చెన్నమనేని రాజేశ్వరరావు …..
నిరంతర అధ్యాయనశీలి !

సంస్మరణ సభలో మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు!

J.Surender Kumar,

చెన్నమనేని రాజేశ్వరరావు మృతితో సమాజం అరుదైన ఒక మేధావిని, నిరంతర అధ్యయనశీలినీ, వరిష్ఠ పాత్రికేయుడిని కోల్పోయిందని తమిళనాడు మాజీ గవర్నర్ పీ.ఎస్.రామ్మోహన్ రావు విచారం వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు సోమజి గూడ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యుజే, మెఫీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన రాజేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముక్కుసూటి తనం, రాజీపడని మనస్తత్వం, నీతి, నిజాయితీ, నిర్భీతిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన ఉత్తమ పాత్రికేయుడు రాజేశ్వరరావు అని రామ్మోహన్ రావు కొనియాడారు.

సభకు అధ్యక్షత వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
రాజకీయ, సామాజిక అంశాలన్నింటినీ తర్కంతో విశ్లేషించగలిగిన మేధావి రాజేశ్వరరావు అని అన్నారు. సమకాలీన రాజకీయాలపై ఆయనకు కొంత హేయభావం వున్నా, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని ముక్తాయింపు చేసేవారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీయుడబ్ల్యుజె పట్ల, తెలంగాణ రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె పట్ల రాజేశ్వరరావు ఎంతో సానుకూలంగా వ్యవహరించేవారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ, జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తదితర సంస్థల ఏర్పాటులో రాజేశ్వరరావు పాత్ర ఎంతో ఉందన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వాలకు చీర్ లీడర్స్ గా కాకుండా ప్రజల పక్షాన నిలబడాలని నిరంతరం తపించే ఆదర్శ పాత్రికేయుడు రాజేశ్వరరావు అని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు.


ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ రాజేశ్వరరావు నడిచే గ్రంథాలయమని, పుస్తక పఠనం దినచర్యలో భాగమైతే, పట్టుబట్టి జర్నలిస్టుల చేత వాటిని చదివించడం ఓ ఉద్యమంగా భావించేవారని గుర్తుచేశారు. వందల పుస్తకాలు చదవడమే కాకుండా అందులోని విషయాలు గుర్తుపెట్టుకొని అవసరమైన చోట వాటిని ఉటంకించేవారని అమర్ అన్నారు. సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ ఎందరో ప్రముఖులతో రాజేశ్వరరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నా, ఆ సంబంధాలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఏనాడూ ఆయన వినియోగించ లేదన్నారు. చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతూ ఆఖరి శ్వాస విడవాలనేది ఆయన కోరిక అని, చివరిదాకా పుస్తకాలు చదువుతూ, వాటి గురించి మిత్రులతో చర్చిస్తూనే శాశ్వతంగా వెళ్లిపోయారన్నారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ చివరి ఊపిరి వరకు వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో, నిజాయితీగా నిర్వర్తించిన పాత్రికేయులు రాజేశ్వరరావు జీవితం నేటి తరం జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు.

ఇంకా ఈ సభలో రాజేశ్వరరావు సతీమణి సి.హెచ్.అంజనీ, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్లు వి.కొండల్ రావు, కే. యాదగిరి, ప్రముఖ వక్త క్రిష్ణసాగర్, ఆం.ప్ర.ప్రభుత్వ ఇందనశాఖ సిఇఓ ఎ. చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాజేశ్వరరావు జ్ఞాపకాలను స్మరిస్తూ పలువురు ప్రముఖులు రాసిన “మీతో మా జ్ఞాపకాలు” పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు.