సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
J.SURENDER KUMAR,
ఈ రోజు మొదలయ్యే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి డాక్టర్ కోసం మీరు వెళ్లాల్సిన పనిలేదు. మీ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు కూడా పోవాల్సిన అవసరం లేదు. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు. మీ ఇంటికి చేరువకే వస్తాడు. మీ కుటుంబం కోసం మన పేదల కోసం అక్కడికే వైద్యుడితో పాటు వైద్య సేవలు కూడా వస్తాయి. మందులు కూడా మీ గ్రామానికే మీ దగ్గరకే వచ్చే గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..
ఈ రోజు ఇక్కడ చెరగని చిరునవ్వుల మధ్య మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వా తాతకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
దేశ చరిత్రలో గొప్ప మార్పు..
సామాన్యుడికి అందే వైద్యం విషయంలో దేశ చరిత్రలోనే కనీ, వినీ, ఎరుగని ఒక గొప్ప మార్పుకు ఈరోజు ఇక్కడ ఈ గ్రామం నుంచి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఇంటింటా, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యభరోసా ఇస్తూ నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్ధాయిలో అమల్లోకి వస్తుంది.
జరగబోయే మార్పును ఒకసారి క్లుప్తంగా అర్ధమయ్యేలా చెపుతాను. ఈ రోజు పెన్షన్లు ఏమాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తున్నాయో… అదేమాదిరిగా వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి అవసరమైన సందర్భాలలో మీ ఇంటికి కూడా కదిలి రావడమే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం.
అసలు ఫ్యామిలీ డాక్టర్ ఎలా పనిచేస్తుందంటే.!
పేదలు, పేద సామాజిక వర్గాలవారు హాస్పిటల్స్ చుట్టూ, వైద్యుల చుట్టూ తిరాగల్సిన అవసరం లేకుండా, పరీక్షలు చేయించుకోవడం కోసం పరీక్ష కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఇవన్నీ కూడా మన గ్రామం వద్దకే, మన వద్దకే వచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్. ఆధునిక వైద్యాన్ని మీ గ్రామం వద్ద ఉచితంగా అందించడానికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ తీసుకువచ్చాం.
మన గ్రామంలో మంచానికే పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న చాలామంది రోగులు ఉన్నారు. వీళ్లందరికీ కూడా వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేయడం కోసమే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను తీసుకువచ్చాం.
ఓ రోల్‌మోడల్ కాన్సెఫ్ట్…
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని ఒక నానుడి ఉంది. జబ్బులు ముదరకుండా… రాకుండా కాపాడేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను తీసుకువచ్చాం.
ప్రివెంటివ్ కేర్‌లో ఫ్యామిలీ డాక్టర్ రూపేణా… తీసుకువస్తున్న ఈ మార్పు దేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్‌గా నిల్చిపోతుంది. ఈ రోజు ఆంధ్రరాష్ట్రంలో మొదలైన ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ మీరు చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో దేశం మొత్తం మనదగ్గరకి వచ్చి కాపీ చేసుకుని దేశంమొత్తంమ్మీద అన్నిరాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేసే రోజు దగ్గరలోనే ఉంది. దేశానికే ఇది రోల్‌మోడల్‌గా .. నూతన అధ్యాయంగా నిలుస్తుంది.
నేను ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఊరులో ఎంతమందికి బీపీ ఉంది, ఎంతమందికి షుగర్ ఎక్కువగా ఉంది ఇవే కాకుండా రక్తహీనత, విటమిన్ లోపంతో పాటు ఇతరత్రా జబ్బులు ఈ గ్రామంలో ఎంతమందికి ఉన్నాయి ? కేన్సర్, గుండెజబ్బులు, టీబీ,ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు ఈ గ్రామంలో ఎంత మంది ఉన్నారు ?వాళ్లందరికీ స్క్రీనింగ్ జరిగిందా? స్క్రీనింగ్ దశలోనే వాళ్లందరినీ గుర్తించగలిగితే.. తొలిదశలోనే వాళ్లందరినీ గుర్తించగలిగితే సంబంధిత వ్యాధి ముదరకమనుపే వారికి అవగాహన కల్పిస్తూ.. వైద్యం చేస్తూ మందులిచ్చే కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్.
