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది.


(BBC సౌజన్యంతో)