తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు -నేడు కందుకూరి వీరేశలింగం  వర్ధంతి !

****
ఉత్తర భారత దేశంలో తొలిసారి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వితంతు  పునర్వివాహం జరిపించారు. ఆయన స్ఫూర్తితో తెలుగు నాట కందుకూరి ఇటువంటి వివాహాలని చేయించారు. అందుకే ఆయనను దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు అని అంటారు.
ఆయన స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. నాటి సమాజంకు వ్యతిరేకంగా  అంటరాని కులాలకు చెందిన పిల్లలను  చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు.. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవారు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టారు
.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం  స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు  రాజమండ్రి లో తెలుగు  పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసారు.  వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా  లోని కందుకూరు  గ్రామం నుండి రాజమండ్రి కి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.


వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. తన పదమూడో యేట బాపమ్మ ( అత్తగారు బాపమ్మకు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్య వివాహ మయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు. చదువుకునే రోజుల్లో కేశుబ్ చంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చారు.
సమాజంను ప్రభావితం చేయగల శక్తి ఉపాధ్యాయ వృత్తి కే ఉందని నమ్మి   ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా  పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధనిఅనే పత్రికను ప్రారంభించారు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసారు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహ స్వప్నమయింది.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి  వివేకవర్ధని  స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించారు. బాల్య వివాహాలకు , కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసారు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసారు.
ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు,వితంతుపునర్వివాహాలొక ఎత్తు.1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం  చేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. ఆయన భార్య  కందుకూరి రాజ్యలక్ష్మమ్మ  భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపారు. రామమోహనరాయ్,  దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్,  ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల బోధనలు, రచనలు చదవడం వల్ల ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించారు. మూఢ విశ్వాసాలు, సనాతనాచారాలపై ఆయన జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది. సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసారు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. ఆయన రచనలలో రాజశేఖర చరిత్ర  అనే నవల,  సత్యరాజా పూర్వ దేశయాత్రలు   ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసారు. స్వీయ చరిత్ర వ్రాసారు. ఆంధ్ర కవుల చరిత్రను  కూడా ప్రచురించారు. సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను  చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన  అనే బిరుదు ఉంది. ఈయన రచనలపై సాంప్రదాయ కుల అభియోగాలు మోపారు. చివరికాలమున అపనిందలకు లోనయ్యారు. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం  1919 మే 27 న తుదిశ్వాస విడిచారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం పనిచేయాల్సిన అవసరం ఉంది.
( వ్యాసకర్త )
యం.రాం ప్రదీప్ తిరువూరు 9492712836