పోలీస్ పైరవీకారులకు చెక్.. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే.- బాధితులకు సత్వర న్యాయం కోసం!

జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !

J.SURENDER KUMAR,

పోలీస్ పైరవీకారులకు చెక్ పెడుతూ, బాధితులకు సత్వర సమస్యల పరిష్కారం న్యాయం కోసం, జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ విన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వారి సమక్షంలోనే పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా మేడిపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 8 మందిని గల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన విషయంలో విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సిందిగా మెట్పల్లి డిఎస్పీ ని ఆదేశించారు. ఫిర్యాదుదారులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, పైరవి కారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఈ సందర్భంగా బాధితులకు ఎస్పీ వివరించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని ఆయా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు.


వేదశ్రీకి నివాళులు అర్పించిన ఎస్పి!


మహిళా కానిస్టేబుల్ వేద శ్రీ భౌతిక కాయానికి ఎస్పి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు వేద శ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వేద శ్రీ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మల్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 2018 బ్యాచ్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ సోమవారం విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మల్యాల సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం తెలిసిన ఎస్పి ఆస్పత్రికి వెళ్ళి ప్రమాదానికి గల కారణం అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ వేదశ్రీకి SB ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, మల్యాల సి.ఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి మరియు ఇతర పోలీస్ అధికారులు , సిబ్బంది నివాళులు అర్పించారు .