మేల్కొన్న మహిళ లోకం…

(నేడు అంతర్జాతీయ శ్రామిక మహిళాదినోత్సవం)

పురుషులకు ప్రత్యేకంగా అధికారికంగా గుర్తింపు పొందిన దినోత్సవం లేదు.కానీ స్త్రీలకు, బాలికలకు ప్రత్యేకంగా ఉత్సవాలు ఉన్నాయి.1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికాలో దేశంలోని మహిళలకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనాలు కావాలనీ డిమాండ్ చేస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవంగాజరుపుతున్నారు.


1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జార్ 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు కొంటున్నారనేది మరోక వాదన ఉంది.సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి
గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు.

ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.


సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.భారత రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).
ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి.

వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్ 108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.
భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన

కారణమదే.ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.
కొన్ని సహస్రాబ్దులు గా భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు.


చరిత్రలోకొంత మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తిగా పేరు పొందింది.
గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది.
అక్బర్ ను 1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.
జహంగీర్ భార్య నూర్జహాన్ సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి వంటి వారు కూడా అత్యంత ధైర్య సాహసాలతో పాలన సాగించారు.
సమాజంలో ఉన్నత,మధ్య తరగతికి చెందిన మహిళలు కొంత ఆర్ధిక, సామాజిక భద్రత కల్గి ఉన్నప్పటికీ,పేద మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. వీరు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. పని ఒత్తిడిలో అనారోగ్యం పాలౌతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండటం,చిన్న వయసులోనే వివాహాలు అవ్వడం,తగినంత పౌష్టికాహారం వీరికి లభించక పోవడం వంటి కారణాల వల్ల వీరి పరిస్థితి అగమ్యగోచరంగా వుంది. బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే అంగన్ వాడీలు, చౌక డిపోల ద్వారా పేద కుటుంబీకులకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చర్యలు చేపట్టాలి.అప్పుడే శ్రామిక మహిళల జీవితాల్లో మార్పు వస్తుంది.

వ్యాసకర్త:
యం.రాం ప్రదీప్ తిరువూరు – 9492712836