ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందాం సీఎం కేసీఆర్ !

J.SURENDER KUMAR,

ఆవేశంతో కాదు.. ఆలోచనతో దేశాన్ని కాపాడుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు బుధవారం ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ అన్నారు.
దేశం సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురుచూస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ దేశం అందరిదని… గంగజమునా తెహజీబ్‌ సంస్కృతిని కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


మైనార్టీల సంక్షేమం కోసం 9 ఏళ్లలోనే 12వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో దేశంలో అగ్రగ్రామిగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నివారించామని తెలిపిన సీఎం కేసీఆర్… నిరుద్యోగం కూడా తగ్గినట్లు తెలిపారు. దేశంలో ఈ రోజు ఒక వింతపోకడలో పయనిస్తోందనే విషయం అందరికీ తెలుసు. భారత్‌ మనందరిదీ ఎలాంటి పరిస్థితులైనా కాపాడుకోవాలి. చిన్నచిన్న అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది.

మన దేశ వారసత్వమైన గంగా జమునా తెహజీబ్‌ను ఎవరూ మార్చలేరు. ఎవరైనా మార్చాలనే ప్రయత్నిస్తే వారే అంతమవుతారు. దేశం మాత్రం అంతం కాదు. ఈ విషయంలో నాపై విశ్వాసం ఉంచండి. దేశం ఓ సరైన నాయకుడు, పార్టీ కోసం ఎదురు చూస్తోంది. ఇందుకోసం ముందుకెళ్లి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

కేసీఆర్‌తో పాటు విందుకు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు.