అన్నదాతలను నట్టేట ముంచిన నకిలీ పురుగుల మందులు!

చడీ చప్పుడు కాకుండా సెటిల్మెంట్ !


కేసులు కాకుండా కాసులతో బేరం ?


జగిత్యాల జిల్లాలో జోరుగా వ్యాపారం!

J.SURENDER KUMAR,

రాత్రి, పగలు, ఎండ, వానలలో తమ రక్తం చెమటగా మారుస్తూ, జనాలకు అన్నం అందించడానికి అహోరాత్రాలు శ్రమిస్తున్న అన్నదాతలను నకిలీ పురుగుల మందు నట్టేట ముంచడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అన్నదాతలకు అండగా ఉండాల్సిన కొందరు వారిని, నయానా భయానా మభ్యపెట్టి , నకిలీ మందులు తయారీదారులు విక్రయదారులతో గుట్టు చప్పుడు కాకుండా గత 15 రోజుల క్రితం సెటిల్మెంట్ చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. విక్రయదారుల, తయారీదారుల పై కేసులు నమోదు కాకుండా కాసులతో బేరం మొదలైనట్టు చర్చ. జగిత్యాల జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పురుగుల మందు, విత్తనాల విక్రయాల పట్ల సంబంధిత నిఘా శాఖ నిద్రపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల తదితర సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వంకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కీర్తి నకిలీ విత్తనాలు మందులు విక్రయాలతో మసక బారుతుందనే చర్చ నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.
ధర్మపురి
మండలం రామయ్య పల్లె, కమలాపూర్, బూరుగుపల్లి, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన కొందరు రైతులు తమ పొలాలకు తెగుళ్లు, పురుగులు, పొట్ట దశలో ఉన్న వాటి కోసం ‘కొరజన్’ క్రిమిసంహారక మందులను విక్రయదారుడి వద్ద వేలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. దాదాపు 60, 70 ఎకరాల్లో పంట పొలాలకు వినియోగించారు. పంట పొలాలకు పట్టిన తెగులు , పురుగులను నివారించకపోవడం, ఆశించిన దిగుబడులు రాకపోవడం, పురుగుల మందు తయారు చేసిన రైతులు తమకు మందు విక్రయించిన డీలర్‌ను నిలదీశారు. పంట పొలాల వద్దకు తీసుకువెళ్లి పంటలను చూపించారు. ఎకరానా దాదాపు ₹ 30 వేల రూపాయల పెట్టుబడి, లక్షలాది రూపాయల పంట నష్టం కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నకిలీ పురుగుల మందు మాకు విక్రయిస్తావా ? అంటూ నిలదీశారు. ఈ దశలో ఎకరానికి కొంత ఇస్తాను, అంటూ విక్రయదారుడు అనడంతో మా పంట పొలాలు నువ్వే కోసుకొని వెళ్ళు అంటూ కొందరు రైతులు వాదనకు దిగినట్టు సమాచారం.


ఈ దశలో కొందరు జోక్యం చేసుకొని కేసులు పెడితే ఏం వస్తుంది ? అంటూ పురుగుల మందు తయారీదారుడు, మరియు విక్రయిదారులతో గుట్టు చప్పుడు కాకుండా అనేకసార్లు రైతులతో చర్చించి ఓ అంగీకారం కుదుర్చుకున్నట్లు చర్చ. ఎకరానికి ఇంత నష్టపరిహారం ఇస్తాడంటూ రైతులకు అంగీకార పత్రాలు వ్రాయించి ఇచ్చినట్టు చర్చ.
విధి లేని పరిస్థితులు అంగ బలం, అర్థ బలం లేని, అమాయక రైతులు కొందరు చెప్పిన కండిషన్ కు తల ఒగ్గినట్టు చర్చ. సెటిల్మెంట్ చేసిన వారే పురుగుల మందు తయారీదారులు, విక్రయదారుల పై ఎలాంటి కేసులు నమోదు కాకుండా . ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.


శనివారం ధర్మపురి మండలం లోని నరసయ్య పల్లె గ్రామంలో రైతు వేదిక సమావేశం మందిరంలో ‘ రైతు న్యాయ సలహా కేంద్రాన్ని’ ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్యాం ప్రసాద్, ప్రారంభించి రైతులకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్న వివరాలు వివరించారు. ఈ దశలో మండల రైతు బంధు కోఆర్డినేటర్ సౌల్ల భీమయ్య, నకిలీ పురుగుల మందు విక్రయాల అంశం రైతులకు జరిగిన నష్టాన్ని జడ్జి కి తన ప్రసంగంలో భీమయ్య వివరించారు.

పంట నష్టం కోల్పోయిన ప్రతి రైతుకు రెండు లక్షల నష్టపరిహారాన్ని తయారు చేసే దారులు, విక్రయదారులతో ఇప్పించి రైతాంగం ఆదుకోవాల్సిన అవసరం, అధికార, ప్రతిపక్షాల, రాజకీయ పార్టీలదే కనీస బాధ్యత అనే చర్చ ఉంది.
నకిలీ పురుగుల మందు ఎక్కడివో ?
అమృత్, మార్వెల్, త్రిసూల్, గ్రోబెస్ట్, సుప్రీం గోల్డ్, తీన్‌మార్, లియోజ్మీ, టెజ్మీ, డాలర్ ఇలా వివిధ రకాల పేర్లతో తయారు చేసిన రసాయన పదార్ధాలు, మందులను ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసి తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విక్రయాలు కొనసాగుతున్నాయని చర్చలు కొనసాగుతున్నాయి.
గతంలో నమోదైన కేసులు!
2014 నుంచి 2022 వరకు నకిలీ విత్తనాలు అమ్మిన 1,932 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద 991 కేసులు నమోదు చేశారు. పదే పదే అక్రమాలకు దుకాణ యజమానులపై 58 పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేశారు.