మనస్థాపం చెందుతున్న భక్తజనం !
J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి డోలోత్సవం మొదటిరోజు కొందరు భక్తులకు అర్చకులు బొట్టు పెట్టడం, మరి కొందరికి పెట్టకపోవడం, పెట్టకపోవడానికి కారణం, ఆలస్యం అవుతుంది అంటూ సాకు చెప్పడంతో భక్తులు మనస్థాపం చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే…
స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు బ్రహ్మ పుష్కరిణిలో స్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవము నిర్వహిస్తారు. నీటిలో స్వామివారు ఐదు ప్రదక్షిణలు చేసి పుష్కరిణి మధ్యలో గల మంటపంలో స్వామివారిని ( ఊయల) డోలోత్సవం నిర్వహిస్తారు. భక్తజనం బారులు తీరి స్వామివారిని దర్శించుకోవడానికి మండపం లోకి వెళ్లి స్వామివారి పై బుక్క గులాలు ( సుగంధద్రవ్యాలు) చల్లుతూ ప్రదక్షిణలు చేసి మోక్కులు చెల్లించుకుంటారు. ఆ సమయంలో అందుబాటులో తులసి దండలు, ఉంటే భక్తులకు ప్రసాదంగా చేతికి అర్చకులు అందిస్తారు. లేదా భక్తుల నుదుట బొట్టు పెట్టడం అనాదిగా కొనసాగుతున్న తంతు. మంగళవారం జరిగిన స్వామి వారి డోలోత్సవంలో అధిక శాతం భక్తులకు అర్చకులు బొట్టు పెట్టలేదు. ఇదేం పద్ధతి బొట్టు పెట్టరా ? అంటూ ప్రశ్నించిన భక్తులను ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్లాలంటూ అర్చక స్వాములు వివరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మంటప ప్రాంగణంలో స్వామివారి బొట్టు అందుబాటులో ఉంటే భక్తుల స్వయంగా పెట్టుకునే వారు అని చర్చ. ఈ అంశం చిన్నదైనా, వివాదాస్పదమైన అంశం కాకపోయినా, భక్తజనం మనోభావాలతో ముడిపడి ఉండడం, సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు అంశం కావడంతో భక్తజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, అనాదిగా కొనసాగుతున్న తంతును యధావిధిగా కొనసాగించాలని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.