పేదవాడి ఆరోగ్య రక్షణ చక్రం..
ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ వల్ల బీపీ, షుగర్, ఇతరత్రా రోగాలతో బాధపడుతున్నవాళ్లందరికీ కూడా తొలిదశలోనే వాళ్లందరినీ కనుక్కోగలుగుతాం. వాళ్లకు వెంటనే వైద్యం అందించడం ప్రారంభిస్తాం. వాళ్లకు రోగంముదరకుండా కాపాడగలుగుతాం. ఇది ఒక్క బీపీ, షుగర్‌లకు మాత్రమే కాకుడా కేన్సర్ దగ్గర నుంచి మొదలుపెడితే గుండె జబ్బులు, టీబీ వరకూ ప్రతిపేదవాడికి ఒక రక్షణ చక్రం ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌తో మొదలవుతుంది.
ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా
ప్రతి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన గ్రామంలోనే ఇక్కడే కాసేపటి క్రితం వైయస్సార్ విలేజ్ క్లినిక్‌ను చూశాను. అందులో ఏకంగా 105 రకాల మందులున్నీ అందుబాటులో ఉన్నాయి. మన గ్రామంలో 105 రకాల మందులిచ్చే గొప్ప వైయస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ∙14 రకాల పరీక్షలు చేయడం కోసం డయోగ్నిస్టిక్ కిట్స్‌తో సహా అన్ని విలేజ్ క్లినిక్‌లో ఈ రోజు అందుబాటులో మన గ్రామంలో ఉన్నాయి. వీటన్నింటితో పాటు విలేజ్ క్లినిక్స్‌లోనే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
ఏ ఒక్కరికీ బాగాలేకపోయినా విలేజ్ క్లినిక్‌కు వెళితే స్పెషలిస్టు డాక్టర్లు సైతం వీడియో కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని వాళ్లద్వారా కూడా వైద్యం చేయగల గొప్ప వ్యవస్ధ ఈ రోజు మన గ్రామానికే నడిచి వచ్చింది.
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా సాధారణ వైద్య సేవలు అందించడం ఒక్కటే కాదు ఈ రోజు విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమైన ఈ కాన్సెప్ట్‌తో సాదారణ వైద్య సేవలతో పాటు జన్మనిచ్చిన తల్లులకు అవసరమైన వైద్యసేవలు, బాలింతలకు కూడా కావాల్సిన వైద్యం, అంటువ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు, అంటు వ్యాధులు కాని జబ్బులకు సంబంధించిన వైద్య సేవల నుంచి మొదలుపెడితే బడి పిల్లలు మొదలుకుని అంగన్ వాడీ కేంద్రాల వరకు ఇవన్నీ ఫ్యామిలీ డాక్టర్ ప్రతి చోటుకువెళ్లి వారిందరినీ పరామర్శిస్తూ, పలకరిస్తూ వారికి వైద్యం అందించే గొప్ప కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్.
ఇది ఎలా అమలవుతుందన్నది కూడా మీ అందరికీ అవగాహన రావాలి.
ప్రతి 2000 జనాభాకు మన గ్రామంలోనే ఒకవైయస్సార్ విలేజీ క్లినిక్ స్ధాపించాం. ఇందులో ఒక బియస్సీ నర్సింగ్ చేసిన వ్యక్తి అక్కడే సీహెచ్‌ఓ(కమ్యూనిటి హె ల్త్ ఆఫీసర్) గా మిడ్ లెవల్ హెల్త్ ప్రాక్టీసనర్ అక్కడే ఉంటారు.
ఈ సీహెచ్‌ఓకు అదనంగా ఇందులోనే మరో ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటంది. వీళ్లద్దరే కాకుండా ఆశా వర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్‌కే రిపోర్టు చేసే వ్యవస్ధ మన గ్రామంలో విలేజ్ క్లినిక్ రూపంలో ఆవిర్భవించింది.
