భక్తుల భద్రత కు, క్షేత్రానికి పొంచి ఉన్న వరద ముప్పు ?
బాధ్యత ఎవరు వహిస్తారు ?
రెవెన్యూ ? పోలీస్ యంత్రాంగమా ?
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరి నదిలోకి ప్రైవేట్ దారి నిర్మించారు. భక్తుల సౌలభ్యం కోసం మాత్రం కాదు, నిత్యం పదులకు పై సంఖ్యలో అక్రమంగా ఇసుకను తరలించే వాహనాల కోసం మాత్రమే ఈ రహ దారి నిర్మించుకున్నారు. నిత్యం వేలాది మంది భక్తజనం పవిత్ర స్నానాలు ఆచరించే నది తీర ప్రాంతాలలోనూ ఇసుక తివ్వడంతో, గుంతలు ఏర్పడి భక్తుల ప్రాణాలకు, భద్రతకు, గోదావరి వరదలు వస్తే క్షేత్రానికి, హనుమాన్ గడ్డకు ముప్పు పొంచి ఉంది. భవిష్యత్తులో సంభవించనున్న ప్రమాదం కు రెవెన్యూ , పోలీసు వర్గాలలో ఎవరు బాధ్యత వహిస్తారో ? వేచి చూడాల్సిందే
దారి ఇలా నిర్మించారు!

గోదావరి నది తీరంలో చిన్నగడి, పెద్ద గడి, పీఠాలు, సత్యవతి గుండం, బ్రహ్మగుండం వైపు భక్తులు స్నానాలకు వెళ్లే దారిలో ఉన్న ఈ ఇసుక నిల్వల పై అక్రమ రవాణా దారుల కన్ను పడింది. తెలుగు కళాశాల ప్రాంత వాగులో నుంచి హనుమాన్ గడ్డ, రాఘవేంద్ర స్వామి ఆలయ కింది భాగం చీలుస్తూ, జెసిబి సహాయంతో నది తీరంలోకి రహదారిని నిర్మించారు.

ఈ రహదారి అధికారికంగా నిర్మించారా.? అనధికారికంగా నిర్మించారా ? అనే విషయంలో ప్రభుత్వ యంత్రాంగమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భక్తుల వాహనాల సౌలభ్యం కోసమే దారి నిర్మాణం జరిగితే, తెలుగు కళాశాల వైపు దారి అత్యంత ప్రమాద భరితంగా ఉంది. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం లో నాటిన మొక్కలు ధ్వంసం చేస్తూ దారి నిర్మించడం ప్రస్తావనరం

భక్తులకు పొంచి ఉన్న ప్రమాదం ఇలా!
గతంలో నదిలో గల రక్షిత నీటి బావి కింది వైపు ట్రాక్టర్లలో ఇసుక తరలించేవారు. ప్రస్తుతం భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే తీర ప్రాంతం వెళ్లే దారిలో ఇసుక. తవ్వడంతో 5 ఫీట్లు 4 పిట్ట్ల గుంతలు ఏర్పడుతున్నాయి. వర్ష ప్రభావం, నది నీటిమట్టం పెరిగిన, ఇసుక గుంతలలో నీరు నిండి అవకాశం ఉంది, యాత్రికులకు తెలియక, ఆగుపించక అందులో పడి ప్రమాదాల బారిన పడే దుస్థితి ఏర్పడింది.

హనుమాన్ గడ్డను చిలుస్తు దారి నిర్మించడం, వాగులో ప్రవాహానికి అడ్డుకట్ట వేసి దారి నిర్మించడం తో గోదావరి నది కి వరదలు రానున్న సందర్భంలో క్షణాల వ్యవధిలోనే వరద నీరు క్షేత్రానికి, గోలివాడ, కుమ్మరివాడ ఇళ్లల్లోకి చొరబడే ప్రమాదం ఉంది.

ప్రశ్నించిన ప్రజలు, ప్రముఖుల పేర్లు చెప్పిన వైనం!
ఇసుక అక్రమ రవాణా వాహనాలు రాకపోకల కోసం హనుమాన్ గడ్డ అంచు చీలుస్తూ దారి నిర్మించడం పట్ల స్థానిక గోలివాడ, కుమ్మరి వాడకు చెందిన దాదాపు 70 మంది ప్రజలు గత వారం రోజుల క్రితం దారి పనులు చేస్తున్న వారిని నిలదీశారు. ఈ దారి వల్ల హనుమాన్ గడ్డ కూలిపోతుంది, గోదావరి వరదలు మా ఇళ్లల్లోకి వస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖుల ఆదేశాలు, అనుమతి మేరకే తాము గోదావరిలోకి దారిని నిర్మిస్తున్నామని, ఇద్దరు కీలక ఉన్నతాధికారుల హోదాలను వివరించినట్టు సమాచారం. కొందరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గత కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతంలో అతి పురాతన సుందరమైన స్వయంభు వెలసిన రాతి హనుమాన్ విగ్రహం ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో భిన్నమైనది, ఇసుక ట్రాక్టర్లు హనుమాన్ విగ్రహాన్ని ఢీ కొట్టినట్టు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో వాహనాన్ని గుర్తించి కేసులను చేస్తామంటూ నాడు పోలీసులు హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష రాజకీయ పార్టీల పలుకే బంగారం !
స్థానిక వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకగణం, రాష్ట్ర, దేశ రాజధాని లో, (ఢిల్లీలో) ఏదైనా సంఘటన జరిగితే గల్లీలో పత్రికా ప్రకటనలు, దిష్టిబొమ్మ దహనాలు, పేరిట నానా యాగి చేయడం, గల్లీలో ఏదైనా సంఘటన జరిగితే , దానికి రాష్ట్ర, ఢిల్లీ, స్థాయి అధికార రాజకీయ పార్టీలే కారణమంటూ ధర్నాలు, రాస్తారోఖో లు, నా నా యాగి చేయడం తెలిసిందే. ఉత్సాహంతో ఉరుకులు, పరుగులు పెడుతున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకగణం, కార్యకర్తలు, ఇసుక అక్రమ రవాణా అంశంతో పాటు, గోదావరి నదిలోకి రహదారి నిర్మాణం పట్ల, ప్రేక్షక పాత్ర వహించడంలో ఆంతర్యం అంతు పట్టడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు (ఇసుక) పట్టపగలు నీట్ట నిలువుగా దోచేస్తున్న ఆయా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్టు, ఈ అక్రమాలపై ప్రశ్నించడానికి వారి పలుకే బంగారమైనట్టు వ్యవహరిస్తున్న తీరును పలువురు పలురకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని గోదావరి నదిలోకి రహదారినీ నిర్మించిన బాధ్యులపై చర్యలు తీసుకొని, ఆ దారి గుండా ఇసుక ట్రాక్టర్ల రాకపోకలను, నిలిపివేసి నదిలో ఇసుక రవాణాను అడ్డుకొని చర్యలు చేపడుతారో ? ప్రలోభాలకు, ప్రభావితమై మౌనం వహిస్తారో ? అని ప్రజలు వేచి చూస్తున్నారు.