స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మారాయా ?
హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమాచార సేకరణకు జిల్లా యంత్రాంగం ఎనిమిది గంటల కసరత్తు!
సోమవారం తెరుచుకొని స్ట్రాంగ్ రూమ్ లు !
ఇంజనీరింగ్ కళాశాలలోయావత్ జిల్లా యంత్రాంగం!
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పిలిపించిన కలెక్టర్, తాళం చెవి గూర్చి ఆరా !
స్ట్రాంగ్ రూములకు వేసిన సీల్స్ పక్కాగా ఉన్నాయి!
J.SURENDER KUMAR,
హైకోర్టు ఆదేశాల మేరకు ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ 2018నాటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమాచారం సమర్పించడానికి రంగం సిద్ధం చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన సమాచారం హైకోర్టు అప్పగించడానికి సాంకేతిక యంత్ర, పరికరాలతో జిల్లా యంత్రాంగం సిద్ధం కాగా స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించిన తాళాలు తెరవడానికి యంత్రాంగం వినియోగించిన తాళం చేయి పనిచేయలేదు. దాదాపు 8 గంటల పాటు తెరవడానికి కసరత్తు చేశారు.
మంగళవారం (11న ) హైకోర్టు రిటర్నింగ్ అధికారి ద్వారా సమర్పించనున్న కౌంటింగ్ ప్రక్రియ సమాచారం అందుబాటులోకి రాకపోవడంతో యంత్రాంగం హైకోర్టుకు సోమవారం నాటి సంఘటనలతో సంజయిషి ఇవ్వనున్నట్టు సమాచారం.
స్ట్రాంగ్ రూమ్స్ సీల్ ఉంది కి మిస్ అయింది!

ఈవీఎంలు భద్రపరచిన ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ లు పకడ్బందీగా యంత్రాంగం నాడు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్ ల కు తాళాలు వేసి తాళాలకు వస్త్రంతో చుట్టి దానిపై లక్క సీలు వేశారు, తలుపులకు పటిష్టమైన కార్డు బోర్డును ఇనుపమేకులకోట్టి చీమలు సైతం వెళ్లే అవకాశం లేకుండా సీల్ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్, ఆయన ఏజెంట్. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ప్రయత్నించారు. అందులో ఒక్క రూమ్ తాళం తెరుచుకుంది. అందులో ఈవీఎంలు 1 నుంచి 107 వరకు భద్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఓ ఈవీఎంకు అతికించిన కవర్ పై 17C. అని రాయబడి ఉన్నట్టు సమాచారం.

హైకోర్టు ఆదేశించిన ఐదు అంశాల సమాచారం కోసం మరో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు 108 – 269 వరకు, సీసీ పుటేజులు, వీడియో రికార్డింగ్, రికార్డు చేసిన రిజిస్టర్ లు అందులో భద్రపరిచి ఉండడంతో దానిని తెరవడానికి ప్రయత్నించిన తాళం చెవులు ఉపయోగపడలేదు.
కలెక్టర్ తీరు ప్రశంసనీయం!

కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, పాత్రికేయులు, అభ్యర్థులతో తాళం చెవులు పనిచేయకపోవడం అంశంపై తాను ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నానని, న్యాయ సలహాలు తీసుకుంటున్నాను అంటూ ప్రశాంతంగా వివరించారు. ఓ దశలో మరోసారి ఇద్దరు తాసిల్దారులను , కలెక్టరేట్ కు పంపించి తాళాలు వెతకమని ఆదేశించారు. నాడు ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించిన తహసిల్దార్ వెంకట్ రెడ్డి నీ కరీంనగర్ నుంచి అర్జెంటుగా రమ్మని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ కీస్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు ? తాను రిటర్నింగ్ అధికారికి అప్పగించానని వెంకట్ రెడ్డి వివరించారు. రిటర్నింగ్ అధికారి బిక్షపతి, తాను అప్పటి కలెక్టర్ కు అప్పగించాను అంటూ వివరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన నాటి కలెక్టర్లతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో, న్యాయా సలహాలు తీసుకుంటూ, పాత కలెక్టరేట్ నుంచి నూతన కలెక్టరేట్ మారడం వల్ల ఆఫీసులో ఎక్కడో మిస్ అయి ఉండవచ్చు అంటూ హైకోర్టుకు సమగ్ర సమాచారం ఇవ్వనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
కోడ్ మినహా ఎన్నికల వాతావరణమే!

ఈవీఎంలు భద్రపరచిన వి ఆర్ కే ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం సోమవారం ఎన్నికల వాతావరణం తలపించింది. ఒక్క ఎన్నికల కోడ్ మినహా, జాయింట్ కలెక్టర్, ముగ్గురు ఆర్టీవోలు, 18 మంది తాసిల్దారులు 18 మండలాల సిబ్బంది , పదుల సంఖ్యలో కంప్యూటర్లు, స్కానర్లు ఫైర్ ఇంజన్, మూడంచల భారీ పోలీస్ బందోబస్తు, ప్రాంగణంలో టెంట్లు, సిబ్బందికి భోజనాలు , తాగునీటి వసతి, జనరేటర్ల తో పాటు, స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన భవన ప్రాంగణంలోకి సెల్ ఫోన్లను నిషేధించారు. హైకోర్టు ఆశ్రయించిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు ముందస్తుగా నోటీసు ద్వారా సోమవారం హాజరు కావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ప్రయత్నించిన దృశ్యాలను సమాచార శాఖ వారు తీసిన ఫోటోలు, వీడియోలు బయటికి రాకుండా కట్టుదిట్టం చేశారు.
తాళం చెవి గుత్తిలో ఒకటి మారిందా ?

అధికారులు వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి గుత్తిలో ఒక రూమ్ తాళం ఓపెన్ కావడం, మరో రూమ్ తాళం ఓపెన్ కాకపోవడం లో ఆంతర్యం అంతు పట్టడం లేదని చర్చ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్ తెరవడానికి అధికారుల వద్ద ఉన్న తాళం చెవి గుత్తిలో కీలక తాళం చెవి మారిందా ? అనే చర్చ నెలకొంది. అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అధికార యంత్రాంగం పై చేస్తున్న ఆరోపణలలో తాళం చెవి నెంబర్ 786051 ఎక్కడ ఉంది ? ఆస్ట్రాంగ్ రూమ్ లోనే రికార్డ్స్ ఈవీఎంలు, హైకోర్టు కోరిన సమాచారం ఉందని, ఆ రూముకు సంబంధించిన తాళం చేయి ఎలా అదృశ్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన న్యాయవాది ద్వారా ఈ అంశంలో హైకోర్టుకు, కేంద్ర ఎన్నికల సంఘానికి, ఫిర్యాదు చేస్తాను అంటూ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు