1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి!
108, 104, 100, తరహాలో ఫోన్ చేయవచ్చు!
ఫిర్యాదు స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు!
ఏపీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం!
నేడు లాంఛనంగా ప్రారంభించిన సీఎం !
J.SURENDER KUMAR,
మీకు అర్హత ఉండి కూడా ఏ కారణం చేతైనా
మీకు సంక్షేమ పథకాలు అందకపోయినా,
ప్రభుత్వ సేవలు అందకపోయినా, న్యాయం మీ
వైపున ఉన్నా, న్యాయం జరగని పక్షాన…
ఇంతకుముందు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో ఇక నేరుగా మీ సమస్య పరిష్కారం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పవచ్చు. అపాయింట్మెంట్ అక్కర్లేదు. అమరావతికి, సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, మధ్యవర్తులను ఆశ్రయించవలసిన అవసరం లేదు, మీ మొబైల్ ఫోన్ నుంచి,108,104,100, తరహాలో 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది..సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతంగా శ్రీకారం చుట్టిన జగనన్నకు చెప్పుదాం సేవలను మంగళవారం లాంఛనంగా సీఎం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..
జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనది.
ప్రతి సమస్యకూ పరిష్కారం చూపాలన్న తపనతో 4 సంవత్సరాలుగా ప్రభుత్వం సాగించిన పరిపాలన తీరే దీనికి నిదర్శనం.
పాదయాత్రలో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పింఛన్లు రాలేదంటూ వృద్ధులు నా దగ్గరకు వచ్చేవారు. పెన్షన్లు రాలేదని నా ముందు గోడు వెళ్లబోసుకునేవాళ్లు. వారిని చూసి నాకు చాలా బాధ అనిపించేది. ప్రభుత్వం తీరుపట్ల ఆశ్చర్యం కలిగేది. పెన్షన్లు పొందడానికి అన్నిరకాల అర్హతలు ఉన్నా, మలివయస్సులో తినడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. కానీ పెన్షన్ వారికి రావడం లేదు. కారణం జన్మభూమి కమిటీలు చెప్తేకాని.. ఇవ్వని పరిస్థితి ఆనాటిది.
మొట్టమొదట మీరు ఏ పార్టీకి సంబంధించిన వారని జన్మభూమి కమిటీ వాళ్లు అడిగేవారు. అంతేకాక ప్రతి పనికీ కూడా నాకెంత ఇస్తావు అని అడిగే గుణం వారిది. పెన్షన్ల దగ్గర నుంచి చూస్తే.. ఇళ్లకేటాయింపులు వరకూ ఇదే పరిస్థితి ఉండేది. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి. మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంతమందికే ఇస్తామని చెప్పేవారు. ఎవరైనా సరే తప్పుకుంటేనే, లేక చనిపోతేనే మిగతావాళ్లకి అవి వచ్చే పరిస్థితి. నా సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూశాం. అందుకే ప్రజలకు మరింత సేవలందించాలని లక్ష్యంతో ‘ జగనన్నకు చెప్పుదాం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సీఎం వివరించారు.
👉 ఏ వ్యవస్ధలోనైనా అర్హత ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటే.. అంతమందికి ఇవ్వడం, తన పార్టీ, వేరే పార్టీ అని తేడా లేకుండా ఇవ్వడం, వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలు లేకుండా ఇవ్వడం, సంతృప్తి స్థాయిలో ఇవ్వడం వంటివి వ్యవస్ధలో మార్పులుతీసుకొచ్చే పరిస్థితులకు దోహదపడతాయి.
👉 వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చాం. లంచాలు లేని, వివక్షకు తావులేని ఒక గొప్ప వ్యవస్ధని గ్రామ స్దాయిలో తీసుకొచ్చాం. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఎవరికి ఏ సమస్య వచ్చినా చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి ఇవాళ ఉంది. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేస్తున్నాం.
👉 రైతు భరోసాకేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఆస్పత్రుళ్లలో వైద్యసేవలు, పిల్లలు చదువుతున్న స్కూళ్లు, రెవెన్యూ డివిజన్లలో మనకు రోజూ కనిపించే సమస్యలు కానివ్వండి, ఏది తీసుకున్నా పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ.. ప్రజలకు మరింత చేరువయ్యేలా పరిపాలనను తీసుకువచ్చేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి.
👉 లంచాలకు తావులేని, వివక్షకు చోటులేని వ్యవస్ధ తీసుకురావాలని దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకు వచ్చాం. అందులో భాగంగా ఇప్పటికే స్పందన అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. స్పందన ద్వారా సమస్యల పరిష్కారంలో గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. దీనికోసం ఒక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాం
👉 ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా కూడా ఎక్కడైనా, ఎవరికైనా అందకపోతే దాన్ని బాధ్యతగా అందించేలా, అసాధారణ జాప్యం ఎక్కడైనా జరిగినా దాన్ని లేకుండా చూడగలిగాం. న్యాయం, ధర్మం ఉండి కూడా వారికి రావాల్సింది రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం. సమస్యలకు పరిష్కారాలు చూపించేలా స్పందన ద్వారా అడుగులు వేశాం. ఇవాళ దాన్ని మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
👉“మీకు అర్హత ఉండి కూడా ఏ కారణం చేతైనా మీకు సంక్షేమ పథకాలు అందకపోయినా, ప్రభుత్వ సేవలు అందకపోయినా, న్యాయం మీ వైపున ఉన్నా, న్యాయం జరగని పక్షాన… ఇంతకుముందు ప్రయత్నం చేసినా ఆప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో…” ఇక నేరుగా మీ జగనన్నకు చెబుదాం.
