డీకే శివకుమార్ @ 1985లో దేవ గౌడ్ పై  పోటీతో..  పాపులర్ !

1989 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపు!

J.SURENDER KUMAR,

కర్ణాటక రాష్ట్రా ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్, 1985 లో దేవ గౌడపై ( మాజీ ప్రధాని) పోటీ చేసి ఓటమి పొందారు. ఈ పోటీ నేపథ్యంలో డీకే శివకుమార్ రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సంపూర్ణ మెజారిటీ వచ్చినా సీఎం పేరు ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ గురువారం వరకు నానా తంటాలుపడింది. సిద్దరామయ్యకు పోటీగా డీకే శివకుమార్ సీఎం రేసులోకి రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. డీకే శివకుమార్ ను ఒప్పించడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తల ప్రాణం తోకకు వచ్చింది.

రెండున్నర సంవత్సరాలు సిద్దరామయ్య సీఎంగా, మిగిలిన పదవి కాలం డీకే శివకుమార్ సీఎంగా ఉండటానికి అంగీకరించడంతో సీఎం సీటు కోసం ఇన్ని రోజులు పడిన పోటీ నుంచి డీకే శివకుమార్ తప్పుకున్నారు. సిద్దరామయ్య గతంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చెయ్యడంతో ఆయన పేరు ఇతర రాష్ట్రల ప్రజలకు తెలుసు.
ఇంతకాలం మంత్రిగా పని చేసిన డీకే శివకుమార్ గురించి చాలా మందికి తెలీదు. అయితే ఇప్పుడు కర్ణాటక రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా డీకే శివకుమార్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. డీకే శివకుమార్ ఎవరు ?, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ?, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి డీకే శివకుమార్ రాజకీయాల్లోకి వచ్చారా ? అని అందరూ ఆరా తీస్తున్నారు.


అసలు డీకే శివకుమార్ ఎవరంటే ?, అప్పట్లో బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఉన్న కనకపుర (ప్రస్తుతం రామనగర జిల్లా)లోని కనకపుర తాలుకాలోని దోడ్డ అలహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న కెంపేగౌడ, గౌరమ్మ దంపతుల పెద్ద కుమారుడు డీకే శివకుమార్. 1962 మే 15వ తేదీన డీకే శివకుమార్ జన్మించారు.
స్కూల్ చదువు పూర్తి అయిన తరువాత డిగ్రీ చదవడానికి బెంగళూరు వచ్చిన డీకే శివకుమార్ కాలేజ్ లో చేరారు. ముక్తా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న సమయంలోనే డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టికి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐలో చేరారు. తరువాత కర్ణాటక రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ప్రధాన కార్యదర్శి అయిన డీకే శివకుమార్ అక్కడ రాజకీయంగా అడుగులు ముందుకువేశారు
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నియోజక వర్గం నుంచి దేవేగౌడ మీద పోటీ చేసిన డీకే శివకుమార్ ఓడిపోయారు. అయితే దేవేగౌడకు డీకే శివకుమార్ గట్టిపోటీ ఇవ్వడంతో అప్పటి నుంచి డీకే శివకుమార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. 1987లో అదే సాతనూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన డీకే శివకుమార్ బెంగళూరు గ్రామీణ జిల్లా పంచాయితీ సభ్యుడిగా విజయం సాధించారు.
1989లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సంపాధించిన డీకే శివకుమార్ సాతనూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1991లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ అనార్యోగం కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. వీరేంద్ర పాటిల్ వారసుడిగా బంగారప్ప ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో బంగారప్ప పూర్తి మెజారిటీతో సీఎం అవ్వడానికి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ తనను సీఎం చేశాడని ఆనందంలో బంగారప్ప ఎమ్మెల్యేగా ఉన్న డీకే శివకుమార్ ను మంత్రిని చేశారు. డీకే శివకుమార్ మొదటిసారి మంత్రిగా పని చేసిన శాఖ జైళ్ల శాఖ.
1994లో డీకే శివకుమార్ కు టిక్కెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. సాతనూరు నియోజక వర్గం టిక్కెట్ వేరే వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఎస్ఎం కృష్ణ సీఎం అయిన సమయంలో డీకే శివకుమార్ 1999 నుంచి 2002 వరకు పట్టాణాభివృద్ది శాఖా మంత్రిగా పని చేశారు.
2004లో సాతనూరు నియోజక వర్గం నుంచి డీకే శివకుమార్ నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే అప్పట్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోవడంతో డీకే శివకుమార్ సైలెంట్ గా ఉండిపోయారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ సందర్బంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
2013లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిద్దరామయ్య సీఎం అయ్యారు. సిద్దరామయ్య క్యాబినేట్ లో డీకే శివకుమార్ విద్యుత్ శాఖా మంత్రిగా పని చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కుమారస్వామి మంత్రి వర్గంలో డీకే శివకుమార్ నీటి పారుదల శాఖా మంత్రిగా పని చేశారు. 2019లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో బీజేపీ అధికారంలోకి వచ్చి యడియూరప్ప సీఎం అయ్యారు. ఆ సందర్బంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని డీకే శివకుమార్ ఏక్ నిరంజన్ అంటూ ఒంటరిపోరాటం చేశారు.
ఇప్పుడు కేపీసీసీ అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన డీకే శివకుమార్ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని సీఎం రేసులో నిలబడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును ఇదే రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన డీకే శివకుమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కే చుక్కలు చూపించే స్థాయికి ఎదిగారు