కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ ప్రకటన!
J.SURENDER KUMAR,
తపాల శాఖ ఆసరా పెన్షన్ దారులకు శుభవార్త చెప్పింది. పోస్టాఫీసులలో ఏలాంటి ఫీజు లేకుండా ఉచితంగా పదివేల రూపాయల వరకు తీసుకునే అవకాశం కల్పించింది. ఆసరా పెన్షన్ చెల్లింపులు చేసేందుకు తపాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ మేరకు గురువారం కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను విడుదల చేసిందని, కరీంనగర్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల, చేనేత, గీత కార్మికులకు ఆసరా పెన్షన్ల చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డ్ నంబర్ తీసుకుని వెళితే మీ బ్యాంక్‌లో జమ చేయబడిన పెన్షన్ మొత్తాన్ని మీ సమీపంలోని పోస్టాఫీసు నుండి విత్‌డ్రా చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీలలో పోస్టాఫీసు సిబ్బంది పెన్షన్ చెల్లింపులు చేస్తారని, ఒకవేళ పెన్షన్ దారుడి వేలిముద్ర పడకపోతే గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర ద్వారా కూడా నగదు తీసుకువచ్చునని తెలిపారు. కరీంనగర్ డివిజన్ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2 హెచ్ఓలు, 52 సబ్ పోస్టాఫీసులు, 389 పోస్టాఫీసులు ఉన్నాయని వివరించారు. పోస్టాఫీసులలో ఐపిపిబి, ఏఈపిఎస్ సౌకర్యం ద్వారా ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి నగదు తీసుకోవచ్చునని, వారం రోజుల పాటు పెన్షన్లను ఇవ్వనున్నట్లు, ఈ అవకాశాన్ని పెన్షన్ దారులు వినియోగించుకోవాలని పోస్టల్ సూపరిండెంట్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.