తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ
కళాశాల, కోఠి ప్రిన్సిపల్ గా

ప్రొఫెసర్ వారిజారాణి నియామకం !

J. SURENDER KUMAR,

ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ధర్మపురికి చెందిన డా॥ వారిజారాణి. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ కళాశాల, కోఠి ప్రిన్సిపల్ గా
ప్రొఫెసర్ వారిజారాణి నియమితులయ్యారు.
ప్రొఫెసర్ వారిజారాణి ధర్మపురి లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు. వీరు బి.ఎ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బంగారు పథకం సాధించారు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు సంస్కృత భాషల్లో ఎం.ఎ పట్టాను ఉత్తమశ్రేణిలో సాధించారు.   

  కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో తెలుగు విశ్వ విద్యాలయం నుండి ఎం.సి.జె పట్టా పొందారు. కేంద్రీయ విశ్వ విద్యాలయం నుండి ప్రముఖ విమర్శకులు, సాహితీమూర్తులైన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారి పర్యవేక్షణలో
ఎం. ఫిల్ మరియు పి.హెచ్ డి పట్టాలను పొందారు. వీరు పి.హెచ్ డి పట్టాకొరకు తులనాత్మక అధ్యయనంలో  తెలుగు, సంస్కృత కావ్యాలలో ప్రక్రియా భేదంతో వచ్చిన ఒకే ఇతివృత్త కావ్యాలపై పరిశోధన చేసారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన కంప్యూటర్ విద్యలో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సాధించారు. యూజీసీ నిర్వహించే NET మరియు రాష్ట్ర సర్వీస్ కమీషన్ నిర్వహించిన SLET లలో ఉత్తీర్ణులయ్యారు.   తెలుగుపండిట్ శిక్షణ, సంగీతంలో డిప్లొమా వీరి అదుపు అర్హతలు.
ప్రొఫెసర్ వారిజారాణి  భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే దేశవ్యాప్తంగా  సాహిత్య, సంగీత, నాటక, వివిధ కళా రంగాలకు చెందిన   వందమంది ప్రతిభావంతులైన యువతీ యువకుల ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చే రెండు సంవత్సరాల స్కాలర్ షిప్ 2005 లో ఎంపిక అయ్యారు. దానిలో భాగంగా వీరు ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాల మీద పరిశోధన చేసారు. వారిజారాణి యూజీసీ వారి మైనర్ రీసెర్చి ప్రాజెక్టుకు ఎంపిక కాబడ్డారు. దానికై “మహాభారతం- స్త్రీవాద దృక్కోణ అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసారు.
ప్రొఫెసర్ వారిజారాణి అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. దాదాపు నలభై పత్ర సమర్పణలు చేసారు. ఇంతేకాక దాదాపు ముప్ఫైకి పైగా పరిశోధనా ప్రచురణలు గావించారు. వీరు తెలుగులోనే కాక “Impact of Globalization on Indian Polity, Telugu Language and Literature” , “ The Feministic Approach of Gurajada Kanyashulkam” మరియు “ The Contribution of Hyderabad Sansthan (Province) Literature in the development of Hyderabad Culture” ఆంగ్ల పరిశోధనా ప్రచురణలు చేసారు. ప్రభుత్వ RUSA ప్రాజెక్టులు “తెలంగాణలో ఎరుకల భాష” మరియు  “బంజారా లిపి” పై పరిశోధకులుగా పని చేసారు.


ప్రొఫెసర్ వారిజారాణి వివిధ కళాశాలల్లో, విశ్వ విద్యాలయల్లో విస్తృతోపన్యాసాలు చేసారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ ఫాకల్టీగా బోధిస్తున్నారు. వివిధ సాహిత్య సభల్లో విశేష అతిథులుగా, అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ విశ్వ విద్యాలయాల, కళాశాలల పాఠ్య ప్రణాళిక సభ్యులుగా ఉన్నారు. వీరు అంబేద్కర్ విశ్వ విద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం, ప్రభుత్వ ఓపెన్ స్కూల్ సొసైటీల దూర విద్యకై పాఠ్య రచనలు చేసారు. వీరు రచించిన పుస్తకం “ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాలు”  ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రింపబడింది. వీరు ఇతర నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.  వివిధ విశ్వ విద్యాలయాలలో పరీక్షకులుగా  వ్యవహరించారు. వీరు భారత ప్రభుత్వ సమాచార శాఖ వారిచే  ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యులుగా నియుక్తులై  రెండు సంవత్సరాలు సేవలందించారు. ఆకాశవాణిలో ప్రసంగాలు చేసారు.  టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రసంగించారు,  న్యాయ నిర్ణేతగావ్యవహరించారు.
వివిధ అవార్డులు గ్రహించారు.
ప్రొఫెసర్ వారిజారాణి  వద్ద పరిశోధన చేసి ఆరుగురు పి హెచ్ డి పట్టా పొందారు. ప్రస్తుతం పద్దెనిమిది మంది పి హెచ్ డి పట్టాకై పరిశోధన చేస్తున్నారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని వివిధ పరిపాలన, పరిశోధన, సాంస్కృతిక  కమిటీల్లో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా నిన్నటి వరకు కొనసాగారు