24 గంటలూ అందుబాటులో…
ఈ కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్ నుంచి ఆశావర్కర్లు వరకు నేను అందరినీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ దయచేసి ఎక్కడైతో పోస్టింగ్‌లు ఇచ్చారో అక్కడే నివాసం ఉండేటట్టుగా మీరు చేయాలి. ఎందుకంటే వీళ్లంతా 24 గంటల పాటు ప్రతిపేదవాడికి అందుబాటులో ఉండాలని తపన, తాపత్రయాన్ని అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. వీరంతా పనిచేసే విలేజ్ క్లినిక్‌లను మనం మండలానికి రెండు పీహెచ్‌సీలుకు అనుసంధానం చేస్తున్నాం.
మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సి మరియు ఒక సీహెచ్‌సీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసి, మ్యాపింగ్ చేశాం. ప్రతి హీహెచ్‌సీలోనూ ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఇందులో ఒక డాక్టర్ ఓపీ చూస్తుంటే.. రెండో డాక్టర్ కదిలే వైద్యశాల అయిన 104వాహనం ఎక్కి, ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోకి వెళ్తాడు. వెళ్లినప్పుడు అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై గ్రామంలో మంచి కార్యక్రమాలు చేస్తాడు. మండలానికి రెండు పీహెచ్‌సీలు ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు అంటే ప్రతి మండాలనికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
ఇద్దరూ డాక్టర్లు డ్యూటీలు మార్చుకుంటూ ప్రజలకు సేవచేస్తారు. ఒక గొప్ప వ్యవస్ధ రూపకల్పన జరిగింది. ఏ స్ధాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే… ప్రతి డాక్టరు కూడా తనకు కేటాయించిన గ్రామమే తాను వెళ్తాడు కాబట్టి… ఆ డాక్టర్ పేరు, మొబైల్ నెంబరు కూడా ప్రతి విలేజ్ క్లినిక్‌లోనూ, ప్రతి గ్రామ సచివాలయంలోనూ పెద్ద అక్షరాలతో డిస్‌ప్లే చేస్తారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డాక్టర్ మీకు అందుబాటులో ఉంటాడు అనే మెసేజ్ పోతుంది. ఇలా అదే డాక్టర్ తనకు కేటాయించిన అదే గ్రామంలో సందర్శించడంతో పాటు విలేజ్ క్లినిక్‌కు అనుసంధానంగా పనిచేస్తాడు. ముందుగా తాను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వస్తాడు. నెలకు రెండు నుంచి నాలుగు సార్లు అదే గ్రామానికి వచ్చి వైద్యం అందిస్తాడు. దీనివల్ల ఆ డాక్టరుకు ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తితోనూ పేరు, పేరునా పిలిచే పరిచయం ఏర్పడుతుంది.
అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్. ఇది
గొప్ప మార్పు. దేశం మొత్తం మనవైపు చూసేలా, మనల్ని కాపీకొట్టేలా జరిగే ఒక గొప్ప మార్పు ఇది.
ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఏవైనా వారి దృష్టికి వస్తే.. విలేజ్ క్లినిక్‌ల ద్వారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు కూడా రిఫర్ చేసే కార్యక్రమం కూడా విలేజీ క్లినిక్స్ నుంచి జరుగుతుంది. ఎవరికైనా గ్రామంలో బాగాలేని పరిస్తితి ఉండి, విలేజ్ క్లినిక్‌కు వెళ్తే అక్కడ కూడా వైద్యం అందించలేని స్దాయి ఉంటే.. వెంటనే ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఎక్కడ ఉందని కనుక్కుని అక్కడకు పంపించే విధంగా రెఫరల్ కూడా ఇదే విలేజ్ క్లినిక్ జరుగుతుంది.
ఇలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను అమలు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఒక పద్ధతి ప్రకారం ముందుచూపుతో అడుగులు వేయాల్సి వచ్చింది. ముందుగానే 104 వాహనాలు కొనుగోలు చేయడం, ముందుగానే విలేజ్ క్లినిక్‌లు అన్నీ స్ధాపించడం, ముందుగానే వైద్యుల నియామకం, సిబ్బందిని నియమించే కార్యక్రమం, ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్స్ అన్నీ తయారు చేయడం, అవి డౌన్లోడ్ చేసి వినియోగించే విధానం వీళ్లందరికీ నేర్పించాం. ఇవన్నీ జరుగుతూ ఒక పద్దతి ప్రకారం వచ్చిన తర్వాత ఈ రోజు ఫ్యామిలీడాక్టర్ కాన్సెఫ్ట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేట్టుగా ప్రారంభిస్తున్నాం.
