J.SURENDER KUMAR,
లిక్కర్ స్కాంలో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. మరో మూడు రోజుల పాటు పిళ్లై కస్టడీని పొడగించాలన్న ఈడీ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఈ నెల 16 వరకు పిళ్లై ఈడీ అదుపులోనే ఉండనున్నారు.
మరోవైపు 16 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు మరోసారి రావాలని ఈడీ కోరిన విషయం తెలిసిందే. దీంతో పిళ్లైను కవితతో కలిపి మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 15 న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. బుచ్చిబాబుతోనూ, పిళ్లైను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఈ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా సైతం ఈడీ అదుపులోనే ఉన్న సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కాంలో పిళ్లై, వాంగ్మూలం పక్కాగా నమోదు చేశామని, కానీ, ఒక బలమైన వ్యక్తికి సమన్లు జారీ చేశాకే (కవిత సమన్లను ఉద్దేశించి..) ఆయన తన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టును ఆశ్రయించారని, పిళ్లై ఎందుకు మాట మార్చారో స్పష్టమవుతోందంటూ కోర్టులో ఈడీ వాదించింది. లిక్కర్ స్కాంలో మరికొంత మందికి సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కాబట్టి పిళ్లై కస్టడీ పొడగింపు కీలకమని కోర్టుకు తెలిపింది ఈడీ. దీంతో ఈడీ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుని.. కస్టడీని పొడిగించింది.