అందరి అభిప్రాయాల మేరకు చేరిక ఉంటుంది!
కమలమా ?  కాంగ్రెసా ? కర్ణాటక ఫలితాలా?

బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి !

J.SURENDER KUMAR,

బిజెపి నాయకులతో గురువారం జరిగిన భేటీలో  పొంగులేటి, జూలపల్లి పార్టీలో చేరికపై స్పష్టత రాలేదు. పొంగులేటి, జూపల్లి చేరికపై ఎటూ తేల్చ లేదని, తమ కార్యకర్తలతో చర్చించిన తరువాత రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని వారు ఈటల బృందంతో చెప్పినట్టు సమాచారం. అయితే పొంగులేటి తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించే అవకాశం లేదని, కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం పొంగులేటి రాజకీయంగా ఏ పార్టీలో చేరాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చర్చ జరుగుతున్నది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీలోకి పొంగులేటిని, జూపల్లి కృష్ణారావుని ఆహ్వానించడానికి ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ పొంగులేటి నివాసానికి వెళ్ళింది. సుదీర్ఘ భేటీ అనంతరం పొంగులేటి ఇంటి వద్ద
ఈటల రాజేందర్ మీడియాతో…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, జూపల్లి కృష్ణారావుతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని పేర్కొన్నారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో తాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లిని కలిశానని ఈటల రాజేందర్ వెల్లడించారు. బీజేపీలోకి వారిని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా పొంగులేటి, జూపల్లి కూడా కెసిఆర్ పాలన పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.
తమ ఆశయం, వారి ఆశయం ఒకటేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లను కెసిఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా అందరం కలిసి పని చేయాలని కోరామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కొట్లాడే పార్టీ బిజెపి మాత్రమేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


తెలంగాణ సీఎం కెసిఆర్ 2014సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా చేశారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పొంగులేటి ఇంట్లో భేటీ అయిన చేరికలకమిటీ సభ్యులు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , యన్నం శ్రీనివాస్ రెడ్డి,ఏలేటి మహేశ్వర రెడ్డి, వారితో బిజెపిలో చేరిక గురించి చర్చించారు.