ధర్మపురి ఆలయంలో… అర్చకులను, వేద పండితులను వేధిస్తున్నది ఎవరు ?

అధికారా ? అవుట్ సోర్స్ ఉద్యోగా ?

సనాతన సాంప్రదాయం కు మంగళ !

సీఎం కేసీఆర్ ఇష్టదైవ ఆలయంలో ఇష్టారాజ్యం!


J.SURENDER KUMAR,

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొందరు అర్చకులు, వేద పండితులు, తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వేదనకు గురి చేస్తున్నది అధికారా ? ఔట్సోర్స్ ఉద్యోగి నిత్య నివేదికలు కారణమా ? అనే అంశం విజిలెన్స్ విచారణ జరిపితే కానీ వెలుగు చూసే అవకాశం లేదు. శతాబ్దాలుగా స్వామివారికి నిత్యం పంచోపనిషత్తులతో అభిషేక నిర్వహించే పురోహితులను, పంచోపనిషత్తులు. ఉచ్చరించకుండా, కేవలం శాశ్వత అభిషేక , టికెట్టు కొనుగోలు చేసిన భక్తుల గోత్రనామాలతో సంకల్పాలు మాత్రమే చేయాలి, అంటూ వారికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సామవేద పారాయణదారుడు, స్వామి వారి అభిషేక సమయములో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మైకు ద్వారా యజుర్వేదం ( పంచోపనిషత్తులు) చెప్పాల్సిందిగా ఆలయ అధికారి సామవేద పారాయణదారుడికి జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు.

తాత ముత్తాతల కాలంగా. ధర్మపురి క్షేత్రానికి, గోదావరి నది తీరంకు, ఆలయానికి, వంశపార్యం పురోహితులుగా కొనసాగుతున్న వారిని స్వామివారి అభిషేకం సందర్భంగా అభిషేక పురోహితులుగా నియమితులైన వారిని పంచోపనిషత్తులు చెప్పకుండా అడ్డుకోవడం సనాతన సాంప్రదాయానికి మంగళం పాడినట్టే నే చర్చ నెలకుంది. ఇది ఇలా ఉండగా సనాతనంగా బొజ్జ వంశీయులు స్వామివారి అభిషేక సమయంలో ఉచ్చరించే పంచోపనిషత్తులను అభిషేక పురోహితులుగా నియమించబడ్డ వారిని గత నాలుగు రోజులుగా శనివారం నాటి వరకు దూరం పెట్టడంతో క్షేత్ర వాసులు, భక్తులు అధికారుల చర్యలను అసహ్యించుకుంటున్నారు

శనివారం స్వామివారి అభిషేక పురోహితులు అభిషేక సమయంలో ఆశీర్వచన మండపంలో కూర్చున్న దృశ్యం!

దివ్యాంగ అర్చకుడికి వేధింపులు !

