నన్ను కాదని మరొకడిని పెళ్లి చేసుకుంటావా !
పెళ్లి గిఫ్ట్ లో అమర్చిన బాంబు!

గిఫ్ట్‌గా ఇచ్చిన వధువు మాజీ ప్రియుడు!

బాంబు పేలి నూతన వరుడు అతని సోదరుడు మృతి!

J. Surender Kumar,
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఘటనలో హోం థియేటర్‌లో వధువు మాజీ ప్రియుడు బాంబును అమర్చి పెళ్లికి బహుమతిగా హోమ్ థియేటర్ ఇచ్చినట్టు వెల్లడయ్యింది. తనను కాదని మరొకర్ని ప్రియురాలు పెళ్లి చేసుకుంటోందని కోపం పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో తేలింది.

ఛత్తీస్‌గఢ్‌లో పెళ్లికానుకగా వచ్చిన హోం థియేటర్ పేలిపోయి వరుడు, అతడి సోదరుడు మరణించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనలో విస్తుగొలిపే వాస్తవం వెలుగులోకి వచ్చింది. హోం థియేటర్‌లో బాంబును అమర్చి పెళ్లికి బహుమతిగా ఇచ్చినట్టు వెల్లడయ్యింది. దీనికి వెనుక వధువు మాజీ ప్రియుడు ఉన్నట్టు తెలిసి పోలీసులు షాకయ్యారు. బహుమతిగా వచ్చిన హోం థియేటర్‌కు వరుడు కనెక్షన్ ఇచ్చి స్విచ్ఛాన్ చేసిన వెంటనే అది భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంటి గోడలతో పాటు పై కప్పు కూలిపోయింది. వరుడు హేమేంద్ర మెరావి, అతడి సోదరుడు రాజ్ కుమార్‌లు చనిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హోం థియేటర్‌లో బాంబును అమర్చినట్టు విచారణలో తేలింది. ఈ గిఫ్టు ఎవరిచ్చారనే విషయంపై విచారించడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి కుమార్తె మాజీ ప్రియుడు ఈ గిఫ్టు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని సర్జుగా గుర్తించిన పోలీసులు.. అతడ్ని మంగళవారం అరెస్ట్ చేశారు.

కబీర్‌ధామ్ అడిషనల్ ఎస్పీ మనీషా ఠాకూర్ మాట్లాడుతూ.. తనను కాదని మరొకర్ని ప్రియురాలు మరొకర్ని పెళ్లి చేసుకుంటోందని నిందితుడు కోపం పెంచుకున్నాడు. దీంతో తన వద్ద ఉన్న పాత హోం థియేటర్‌లో పేలుడు పదార్థాలు ఉంచి గిఫ్టుగా ఇచ్చినట్లు నేరాన్ని అంగీకరించాడు. హతుడు హేమేంద్ర మెరావికి ఏప్రిల్ 1న వివాహం జరిగింది. వరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఓ గదిలో దాచిపెట్టిన పెళ్లి కానుకలను ఒక్కొక్కటీ తెరుస్తున్నారు.

ఈ క్రమంలో గిఫ్టు బాక్సులో ఉన్న హోమ్ థియేటర్‌‌ను హేమేంద్ర బయటకు తీసి.. గదిలో ఉన్న కరెంట్ బోర్డుకు కనెక్ట్ చేసి స్విచ్ఛాన్ చేశాడు. ఇంతలోనే భారీ శబ్దంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్ర తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా.. సోదరుడు రాజ్‌కుమార్ (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనలో ఏడాదిన్నర చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.