పంజాబ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు!

వేసవి, విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో పంజాబ్ వినూత్న నిర్ణయం!


ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఆఫీసులు!


మే 2 నుంచి జులై 15 వరకు ఈ పని వేళలు వర్తింపు
!

J. Surender Kumar,

వేసవి లో పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తారు కదా.. అదే తరహాలో పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగుల పని వేళలను మార్చింది. ఉదయం 7.30 గంటలకు ఆఫీసులను తెరిచి మధ్యాహ్నం 2 గంటలకు మూసేయాలని నిర్ణయించింది. మే 2వ తేదీ నుంచి జులై 15 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులు కుటుంబాలతో గడిపే సమయం పెరగడంతోపాటు విద్యుత్ ఆదా అవుతుందని మన్ సర్కారు భావిస్తోంది.

మండుతున్న ఎండలు, విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం ప్రకటించారు.
ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లోని గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్‌నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యుత్ వాడకం తగ్గి, లోడ్ భారం కూడా తగ్గుతుందన్నారు. పంజాబ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివరాల ప్రకారం ఆ రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట వినియోగం మధ్యాహ్నం 1.30 తర్వాత మొదలవుతుంది. ఒక వేళ 2 గంటలకు ప్రభుత్వ ఆఫీసులను మూసేస్తే.. 300 నుంచి 500 మెగావాట్ల మేర పీక్ లోడ్ తగ్గించడానికి తోడ్పడుతుందని సీఎం భగవంత్ మన్ తెలిపారు.