జిల్లాలో దెబ్బతిన్న 24 వేల ఎకరాల వరి పంట !
ఆదివారం రోజునే 7 వేల ఎకరాల వరి పంట!
తడిచిన వరి ధాన్యం వేలాది క్వింటాలలో!
J. Surender Kumar,
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది, వర్షంతో దెబ్బతిన్న పంటలను, అమ్మకానికి ఐకెపి కేంద్రాలలో కల్లాలలో తడిచిన ధాన్యం చూస్తూ రైతులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తీరు హృదయ విధాకరంగా ఉంది. దీనికి తోడు మామిడి తోటలు, పెను గాలులకు నేల రాలిన మామిడికాయలు, ఆ తోటలను కౌలుకు తీసుకున్న రైతుల బాధలు, రోదనలు వర్ణన నాతీతం.

అకాల వర్షం వల్ల మార్చి 25 నుంచి ఏప్రిల్ 30 వరకు అధికారిక గణాంకాల మేరకు జగిత్యాల జిల్లాలో 24,146 ఎకరాలలో వరి పంట, ఇందులో, ఆదివారం ఒకే రోజు 7,302 ఎకరాల వరి పంట దెబ్బతింది. మొక్కజొన్న 255 ఎకరాలలో, నువ్వులు 2566, సజ్జ, 104 ఎకరాలు ఎకరాలు, మామిడి 32,722 ఎకరాలలో దెబ్బతినడంతో రైతాంగం, వారి కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి.

తడిచి ముద్దైన లక్షలాది రూపాయల వరి ధాన్యం!
వరి పంట పొలాలు కోసి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల్లో, మార్కెట్ యాడ్లలో, రోడ్లపై ఆరపోసి జిల్లాలోని ప్రతి గ్రామంలో అమ్మకానికి నిలువ ఉంచిన లక్షలాది క్వింటాళ్ల వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దవ్వడంతో పాటు, వర్షపు నీటి ప్రవాహంలో క్వింటాల కొలది వరి ధాన్యం కొట్టుకొని పోవడంతో రైతులు రొధిస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రైతాంగాన్ని ఆదుకొని నష్టపరిహారాన్ని అందించి వారిలో మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
