దేశానికి రైల్వే లైఫ్ లైన్…
J.SURENDER KUMAR,
భారతీయ రైల్వే ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజల్ని తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. అందుకే భారతీయ రైల్వేను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తారు. దేశంలోని ఓ రాష్ట్రానికి ఓకే రైల్వే స్టేషన్ ఉండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు వందల రైల్వే స్టేషన్లో ఉన్నాయి.
దేశంలో రైల్వేలకు భారీ నెట్‌వర్క్ ఉంది. భారతదేశంలో దాదాపు 8,000 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల సంఖ్య వందల్లో ఉంటుంది. కానీ దేశంలో ఒకే రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం ఒకటి ఉంది. ఇది అక్షర సత్యం. ఆ రాష్ట్రం మొత్తం కలిపి కేవలం ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. అది మిజోరం రాష్ట్రంలోని ‘ బైరాబీ రైల్వేస్టేషన్’ ఆ రాష్ట్రానికి ఇదొక్కటే రైల్వే స్టేషన్ కావడం విశేషం.
మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో బైరాబీ పట్టణం ఉంది. ఈ స్టేషన్ నుంచే ప్యాసింజర్ రైళ్లతో పాటు, సరుకుల రవాణాకు గూడ్స్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. మిజోరం రాష్ట్ర జనాభా 11 లక్షలు. ఇండియాలో ఇతర రాష్ట్రాల్లోని చిన్న నగరాల జనాభా కన్నా ఇది తక్కువ. అయితే మిజోరం చిన్న రాష్ట్రం అయినా ఈ ఒక్క రైల్వే స్టేషన్ చాలట్లేదు. ప్రజలు రాకపోకలు సాగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వేరే రైల్వే స్టేషన్ లేనందున, రాష్ట్ర ప్రజలందరూ రైలులో ప్రయాణించాలంటే బైరాబీకి చేరుకోవాల్సిందే.
బైరాబీ రైల్వే స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో సౌకర్యాల కొరత కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ BHRB స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు నాలుగు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్ పునరాభివృద్ధి 2016లో ప్రారంభమైంది. గతంలో ఈ స్టేషన్ చాలా చిన్నగా ఉండేది. బైరాబీకి 84 కిలోమీటర్ల దూరంలో కటఖాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలోకి వస్తుంది. మిజోరంలో మరో రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని భారతీయ రైల్వేల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయి.
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి రైల్వే నెట్వర్క్ పెద్దగా విస్తరించలేదు. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టులతో ముందుకు వచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల బైరాబీ-సాయిరాంగ్ రైల్ లైన్ ప్రాజెక్ట్ పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు 51.38 కిలోమీటర్లు మేర జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. ఇది ఇలా ఉండగా అత్యధిక రైల్వే స్టేషన్లో ఉన్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలో 1100 పైనే రైల్వే స్టేషన్స్ ఉన్నాయని అంచనా. భారతదేశంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న రాష్ట్రం కూడా ఇదే.
(న్యూస్ 18 సౌజన్యంతో)