విలేజ్ డయాస్పోరా వాట్సాప్ గ్రూపులే, రాజకీయ వేదికలు !
రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లే ఆయుధాలు !
***
పసుపు బోర్డు తరహాలో… గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ సాధన కోసం ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగిస్తూ… తెలంగాణ లోని గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు వేయాలని గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరం సమాలోచనలు చేస్తున్నది. మరోవైపు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మిక నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ వలసల అంశాన్ని ప్రముఖంగా పొందుపరచడానికి అంతర్గత కమిటీలను కూడా వేసుకుంటున్నాయి.
సుదూర ఎడారి దేశాల నుండి గ్రామాల వరకు గల్ఫ్ గాలి వీస్తున్నది. ఒక కోటి ఓటు బ్యాంకు కలిగిన గల్ఫ్ కార్మికుల సమూహం రాజకీయ అడుగులు వేస్తున్నది. భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న గల్ఫ్ కార్మికులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్ లను ఉపయోగించడానికి, రాజకీయ యుద్ధానికి స్మార్ట్ ఫోన్లు ఆయుధాలు కాబోతున్నాయి.
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు విలేజ్ డయాస్పోరా (గ్రామ ప్రవాసి) వాట్సప్ గ్రూపుల ద్వారా రాజకీయంగా సంఘటితమవుతున్నారు. వివిధ దేశాలలో నివసిస్తున్న వలస కార్మికులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోవడం వీలు కానందున వాట్సాప్ గ్రూపులను రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.
ఒక సంవత్సరం క్రితం… మార్చి 2022 లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గల్ఫ్ ఓటర్ల ప్రభావం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
ఉంటుందని కేసీఆర్ కు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ తగిన చర్యలు చేపట్టకపోతే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ‘గల్ఫ్ గండం’ ఖాయం ఉంటుందని పికె నివేదిక సారాంశం. అయినా కేసీఆర్ గల్ఫ్ విషయంలో పీకే మాటను ఖాతరు చేయలేదు. గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ వాళ్లకు ఓట్లు లేనందున పట్టించుకోవడం లేదని తెలిసింది.
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీం కూడా దాదాపు ఇదే విధమైన నివేదికను టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ఇచ్చినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి తన పర్సనల్ ఆర్ఆర్ టీం ద్వారా క్రాస్ చెక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి పాదయాత్రలో వేములవాడ, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

రాజకీయ నేతల గల్ఫ్ బాట
బిజెపి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల దుబాయిలో పర్యటించారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన పాదయాత్రలో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాలను కలిశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను ఓడించి బీజేపీ గెలుపొందడంలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రాధాన్యతను బిజెపి గుర్తించింది.
బీఎస్పీ తెలంగాణ ఇంచార్జి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల దుబాయిలో పర్యటించారు. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల తన జగిత్యాల జిల్లా పర్యటనలో గల్ఫ్ కార్మికుల సమస్యలపై
మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండంలో గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ గల్ఫ్ సమస్యల పోరాటంలో ముందున్నది. గత పదేళ్లుగా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గల్ఫ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
అమెరికన్, యూరోపియన్ ఎన్నారైలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం రాజకీయ పార్టీలకు పరిపాటి. ఈసారి గెలుపే లక్ష్యంగా
పనిచేస్తున్న పార్టీలు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అందులో భాగంగా గల్ఫ్ కార్మిక నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి ప్రతిపక్షాల కసరత్తు చేస్తున్నాయి. టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి వేములవాడ లేదా కోరుట్ల టికెట్ ను ఆశిస్తున్నారు. తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు జగిత్యాల టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
32 గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్లు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లోని 32 అసెంబ్లీ స్థానాలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉంటుందో పొలిటికల్ ఏజెన్సీలు పరిశీలన జరిపాయి. ఓటర్ల సంఖ్యను బట్టి ఎక్కువ ప్రభావం, ఓ మోస్తరు ప్రభావం అనే ఏ, బీ అనే రెండు క్యాటగిరీలుగా వర్గీకరించారు.
క్యాటగిరి-ఏలో
14 నియోజకవర్గాలు (25 నుండి 30 వేల ఓట్ల ప్రభావం): నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్
క్యాటగిరి-బి లో
18 నియోజకవర్గాలు (10 నుండి 20 వేల ఓట్ల ప్రభావం): ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి.
మంద భీమ్ రెడ్డి, (వ్యాసకర్త)
గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘం నాయకుడు.