ఆరోగ్యశ్రీ– వైయస్సార్…
మరో రెండు మాటలు చెప్పాలి. ఈ ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చినప్పుడు మనకు అందరికీ ఆ దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు పేరు గుర్తుకు వస్తుంది. పేదవాడి ప్రాణాలు గాల్లో దీపమనే పరిస్థితిని మార్చిన మనసున్న మనిషి ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డి.
ఒక 108,104 ,ఆరోగ్యశ్రీ ఇలా ఏది చూసినా ఈ అన్ని ఆలోచనలకు ప్రతిరూపం ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి చేరువగా అది కూడా ఉచితంగా తీసుకువచ్చిన హృదయమున్న నాయకుడు నాన్నగారు. ఆలాంటి ఒక గొప్ప ఆలోచనలతో వచ్చిన గొప్ప పథకం ఆరోగ్య శ్రీ. అలాంటి ఒక గొప్ప పథకాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోవాల్సిన గొప్ప పథకాన్ని నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక పథకం ప్రకారం దాన్ని నీరుగార్చుతూ వచ్చారు.
గత ప్రభుత్వం హయాంలో
చంద్రబాబుగారి హాయంలోఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి ఏమిటన్నది గమనిస్తే.. కేవలం 1000 ప్రొసీజర్స్‌కి మాత్రమే కట్టడి చేశారు. అంతేకాకుండా రూ.800 కోట్లకు పై చిలుకు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సంవత్సరాలు తరబడి ఇవ్వకుండా వాటిని ఎగురగొట్టిన పరిస్ధితులు కనిపించాయి. అటువంటినీరుగార్చే పరిస్థితుల నుంచి ఆ తర్వాత మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని చేయిపట్టుకుని పైకిలాగడం మొదలుపెట్టాం.
రూ.800 కోట్లు చంద్రబాబు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు పెట్టిన బకాయిలను చిరునవ్వుతో చెల్లించడమే కాకుండా… 1000 నుంచి ప్రొసీజర్స్‌ను ఏకంగా 3255 ప్రొసీజర్స్ వరకు ఆరోగ్యశ్రీను విస్తరించాం. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆసుపత్రులు గతంలో కేవలం 919 మాత్రమే ఉంటే ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల సంఖ్యను 2261కు విస్తరించాం.
మన రాష్ట్రమే కాదు ఎక్కడ పేదవాడికి మంచి వైద్యం అందుతుందంటే.. పక్కరాష్ట్రమైన సరే అక్కడి మంచి హాస్పిటల్ ఉంది దానివల్ల పేదవాడికి మంచి వైద్యం అందుతుందంటే.. ఆ ఆసుపత్రిని కూడా ఆరోగ్యశ్రీలో ఎంఫ్యానెల్ చేసి పేదవాడికి మంచి చేయాలని తపన, తాపత్రయం పడుతున్నాం.
ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో 35,71,596 మంది సేవలు అందుకున్నారు. నిరుపేద ప్రాణం, నిస్సహాయుల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఒక్క ఆరోగ్యశ్రీ మీద చేసిన ఖర్చు రూ. 9వేల కోట్లు.
46 నెలల కాలంలో మెడికల్ సెక్టార్‌లో 48,639 పోస్టుల భర్తీ..
ఇది కాక ఆరోగ్యఆసరా కింద మరో రూ.990 కోట్లు ఖర్చు చేశాం. ఈ రెండు పథకాల మీదే రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం.
గత ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి రూ.1000 కోట్లు కూడా ఖర్చు కానీ పరిస్థితి నుంచి ఇవాళ మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద సంవత్సరానికి రూ.3300 కోట్లు ఖర్చవుతుంది. వైద్య ఆరోగ్యసేవల్లో ఎలాంటి లోటు రాకూడదని గట్టి సంకల్పంతో పేదల ప్రభుత్వంగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ మీద దేశంలో ఎక్కడా జరగని విధంగా చిత్తశుద్ధితో అడుగులు వేశాం.
వైద్య ఆరోగ్యశాఖలో 46 నెలల కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 48,639 ఉద్యోగాలు ఇచ్చాం.
