వేర్పాటువాద  నాయకుడు అమృతపాల్ సింగ్ అరెస్ట్!

ఊపిరి పీల్చుకున్న పంజాబ్ పోలీసు యంత్రాంగం!

J.SURENDER KUMAR,

పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకున్న తర్వాత, వేర్పాటువాద రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ చివరకు పంజాబ్‌ లోని మోగా గురుద్వారా లో శనివారం అర్ధరాత్రి లొంగిపోయాడు . అసోంలోని దిబ్రూగఢ్‌లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.

గత కొన్నిరోజులుగా అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలాజరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల కళ్లుగప్పి పారిపోయే పరిస్థితి లేకపోవటంతో మోగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.


ఖలిస్థానీ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. అయితే, లవ్‌ప్రీత్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో అమృత్‌పాల్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. దీంతో లవ్‌ప్రీత్‌ను పోలీసులు వదిలివేయాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్ పాల్ పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.


దీంతో మార్చి 18 నుంచి పోలీసులు అతనికోసం గాలింపు మొదలు పెట్టారు. అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుడా తిరుగుతున్నాడు
దీనికితోడు లండన్ కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతని భార్య కిరణ్ దీప్‌కౌర్‌ను ఈ నెల 20న శ్రీగురురామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తరువాత పంజాబ్ పోలీసులు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ధృవీకరించారు. అమృత్ పాల్‌ను మోగా పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు పోలీసులు ఓ విజ్ఞప్తి చేశారు. శాంతి, సామరస్యాలను కాపాడాలని, ఎలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు
.