J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృత్‌నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.

శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఫల – పుష్ప ఆకృతులు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శ్రీవారి ఆలయంలో లోపల చేసిన

పుష్పాలంకరణలకు పుణెకి చెందిన దాత శ్రీ గోవింద మండోట్ సహకారం అందించారు. ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీసుకెళుతున్న గరుత్మంతుడు అనే పోవడానికి ఘట్టాన్ని బెంగళూరుకు చెందిన దాత శ్రీ అరుణ్ రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మిదేవితో శ్రీమహావిష్ణువు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయలు కోస్తున్న శ్రీకృష్ణుడు, పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వీటిని తిరుపూర్ కు చెందిన దాత శేఖర్ రూపొందించారు. సేలానికి చెందిన చంద్రశేఖర్,బాల సుబ్రహ్మణ్యం ఆలయం వెలుపల పుష్పాలంకరణలకు సహకారం అందించారు. ఆలయం బయట భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.
టిటిడి గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు మూడు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల – పుష్ప ఆకృతులను రూపొందించారు.