గతానికి ఇప్పటికీ తేడా చూడండి.
ల్యాబ్ టెక్నిషియన్స్, స్టాఫ్ నర్స్, జనరల్ ఫిజీషియన్స్, స్పెషలిస్టు డాక్టర్స్ ఈనాలుగు విభాగాల్లో్ల ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఉద్యోగాలు మంజూరు అయి పేపరుమీదే ఉంటాయి. వాటిని ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో భర్తీచేసిన పరిస్థితులు ఎక్కడా, ఏ రాష్ట్రంలో కనిపించవు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వంలో మాత్రం పేదల ప్రాణాల మీద శ్రద్ద ఉన్న ప్రభుత్వం కాబట్టి.. ఈ నాలుగు కేటగిరీల్లో ల్యాబ్ టెక్నిషియన్స్‌కు సంబంధించి దేశం మొత్తం మీద ఉన్న ఖాళీగా 33 శాతం పోస్టులు కనిపిస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం నూటికి నూరుశాతం పోస్టులు భర్తీ అయ్యాయి.
జాతీయ స్ధాయిలో స్టాప్‌నర్సులకు సంబంధించిన 27 శాతం పోస్టులు భర్తీ చేయకుండా వదిలేసిన పరిస్థితులు ఉంటే… మన రాష్ట్రంలో మాత్రం స్టాప్‌నర్సులకు సంబధించి నూటికి నూరు శాతం భర్తీ చేసాం.
దేశంమొత్తమ్మీద జనరల్ ఫిజీషియన్ పోస్టులల 50 శాతం ఖాళీలు కనిపిస్తే…. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం మాత్రం ఒక్క పోస్టు ఖాలీ లేకుండా వందకు వందశాతం భర్తీ చేశాం.
స్పెషలిస్టు డాక్టర్లు జాతీయస్ధాయిలో 61 శాతం పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉంటే…. మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి 96 శాతం స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ చేశాం. ఖాలీలు కేవలం 3.96 శాతం మాత్రమే ఖాలీలు ఉన్నాయి . అది కూడా ఖాళీలుగా ఎందుకు ఉన్నాయంటే ఎక్కడా కూడా స్పెషలిస్టు వైద్యులు దొరకలేదు. ఇవి కూడా ఉండకూడదని ఏకంగా ప్రభుత్వం పత్రికా ప్రకటనలు, వాక్ ఇన్ ఇంటర్వ్యూలు చేసి, స్పెషలిస్టు డాక్టర్లు అడిగిన మేరకు వసతులు కల్పించి, జీతాలు ఇచ్చి అడుగులు వేశాం కాబట్టి 96 శాతం నియామకాలు పూర్తి చేయగలిగాం.
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ప్రాంతాల్లో 10,032 విలేజ్ క్లినిక్స్ స్ధాపించాం. అక్కడ 10,032 మంది ఎంఎల్‌హెచ్‌పీలకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో 10,032 ఏఎన్‌ఎంలను కూడా నియామించి అక్కడే ఉద్యోగాలు ఇచ్చాం.
వ్యవస్ధలో మార్పు రావాలని, పేదలు ఇబ్బంది పడకూడదని ఈ వ్యవస్ధలను క్రియేట్ చేసాం. ఆశావర్కర్లకు గత ప్రభుత్వం హయాంలో రూ.3వేలు మాత్రమే జీతం ఇస్తున్న పరిస్థితుల్లో.. మన
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా రూ.10వేల జీతం ఇచ్చి వాళ్లనూ ప్రోత్సహించాం.
560 అర్భన్ పీహెచ్‌సీలు…
పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వమే కొత్తగా 560 అర్బన్ పీహెచ్‌సీలు, అందులో కూడా ఇదే విధంగా సిబ్బందిని నియమించాం. ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏర్పాటు అయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి 2500 జనాభాకు ఒక ఆరోగ్యకేంద్రం ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తమ్మీద మన రాష్ట్రం మాత్రమే.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో వైద్య ఆరోగ్యరంగం మీద తాను దిగిపోయే సంవత్సరం కూడా కలుపుకుంటే.. చేసిన ఖర్చు రూ.8వేల కోట్లు. ఈ రోజు మన ప్రభుత్వం హయాంలో వైద్య ఆరోగ్యరంగం మీద ఏటా చేస్తున్న ఖర్చు రూ.18వేల కోట్లు. తేడా మీరే చూడండి.