👉 ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మరొక మెరుగైన ఆలోచన… నేరుగా మీ జగనన్నకు చెబుదాం.
👉 నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అనే గొప్ప ఆలోచన ద్వారా మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చాం.
👉 మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ, కలెక్టర్లు దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్లు వరకూ.. అక్కడ నుంచి గ్రామ సచివాలయాల వరకు ఆన్ని స్ధాయిల్లో అందర్నీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం.
జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కొన్ని మెరుగులు తీసుకువచ్చాం.
👉 ఎక్కడైనా ఏ సమస్యకైనా ప్రయత్నం చేసినా పని జరగని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమస్యలకు ఒక నాణ్యమైన పరిష్కారం చూపించేటప్పుడు…. అర్జీదారునికి సంతోషాన్ని కలిగించేలా, ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చిందించాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాం. నాణ్యతతో సమస్యల పరిష్కారానికి వేదిక ఇది.
👉ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపించడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు.. సచివాలయం సహా అందుబాటులో ఉన్న వ్యవస్థలద్వారా గట్టిగా ప్రయత్నం చేయండి.
ఇలా చేసిన తర్వాత కూడా మనవైపు న్యాయం ఉండి.. న్యాయం జరగని పరిస్థితి ఉన్నా, అర్హత ఉన్నా కూడా మనకు రాని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా కూడా సత్ఫలితం రాని పరిస్థితులు ఉన్నా.. అప్పుడు జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది ఈ కార్యక్రమం సారాంశం.
👉 అర్హత ఉన్న ప్రభుత్వ సేవలు అందకపోయినా, పథకాలు అందకపోయినా, వైయస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు కానీ, భూమి రికార్డులు ఇలా ఎలాంటి సేవ అయినా.. మన ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే నేరుగా ఫోన్ కొట్టండి. 1902కు ఫోన్ కొడితే నేరుగా నా కార్యాలయానికే (సీఎం కు) ఫోన్ వస్తుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం.
👉 మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి. ఫోన్ చేశాక మీకు యునిక్ ఐడీ నంబరు వస్తుంది. యువర్ సర్వీస్ రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. వైయస్సార్ ఐడీ నెంబరు అని పేరుపెట్టాం. మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైయస్సార్ పేరు పెట్టాం.
👉 మీ సమస్యను నా సమస్యగా భావించి.. దాన్ని ట్రాక్ చేస్తాం. నేరుగా సీఎంఓనే దీన్ని ట్రాక్ చేస్తుంది. ప్రతి అడుగులోనూ మీకు కూడా ఎస్‌ఎంఎస్‌ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ద్వారా మీ ఫిర్యాదు పరిష్కారంపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి. లేదా నేరుగా మీ సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో నేరుగా మీరు కూడా వెబ్‌సైట్లో చూడవచ్చు.
👉జగనన్నకు చెబుదాం సమర్థవంతంగా అమలు చేయడానికి మండల కేంద్రం, జిల్లా కేంద్రం, రాష్ట్ర సచివాలయాల్లో, సీఎంఓలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు పెట్టాం. సీఎంఓ, సీఎస్, డీజీపీ.. ముగ్గురుకూడా సమీక్షలు చేసి.. ఈ కార్యక్రమాన్ని ముందుకు బలంగా నడుపుతారు. వీరికి ఈ బాధ్యతలు ఇచ్చాం.
👉 ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో ప్రతి చోటా కూడా మీ సమస్య పరిష్కారాన్ని మానిటరింగ్ చేస్తారు. మీకు మంచి పరిష్కారం ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తారు.
👉 సమస్య పరిష్కారం అయ్యాక మీకు ఫోన్‌చేసి.. మీ ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీకూడా జరుగుతాయి. వీటన్నింటి ద్వారా ప్రలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
👉 ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గరనుంచి మొదలుపెడితే అంతా ప్రజలకు దగ్గరవుతూ సేవలు అందించడానికే ఉన్నాం. ప్రతి అధికారి పెద్ద స్ధాయియిలోకి వెళ్లినకొద్ది ప్రజలకు మరింత పెద్ద సేవకుడు అవుతాడు.
👉 ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నా స్ధానం నుంచి మొదలుపెడితే… సచివాలయంలో ఉన్న చిన్న అధికారి సహా వాలంటీర్ వరకు మేమంతా ప్రజలకు సేవకులమే.
👉 ముఖ్యమంత్రిగా నేను ఉన్నది కేవలం అధికారాన్ని చెలాయించడానికి కాదు. ప్రజలకు సేవకుడిగా సేవ అందించడం కోసం ఉన్నాను. ప్రజల ముఖంలో చిరునువ్వులకోసం, మీకు ఇంకా మంచి చేయాలన్న తపనతో అడుగులు వేస్తున్న మీ ప్రభుత్వం ఇది.
👉 ఈ కార్యక్రమంలో మానిటరింగ్ కోసం మరో మంచి అడుగు వేశాం. జిల్లాలకు సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాం. వీరు క్రమం తప్పకుండా జిల్లాలకు వస్తారు. కలెక్టర్లతో మమేకమై జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చూస్తారు.
అనంతరం సీఎం కంప్యూటర్‌లో బటన్‌నొక్కి.. జగనన్నకు చెబుదాం వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.