జగిత్యాల ‘ఖిల్లా’ను గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం!


జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష !


J.SURENDER KUMAR,


శతాబ్దాల క్రితం నిర్మించిన, చారిత్రక ప్రాశస్త్యం గల ‘జగిత్యాల ఖిల్లా’ ను పర్యాటక ప్రాంతంగా
అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు.
జిల్లా కు అసెట్ గా జగిత్యాల ఖిల్లా ను అభివృద్ది చేసే ఉద్దేశ్యంతో  కలెక్టర్, స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ మందా మకరంద్ తో కలిసి శనివారం ఖిల్లా ప్రస్తుత పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఖిల్లా ప్రత్యేకత ను  కలెక్టర్ కు వివరించారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ…
సాంస్కృతిక, చారిత్రక వారసత్వం గల జగిత్యాల ఖిల్లా అర్కిటెక్చర్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా పురావస్తు శాఖ నిపుణుల సహాయంతో చారిత్రక ప్రాశస్త్యం, వైభవం ఉట్టిపడేలా పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా జిల్లాకు అస్సెట్ గా ఖిల్లా ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.


పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం పర్యాటక పరంగా జగిత్యాల కోటను మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖల సహకారం, సమన్వయంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ( DPR)ను త్వరలో సిద్ధం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు.
ప్రభుత్వము నుంచి ఆమోదం రాగానే పేరెన్నికగన్న అర్కియాలజిస్ట్ లు, ల్యాండ్ స్కేపింగ్ నిపుణుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి ఖిల్లా వైభవాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని చెప్పారు  రాబోయే కాలం లో టూరిజం హబ్ గా ఖిల్లా ను మారుస్తామని అన్నారు.
క్షేత్ర పర్యటనలో వెంట స్థానిక ఇంచార్జ్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆర్డీఓ మాధురి, DFO వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ నరేష్ , DRDO లక్షి నారాయణ, అర్కియాలజి ఎడి సాగర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

జగిత్యాల ఖిల్లా’ విశేషాలు


చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ కోటని  టాల్​, జాక్ అనే ఫ్రెంచ్​ ఇంజనీర్లు  పదిహేడో శతాబ్దంలో  కట్టించారు. సున్నపు రాయితో కట్టిన ఈ కోట నిర్మాణంలో  యూరోపియన్​ శిల్ప కళ ఆనవాళ్లు కనిపిస్తాయి. అప్పట్లో ఈ కోటలో సైనికులు ఉండేవాళ్లట. అంతేకాదు శత్రువులెవరూ ఈజీగా చొరబడకుండా కోట చుట్టూ లోతైన కందకాలు తవ్వించారు. నక్షత్రం ఆకారంలో ఉండే ఈ కోట దాదాపు 20 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది.  ఒకప్పుడు ఇందులో 90 ఫిరంగులు, కొయ్యతో చేసిన పెద్ద గేటు  ఉండేవి. కోట లోపల మందుగుండు సామగ్రిని దాచిపెట్టడానికి కట్టిన రహస్య గదుల్ని చూడొచ్చు. కోటలో మంచినీళ్లకోసం తవ్వించిన బావిలో ఇప్పటికీ నీళ్లున్నాయి.