ఆలయంలో స్వామివారి నివేదన ప్రసాద వితరణ చేస్తున్న దినసరి వేతన దివ్యాంగ అర్చకుడు సైతం వేధింపుల బారిన పడినట్లు చర్చ. దివ్యంగా అర్చకుడు ప్రసాద వితరణ సమయంకు కొన్ని గంటలు ముందుగా ఆలయానికి వచ్చి ఆలయంలో పరిచర్యలు చేస్తుంటాడు. కేవలం ప్రసాదాలు పంపిణీ చేయాలి, ఇతర పనులు చేయవద్దు అంటూ అతడిని మౌఖికంగా ఆదేశించడంతోపాటు, ప్రసాదాల పంపిణీ తీరుతేనులపై వేధింపులకు గురి చేసినట్టు చర్చ. వేధింపులు భరించలేని ( మూగ అర్చక దివ్యాంగుడు) కార్యాలయంలో అధికారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలినట్టు ఆలయ సిబ్బంది, భక్తులు చర్చించుకుంటున్నారు.
నిఘా నీడలో… ఇష్టారాజ్యం..
రాష్ట్ర సాధన ఉద్యమంలో ధర్మపురి దేవుడు, ఆలయ వేద పండితులు, 2003 పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో ‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నమస్తు’ అంటూ చేసిన నాటీ సంకల్పం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి స్వరాష్ట్రంలో ఘనంగా గోదావరి పుష్కరాలు ఏర్పాటు చేసుకుంటున్నామని, అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ నా ఇష్ట దైవం, ఆలయం ధర్మపురి అని వివరించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఆలయంలో ఇష్ట రాజ్యం గా కొనసాగుతున్న సంఘటనలు అనేకం!
గత కొన్ని సంవత్సరాలగా ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో కొనసాగుతున్న ధర్మపురి ఆలయంకు గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ కార్య నిర్వాణ అధికారి, ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ అధికారికి బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలన సౌలభ్యమా ? అనుక్షణం ఉద్యోగుల ,అర్చకుల పనితీరు పర్యవేక్షించడం కోసమా? తెలియదు కానీ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న దినసరి వేతన ఉద్యోగి ( ఔట్సోర్సింగ్ ఉద్యోగి) కి వీరి కదలికలపై సమాచార బాధ్యతలు అప్పగించినట్లు చర్చ. ఈ చర్చకు బలం చేకూరేలా ఆ ఉద్యోగి ‘ సార్ నన్ను మొత్తం చూడమన్నారు అంటూ’ బహిరంగంగా చెప్పుకోవడం జగమెరిగిన సత్యం. ఉద్యోగుల, అర్చకుల, వేద పండితుల ,సమయపాలన, పారాయణం, అభిషేకం పురోహితుల వివరాలు స్వామి వారి కళ్యాణం, నరసింహ , కుజ నివారణ దోష హోమ పూజాది కార్యక్రమాల వివరాలు, పాల్గొన్న వారి ఫోటోలు వాట్సప్ ద్వారా అధికారికి క్షణ క్షణం అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాలలో. నివాసం ఉంటూ నిత్యం ధర్మపురి ఆలయంలో విధుల నిర్వహణకు రాకపోకలు కొనసాగిస్తున్న ఉద్యోగుల పట్ల మాత్రం అధికారులు ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితం వేద పండితుడిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. వేద పండితుడు తనకు జరిగిన అవమానాన్ని, బాధను స్థానిక మంత్రికి మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి ఆ సెక్యూరిటీ గార్డును వెంటనే వీధిలోంచి తొలగించమని ఆదేశించిన విషయం తెలిసిందే. ఉద్యోగులను విభజించు పాలించు అనే పద్ధతిలో పాలన కొనసాగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సొంత పనుల కోసం ఆలయ , ఉద్యోగులు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణ జరిపితే తాము వెట్టి బానిస సంకెళ్ల నుంచి విముక్తి అవుతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులకు పదోన్నతులు ( ప్రమోషన్లు) వచ్చిన వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేయడంతో తాము ప్రమోషన్లు కోల్పోతున్నామని మరికొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు ఆలయ ఆదాయం, ఖర్చులు, నిర్వహణ తిరుతేన్నులపై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సమాచారం కోరిన అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

PRC పేరిట వసూళ్లే ముసలంకు కారణమా ?
ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులకు PRC వేతన అమలు సిఫారసు D.C కార్యాలయ ఖర్చులకోసం ఒక్కొక్కరి వద్ద ₹6000/- (అరు వేల రూపాయలు) 30 మందికి పైగా ఓ ఉద్యోగి వారి నుంచి వసూలు చేసినట్లు సమాచారం. నిబంధనలు, సర్వీసు రూల్స్ కు విరుద్ధంగా తాను పిఆర్సి వేతనం కోసం సిఫారసు చేయను. అంటూ ఆ శాఖ వరంగల్ ఉన్నతాధికారి. ధర్మపురి ఆలయ ఫైల్ తో పాటు, మరికొన్ని ఆలయాల ఫైల్స్ ను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ధర్మపురి ఆలయ అర్చకులు, వేద పండితులు, స్థానిక మంత్రి ని, ఆర్థిక మంత్రిని కలిసి PRC వేతన అమలు కోసం అనేకసార్లు కోరారు. స్థానిక మంత్రి సిఫారసుల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. స్పందించిన కమిషనర్
డిప్యూటీ కమిషనర్ సిఫారసు లేకుండానే. నిబంధనల మేరకు PRC నీ అమలు చేశారు.
అయితే ఖర్చుల పేరిట వసూలు చేసిన ₹ 1,80 వేలు ( ఒక లక్ష ఎనబై వేలు) ఏం చేశారని? సరెండర్ లీవ్, వేతనం కోల్పోయామని, ఏరియర్స్ తమ ఖాతాలో జమ కాలేదని కొందరు ఉద్యోగులు.. ఓ ప్రముఖుడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో PRC ఖర్చుల పేరిట వసూలు సొమ్ము ఏమైందని, బాధ్యులను ప్రముఖుడు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో సదరు బాధ్యుడు తమకు డబ్బు ఎవరిచ్చారు? అంటూ అసభ్య పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను అపాఖ్యాతి చేస్తున్నారు అనే కక్షతో కొందరు అర్చకులను, ఉద్యోగులను, వేద పండితులను వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు జోక్యం చేసుకొని సనాతన సాంప్రదాయ ప్రకారమే స్వామివారికి అభిషేకం పూజాది కార్యక్రమాలు కొనసాగుల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.