17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం…
మన రాష్ట్రం ఆవిర్భవించినాటినుంటి నేటి వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అవి కూడా శిధిలావస్థకు చేరిన పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోంది. వీటితో పాటు శిధిలావస్ధకు చేసిన పాత 11 మెడికల్ కాలేజీలను కూడా నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మనది బ్రతికించే ప్రభుత్వం. ప్రతి మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టే.. ఆరోగ్యశ్రీ సేవలను 1000 నుంచి 3255 ప్రోసీజర్స్‌కు పెంచాం. కాబట్టే రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. 1514 కొత్తగా 104, 108 వాహనాలను కొనుగోలు చేసి ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రపంచ ప్రమాణాలతో మందులు….
ప్రభుత్వ ఆసుపత్రులో ఇచ్చే మందులమీద ధ్యాసపెట్టి ప్రతిమందు కూడా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉన్న వాటిని మాత్రమే ఉండేలా మార్పులు తెచ్చాం. కాబట్టే గతంలో కేవలం 229 రకాల మందుకు అవి కూడా నాసిరకం ఉంటే… వాటి బదులు ఈ రోజు 562 రకాల డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకుచ్చాం.
దాదాపు 49వేల ఉద్యోగాలను ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తీ చేసి ప్రతి పేదవాడికి వైద్యాన్ని దగ్గరకి తీసుకొచ్చాం.
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేసుకుంటున్నవాళ్లు. తలసెమియాతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వాళ్లను కూడా వదిలేయకుండా ప్రతి ఒక్కరికీ రూ.10వేలు పెన్షన్ ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడమే కాకుండా. . ఆ మనిషి ఇంటికి వెళ్లి పనులు చేసుకోలేడని , ఇబ్బంది పడకూడదని ఆరోగ్యఆసరా కింద నెలకు రూ.5వేలు చొప్పున వైద్యుల సలహా మేరకు రెస్ట్ పీరియడ్‌లో ఆరోగ్య ఆసరా తీసుకొచ్చాం.
బడిపిల్లలకు, అవ్వాతాతలకు కంటి వెలుగు ద్వారా దృష్టిలోపాలను సవరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. వైద్య ఆరోగ్యశాఖలో ఇవన్నీ ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయి. మార్పు అన్నది అభివృద్ది అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య రంగంలో చేసిన పనులు మాత్రమే చూస్తే అర్ధం అవుతుంది. ఇది అభివృద్ధి కాదా ? మీ బిడ్డ అభివృద్ధి చేయలేదని ఎవరైనా అంటే గట్టిగా అర్ధం అయినట్టు చెప్పండి.
అన్ని రంగాల్లో విప్లవం….
వైద్య ఆరోగ్యరంగంలోనే కాదు, ఆన్ని రంగాల్లో ప్రతి పేదవాడి కుటుంబం బాగుపడాలని, లక్ష్యంతో అడుగులు వేశాం కాబట్టే గడప,గడపలోనూ చదువుల విప్లవం కనిపిస్తోంది.
అక్కచెల్లెమ్మలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ విప్లవం ప్రతి ఇంటిలోనూ కనిపిస్తోంది. ఆరోగ్యవిప్లవంతో పాటు సామాజిక వర్గాలకు చెందిన ప్రతి ఇంటిలోనూ చదువుల విప్లవం, సంపాదన విప్లవం, ఆనందం, ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం ప్రతి పేదవాడికి గడపలోనూ కనిపించే గొప్ప కార్యక్రమాలు. ఇవన్నీ నవరత్నాల పాలనకు అర్ధం చెప్పే విధంగా కనిపిస్తున్నాయి.
ఇన్ని మంచి పనులు చేశాం కాబట్టే.. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దేశచరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 46 నెలల కాలంలోనే మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.
నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ. 2,05,108 కోట్లు జమ అయ్యాయి. ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు తావులేదు. బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. వివక్ష, లంచాలు లేని పాలన జరుగుతుంది.స్కామ్‌లు తప్ప స్కీంలు తెలియని బాబులు..
