పేద కుటుంబాలకు అండగా నిలిచిన పేస్ బుక్ మిత్రులు !

వైద్య, ఇతర ఖర్చుల కోసం ₹ 1.30లక్షలు సాయం !

J.SURENDER KUMAR,

ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ తిండి ఖర్చులకు సైతం ఇబ్బందులు పడుతున్న రెండు వేరు వేరు కుటుంబాలకు తెలుగు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఫేస్బుక్ మిత్రులు ₹ 1.30 లక్షలు సాయం అందించి వారికి అండగా నిలిచారు.

వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కాలానికి చెందిన వేముల శంకర్ కు భార్య ముగ్గురు పిల్లలుండగా , టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదం కాగా కుడిపాదం నుజ్జు నుజ్జు అయింది. ఏడాది క్రితం శస్త్ర చికిత్స నిర్వహించగా , గత నెల మరోసారి నిర్వహించారు. వాటికోసం టీ కొట్టు విక్రయించాడు. ప్రస్తుతం కుటుంబ పోషణతో పాటు మందులు కొనడంలో ఇబ్బందులు పడుతున్నాడు.

ఇది ఇలా ఉండగా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన కలకోట మల్లేష్, భాగ్య వృద్ద దంపతులకు సంతానం లేకపోవడంతో ఇద్దరే కలిసి ఉంటారు. పేదరికం, సొంత ఇల్లు లేకపోవడంతో పాటు భాగ్య గత కొన్ని సంవత్సరాలనుండి హై షుగర్ తో ఇబ్బంది పడుతుంది. ఆసరా పెన్షన్ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో మందులు కొనడం మరింత భారంగా మారింది. వీరి ఇరువురి కుటుంబాల సమస్యలను తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి వీరి కుటుంబ పోషణ ఖర్చులతో పాటు మందుల కొనుగోలు కోసం సాయం అందించాలని మే 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు ఇతర దాతలు శంకర్ భార్య ఖాతాకు ₹ 1.30 లక్షలు విరాళాలు అందించారు.


దాతలు అందించిన విరాళాలను రమేష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రవితేజ చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి ₹ 65 వేలు చొప్పున పంపిణీ చేయించాడు. అలాగే జగిత్యాల కు చెందిన హోప్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్పందించి వృద్ధ దంపతులకు ప్రతినెల కిరాణా సామాగ్రి పంపిణీ చేయడానికి ముందుకు వచ్చి ఈ నెల సామాగ్రిని పంపిణీ చేశారు.