గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ ను పట్టించుకోని గెలిచిన బీజేపీ ఎంపీలు !
2019 లో మూడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన గల్ఫ్ ఓటు బ్యాంకు!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్ పై ఆశపెట్టుకున్న కాంగ్రెస్ !
****
ఉత్తర తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం గతంలో ఏవిధంగా ఉన్నది, రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనే అంశంపై ప్రవాసి మిత్ర సంస్థ, కొందరు యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన లో బీఆర్ఎస్ కు గల్ఫ్ కుటుంబాలు దూరం అయినట్టు, రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
గల్ఫ్ పై కాంగ్రెస్ ఆశలు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అటకెక్కింది. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన గల్ఫ్ కార్మికులు ఈసారి తమకు ఓటు వేస్తారని కాంగ్రెస్ ఆశిస్తున్నది.
గల్ఫ్ కు బీజేపీ ఎంపీలు ఏం చేశారు
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు పార్లమెంటు స్థానాల్లో గల్ఫ్ కార్మికుల మద్దతుతో బీజేపీ అభ్యర్థులు గెలిచి ఏప్రిల్ 11 నాటికి నాలుగేళ్లు కావస్తున్నది. గల్ఫ్ ప్రభావిత ఉత్తర తెలంగాణ లో గెలిచిన ముగ్గురు బిజెపి ఎంపీలు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేశారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
కరోనా కష్ట కాలంలో.. వందే భారత్ మిషన్ ఫ్లయిట్స్ లో రెండింతల చార్జీలు, ఛార్టర్ ఫ్లయిట్స్ లో మూడింతల చార్జీలు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వంపై గల్ఫ్ కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కరోనా సమయంలో కేరళ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ సంఖ్యలో విమానాలను నడిపిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ కు తక్కువ విమానాలను నడిపినప్పుడు బీజేపీ ఎంపీలు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
చార్టర్ ఫ్లయిట్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాండింగ్ పర్మిషన్ ఇవ్వడంలో జాప్యం చేయడం కూడా సమస్య మరింత జటిలం అయ్యింది. కొద్ది రోజులు మాత్రమే ఉచిత క్వారంటైన్ వసతి కల్పించి, తర్వాత హోటల్ క్వారంటయిన్ ఛార్జీలతో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఇబ్బందులకు గురి చేసింది. అధిక విమాన ఛార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడు అయి కార్మికులు అప్పులపాలు అయ్యారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా ‘హోం క్వారంటైన్’ కు అనుమతి ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు హోటల్ క్వారంటైన్ తోపాటు, పేదలకు ఉచిత క్వారంటైన్ కూడా ఇచ్చాయి.
ఎంపీలు ఈ పనులు చేయించవచ్చు
హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటు అయ్యేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. ప్రవాసి బీమా పథకం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. కరోనా సందర్భంగా గల్ఫ్ తదితర దేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం కోసం… బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి.
అసెంబ్లీ వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు
ఉత్తర తెలంగాణ లోని మూడు పార్లమెంటు స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు అంచనా ఈ విధంగా ఉన్నది. ఈ-మైగ్రేట్ లో గల్ఫ్ వలసల డేటా, ఆమ్నెస్టీలు, సంక్షోభాలు, కరోనా సందర్భంగా గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారి డేటా, ఫారిన్ రెమిటెన్సెస్ డేటా, గల్ఫ్ బాధితుల డేటా, గల్ఫ్ మృతుల డేటా, మండలాల వారీ అంచనాలు, గల్ఫ్ సంఘాల అంచనాలు తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ అంచనా వేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఖచ్చితమైన డేటా అందుబాటులో లేదు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలో అధికారికంగా సర్వే చేయించి తగిన ప్రణాళికలు వేస్తున్నది.
తెలంగాణ నుంచి గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లే కార్మికుల్లో 99 శాతం పురుషులే. ఎన్నికల సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు ఇండియాకు రారు ఓటు వేయరు. కానీ ఒక్క గల్ఫ్ కార్మికుడు కనీసంగా తన ఇద్దరు కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తాడని 2019 పార్లమెంటు ఎన్నికలు రుజువు చేశాయి. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో పునరావాసం పొందడానికి ప్రభుత్వాల సహకారం అందనివారు కూడా ఉన్నారు. వీరందరిని కలిపి ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికుల పక్షాన ఇండియాలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు, గల్ఫ్ వాపసీలను ఈ విశ్లేషణలో లెక్కలోకి తీసుకోవడం జరిగింది.
నిజామాబాద్ పార్లమెంట

నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలలో 15,54,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,38,194 పురుష ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లలో 18.5 శాతం అనగా 1,37,053 మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని అంచనా. గత పది ఏళ్లలో 73,009 మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారని అంచనా. మొత్తం ఓటర్లలో
గల్ఫ్ కుటుంబాల ఓటు బ్యాంకు 22.3 శాతం అనగా 3,47,115 మంది ఉన్నట్లు అంచనా.
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ గా ఉన్న కాలంలో… 12 జూన్ 2015 నాడు బహరేన్ దేశంలో కార్మిక క్యాంపులను సందర్శించి, అక్కడ కార్మికులతో సహపంక్తి భోజనం చేసిన సందర్భంగా ‘గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం’ అని అన్నారు. తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో గల్ఫ్ తో కలుపుకొంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు అని గల్ఫ్ కు ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
వ్యాసకర్త: మంద భీంరెడ్డి, గల్ఫ్ వలసల విశ్లేషకులు +91 98494 22622