ఇంత మంచి జరుగుతుంది కాబట్టే.. స్కామ్‌లు తప్ప స్కీంలు తెలియని బాబులకు.. అధికారంలో ఉండగా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ ) మాత్రమే తెలిసిన లంచావతారాలకు, గజదొంగలకు, వయస్సు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలకు.. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు వీళ్లందరూ ఎవరో మీకు బాగా తెలుసు. ఒక చంద్రబాబు రూపంలోనూ, ఈనాడు రూపంలోనూ, ఆంధ్రజ్యోతి,టీవీ5 రూపంలోనూ వీరికితోడు దత్తపుత్రుడి రూపంలోనూకనిపిస్తారు.
వీళ్లకి మిగిలింది జిత్తులు, ఎత్తులు, పొత్తులే….
వీళ్లందరికి ఏం మిగిలింది అంటే.. మీ బిడ్డను ఎదుర్కోలేక.. మీ బిడ్డకు ఒక్కరూ సాటిలేరని, ఫలానా మంచి చేశామని చెప్పుకోవడానికి ఒక్క మంచి పనీ లేక వీళ్లందరికీ మిగిలి ఉన్నవి ఏమిటంటే… జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు. వీటితోనే రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మీ బిడ్డ ఒక్కడూ ఒకవైపు ఉంటే…. ఒకటి రెండూ మంచి కాదు ఏకంగా నవరత్నాలతో మీ బిడ్డ ఎదురుగా వస్తుంటే.. అక్కచెల్లెమ్మల దగ్గర నుంచి మీ బిడ్డకు వస్తున్న తోడుని చూసీ..
ఒక్కటవుతున్నారు తోడేళ్లందరూ.
నేను ఒక్కటే చెప్తున్నా. మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం, అర్ధబలం ఉండకపోవచ్చు. మీడియా బలం ఉండకపోవచ్చు.
మీ బిడ్డకు ఉన్నది వాళ్లకు లేనిది దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే.
నా పొత్తు మీతోనే…
మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. కారణం నాకు ఎవరితోనైనా పొత్తు ఉంటే అది మీతోనే తప్ప ఎవరితోనూ ఉండదు. కారణం నాకు కుయుక్తులు చేయడం రాదు. అబ్దదాలు చెప్పడం, మోసం చేయడం చేతగాదు. వీళ్ల మాదిరి జిత్తులు, పన్నాగాలు పన్నడం చేతగాదు.
తెలిసిందల్లా ఒక్కటే నేరుగా చెప్తాను. ఏదైతే చెప్తానో అదే చేస్తాను.
ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు ఇలా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆలోచన చేయండి. ఒక్కటే ఒకటి కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగిందా , లేదా ? అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మేలు జరిగితే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డకు మీరే సైనికులుకావండి.
మీకు మంచి జరిగితేనే తోడుగా ఉండండి…
ఎందుకంటే మీ బిడ్డకు ఈనాడు లేడు, ఆంధ్రజ్యోతి లేడు, టీవీ5లేడు, మీ బిడ్డకు దత్తపుత్రుడు తోడు లేడు. మీ బిడ్డకు ఉన్నది మీరు తప్ప ఎవరూ లేరు. మీరే సైనికులు కావాలి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అని కోరుతున్నాను. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
కాసేపటి క్రితం…
నా చెల్లి.. మంత్రి రజిని చిలకపూరిపేట అభివృద్ధికి కొన్ని పనులు అడిగింది.
రూ.150 కోట్లతో తాగునీటి కోసం పనులు జరుగుతున్నాయి. దీనికోసం మరో రూ.63 కోట్లు కావాలని అడిగింది. నా చెల్లి కోరిక మేరకు ఆ రూ.63 కోట్లు మంజూరు చేస్తున్నాను. అదే విధంగా అంబేద్కర్ కమ్యూనిట్ హాల్, బీసీ భవన్, కాపు భవన్‌లను కూడా మంజూరు చేస్తున్నాను. ముస్లిం శ్మశానం, దర్గా నిర్మాణం కోసం 3 ఎకరాలు భూమి అడిగింది. వెంటనే భూమి మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులు చేయాలని కోరింది. ఆ ప్రతిపాదనలు ఇచ్చిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తాం అని సీఎం ప్రసంగం ముగించారు.