చత్తీస్గడ్ అడవుల్లో కాల్పులు. ఓ జవాన్ ఇద్దరు గ్రామీణులకు బుల్లెట్ గాయాలు!

J.SURENDER KUMAR,

చత్తీస్గడ్ లోని కాంకేర్ జిల్లా బడాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాన్‌తో పాటు ఇద్దరు గ్రామీణులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

మేండర్ అడవుల్లో మావోయిస్టులను ఏరి వేసే లక్ష్యంతో కొన్ని రోజులుగా బీఎస్ఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా పోలీస్ బలగాలు మావోయిస్టులను గాలిస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వీరికి ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంట్లో ఒక జవాన్, ఇద్దరు గ్రామీణులకు గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పకంజుర్ నుంచి పోలీస్ ఉన్నతాధికారులు వైద్య బృందాలను తీసుకుని ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. పోలీస్ అధికారి రవి కుజుర్ మాట్లాడుతూ కాల్పులు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.