రక్షక బటకార్యాలయం – ప్రశాంత నిలయం !
దేవుడి పల్లకి మోసిన పోలీసులు!

రికార్డులు తనిఖీ చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి !


ధర్మపురి లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ !


J. SURENDER KUMAR,

నిత్యం ఫిర్యాదుదారులతో, లాటి, బూట్ల చప్పులతో, తుపాకుల, నిఘా నీడలో ఉండే రక్షక భట కార్యాలయం, ప్రశాంత నిలయంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, పోలీసుల భక్తి పారవశ్యంతో హరినామ స్మరణ చేస్తూ, మామిడి తోరణాలు, అరటి చెట్లు, కొబ్బరి ఆకుల మట్టలతో వివిధ రకాలైన రంగు రంగుల పూలతో వేదిక ఏర్పాటుచేసి దేవదేవుడిని స్వాగతించి. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ, బంధుమిత్రులతో పాటు, పట్టణ ప్రజలను ,వేద పండితులను అర్చకులను, స్వామి వారు రక్షకబట కార్యాలయానికి రాక సందర్భంగా ఆప్యాయతతో ఆహ్వానం పలుకుతూ, అనాదిగా, శతాబ్ద కాలంగా, స్వాతంత్రానికి ముందే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ రక్షకబట కార్యాలయంలో కొనసాగుతున్న విషయం పోలీస్ ఉన్నతాధికారులలో కొద్ది మందికి మాత్రమే తెలుసు.

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ని పోలీస్ స్టేషన్ అది. లాఠీలు బూట్ల చప్పుళ్ల స్థానంలో మంగళ వాయిద్యాలు వేదమంత్రాల ఘోష వినిపించింది. తుపాకుల నిఘా నీడ స్థానంలో అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి తోరణాలు అగుపించాయి. పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు, కాకి డ్రెస్ కు బదులుగా సాంప్రదాయ దుస్తులు ధరించి, వారి కుటుంబ సభ్యులు మంగళహారతులు పట్టుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని స్వాగతం పలికిన అపూర్వ దృశ్యం గురువారం ధర్మపురి క్షేత్రంలో జరిగింది.


భారతదేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సనాతన సంప్రదాయం, ఆచారం, అనాదిగా ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్నది.
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రికార్డులను తనిఖీ చేసి, శాంతిభద్రతల అంశాలను పర్యవేక్షించి, ఘనంగా పూజలు అందుకోనున్నారు.


వివరాల్లోకి వెళితే
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర, దక్షిణ ,దిగ్విజయ యాత్ర కొనసాగడం. ఇందులో భాగంగా శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లడం సనాతన సంప్రదాయం. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఆలయమునకు వెళ్లి స్వామివారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం ఆనవాయితీ.

స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు ,వేద మంత్రాల, ఘోషతో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ,మంగళహారతులతో స్వామివారిని ఆలయ ప్రాంగణం నుండి పట్టణ క్షేత్రంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం సాగుతున్న ఆచారం.
పోలీస్ స్టేషన్ ఆవరణ ప్రాంగణంలోకి స్వామి చేరుకోగానే పోలీస్ కుటుంబ సభ్యులు మంగళహారతులతో స్వాగతం పలికి స్టేషన్ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని ఆహ్వానిస్తారు.

ఆలయ వేదపండితులు, అర్చకులు, ఘనంగా వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదిస్తారు. స్వామివారి పల్లకి నీ పోలీస్ అధికారులు భుజానికెత్తుకుని పోలీస్ స్టేషన్ ఆవరణలో కి తీసుకువెళ్తారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొంటారు పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని రికార్డులు స్వామి ముందు ఉంచుతారు . ఎస్ పి డి ఎస్ పి సి ఐ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పుర ప్రముఖులు ,ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.