మంత్రి ఈశ్వర్ కు తెలిసీ చేస్తున్నారా ? తెలియక చేస్తున్నారా ?
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
సిద్దిపేట, సిరిసిల్లలో ఏర్పాటు చేయాలి అనుకున్న ఇథ్ నాల్ పరిశ్రమను అక్కడీ మంత్రులు తిరస్కరించితే, ఈ జిల్లాకు ఎందుకు మార్చారో చెప్పాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వెలగటూరు మండలం స్తంభంపల్లి గ్రామంలో నిర్మించే ఇతనాల్ ఫ్యాక్టరీ డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న స్థంభంపల్లి, వెంకటాపూర్, పాషిగాం, వెల్గటూర్ గ్రామాల నుంచి ప్రజలు, భారీగా తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రజల ప్రాణాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిసే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈ పరిశ్రమను తమ ప్రాంతంలో ఏర్పాటు తిరస్కరించగా అక్కడి పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని ఆరోపించారు. ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలిసి చేస్తున్నారా ? తెలియక చేస్తున్నారా ? అర్థం కావడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను హరించే ఫ్యాక్టరీని తీసుకొచ్చి మన మధ్యన ఎందుకు పెడుతున్నారో ? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
స్థంభంపల్లి వద్ద ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఫ్యాక్టరీని ఇక్కడే నిర్మించాలని చూస్తే ప్రాణత్యాగం చేసి అయినా క్రిబ్ కో కంపెనీ ని తరిమి కొడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
ఫ్యాక్టరీ పై ప్రజల అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి కోరగా, మహిళలు కన్నీళ్లతో వారి బాధలను వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఎలాగైనా దీనిని ఇక్కడ నుంచి తరలించే ఏర్పాటు చేయాలని ప్రజలంతా ముక్తకంఠంతో జీవన్ రెడ్డిని కోరారు.

జీవన్ రెడ్డి వారిని ఓదారుస్తూ, ఇథనాల్ ఫ్యాక్టరీ విషతుల్య మైందని ప్రజలంతా గమనించా లన్నారు. విషవాయువులను వెదజల్లే ఫ్యాక్టరీని తెచ్చి జనావాసాల మధ్య నిర్మించడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడి వారంతా బొంబాయో, దుబాయో ,వెళ్లి ఉపాధి చూసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. రసానిక ఎరువులు అధికంగా చల్లిన పంటలను తినడం వల్లనే మనం రోగాల భారిన బారిన పడుతు న్నామని శాస్త్రవేత్తలు ఒకపక్క హెచ్చరిస్తున్నారు. అలాంటి రసాయనిక ఎరువుల తయారీలో వాడే ఇతనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ఎవరి ప్రాణాలను తీయడానికి ? దీనిని ఎవరి లాభం కోసం కడుతు న్నారో ? చెప్పాలని ప్రభుత్వం పై మండిపడ్డారు.
క్రిబ్ కో ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి పోలీసు యంత్రాంగాన్నంతా మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ? మంత్రి ని ప్రశ్నించారు. క్రిబ్ కో తో ఎంత మేరకు ఒప్పందాలు జరుపుకొని ? ఈ దుర్మార్గానికి ఒడిగడుతున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక పరిశ్రమ నిర్మిస్తే దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధితోపాటు ప్రజలకు ఉపాధి కల్పన జరగాలి.
పరిశ్రమ ఇక్కడ వద్దంటూ ప్రజలు నెలరోజులుగా, రోజుకో రీతిన పోరాటం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఏ మూలన ఉండి చూస్తు న్నారని విమర్శించారు. ఈ పరిశ్రమ నిజంగా మంచిదే అయితే ప్రజల మధ్యకు వచ్చి దాని గురించి ప్రజాప్రతినిధులు ఎందుకు ? వివరించలేక పోతున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ బాధిత గ్రామాల్లో పర్యటించి, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అంద జేయాలని సూచించారు. పరిశ్రమ నిర్మించే ప్రదేశాన్ని చదును చేయడానికి ₹ 13 కోట్ల ను ప్రభుత్వం వెచ్చించింది. ₹13 కోట్లను మరోచోట వెచ్చించి జనావాసాలు లేని చోట భూమిని కొనుగోలు చేసి పరిశ్రమ నిర్మించ వచ్చన్నారు.

నీరు, భూమి, అధికారం అన్ని అందు బాటులో ఉన్న సిరిసిల్లలో ఈ పరిశ్రమను కేటీఆర్ ఎందుకు రిజెక్ట్ చేశారో ? చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక టీఎంసీ నీటిని వినియోగించి ఇతనాల్ ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో విడుదలయ్యే వ్యర్ధాలను భూమిలోకి విడుదల చేస్తారు. దానివల్ల ఈ ప్రాంతంలోని భూమి మొత్తం కలుషితమై పంటలు కూడా పండే అవకాశం లేదన్నారు. కాలేశ్వరం మూడో టిఎంసి పేరుతో వెల్గ టూర్ రైతులను ఇప్పటికే నిండా ముంచారు. ఇప్పుడు ఇతనాల్ ఫ్యాక్టరీ పేరుతో నాలుగు గ్రామాల ప్రజల ప్రాణాలకే ఎసరు పెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. విషవాయు వులను వెదజల్లే ఫ్యాక్టరీని తెచ్చి జనావాసాల మధ్య నిర్మించాలని చూస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఏం పాపం చేశారు ? మీకు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించడమే వీరు చేసిన పాపమా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలీసు యంత్రాంగంతో ఫ్యాక్టరీ నిర్మించాలని చూడటం సిగ్గుచేటుగా భావించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ఇతనాల్ బాదిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతనే ఫ్యాక్టరీ నిర్మాణం పై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కాదని ఫ్యాక్టరీ నిర్మాణంలో మొండిగా వ్యవహరించి అడుగు ముందుకు వేస్తే యావత్ కాంగ్రెస్ పార్టీ ఇతనాల్ బాధితులకు అండగా ఉంటుంది. క్రిబ్ కో కంపెనీని ఇంటికి తరిమి కొట్టే వరకు కొట్లాడు తుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. నాలుగు గ్రామాల ప్రజలే కదా, మహా అయితే 4000 ఓట్లే పోతాయి అనుకుంటు న్నారు. ఇది నాలుగు గ్రామాల సమస్య కాదు. ఈ సమస్య మీద జగిత్యాల జిల్లాను మొత్తం ఏకం చేసి ఇతనాల్ బాధితులకు అండగా నిలిచేలా చేసి ఇతనాల్ మహమ్మారిని ఇక్కడి నుంచి తరిమికొట్టే వరకు విశ్రమించేది లేదని డిసిసి అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , ఇతనాల్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బొప్పు తిరుపతి, మేరుగు మురళి, ఎంపీటీసీ సతీష్, నాయకులు శైలేందర్ రెడ్డి, మద్దెల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.