👉 నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం !
**
మనిషి మనుగడకు జీవ వైవిధ్యం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కానీ రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, రేడియోషన్ తదితర కారణాల వల్ల అనేక జీవ జాతులు అంతరించి పోతున్నాయి. ఇందులో తేనెటీగలు కూడా ఉన్నాయి.
1934 మే 20న స్లోవేనియా దేశంలో తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథోన్ జంసా జన్మించారు. డిసెంబర్ 2017లో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, అంథోన్ పుట్టిన మే 20ని ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించాయి.
మానవునికి మేలు చేసే కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. తేనెటీగలు పూల మీద వాలుతూ మకరందాన్ని సేకరిస్తుంది. పనిలో పనిగా పూలలోని పుప్పొడిని గ్రహించి తరువాత స్పృశిస్తున్న పూలకు అందిస్తూ జీవనం సాగిస్తుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతంగా చెప్పవచ్చు. వీటి నుండి తేనె మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన ఉప ఉత్పత్తులు మైనము, పుప్పొడి, రాజాహారం, విషం మరియు ప్రొపొలిస్ లభ్యమవుతాయి.
మొక్కలలో పరపరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరగడంవల్ల వ్యవసాయం, ఉద్యానవన పంటలలో దిగుబడులు పెరిగినట్లు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 75% ఆహార పంటల దిగుబడులు పెరగడా నికి, నాణ్యత చేకూరడానికి ఎంతో కొంతమేరకైనా తేనెటీగలు, అడవి తేనెటీగలు, సీతాకోక చిలుకలు, తుమ్మెదలు… ఎంతగానో తోడ్పడుతున్నాయి.తేనెటీగల శరీరమంతా సన్నటి వెంట్రుకలతో కూడి పుప్పొడి సేకరించుటకు అనుకూలముగా ఉంటాయి. అంతేగాకుండా వాటి నాలుక, కళ్ళు మకరందాన్ని, పుప్పొడిని స్వీకరించుటకు అనుకూలంగా ఉంటాయి. ఒక్కొక్క తేనెటీగ కొన్ని వందల పుష్పాలను దర్శిస్తాయి. అందువలన పుప్పొడుల పరపరాగ సంపర్కం జరిగి, పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

తేనెటీగలు సంఘ జీవులు. ప్రతి తేనె పట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతుటీగలు, కొన్ని వేల సిపాయి ఈగలు కలిసి జీవిస్తాయి.ఒక పట్టులో 50,000వరకు తేనే ఈగలు ఉంటాయి. తేనెను తీసుకోవడం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా తేనెను వాడతారు. పౌష్ఠిక గుణాలతో కూడి, తొందరగా అరిగే ఆహార పదార్థం తేనె కంటే మరొకటి లేదు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారిక గుణాన్ని కలిగి ఉంటుంది. తేనెలో 14నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. శ్వాసకోశ వ్యాధులు నివారించుటకు తేనెను మించిన దివ్యౌషధం లేదని శుశ్రుత సంహిత చెప్పింది. తేనె పట్టునుండి సేకరించిన తేనె మంచి పోషక ద్రవ్యం, తేనె పట్టునుంచి తయారైన మైనం కొవ్వుత్తులు, పాలిష్‌లు, మోడల్స్ తయారీకి ఉపయోగిస్తారు.
తేనెటీగ విషాన్ని కీళ్లనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనె మంచి యాంటీసెప్టిక్ పదార్థం. కాబట్టి దీన్ని పుండ్లమీద పూసి ఇన్‌ఫెక్షన్‌ను నివారిస్తారు.
నగరవాసులు ఊబకాయం నుంచి బయటపడేందుకు, ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగేవారి సంఖ్య పెరిగింది.
మనకు తిండి కొరత ముంచుకు రాకుండా ఉండాలంటే తేనెటీగలు కంటికి రెప్పలా కాపాడు కోవాలని ఐక్యరాజ్య సమితి తెల్పుతుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. వ్యవసాయంలో రసాయనాలు వాడటం మానేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతి పాటించాలని సూచించింది.
సమాజంలో ప్రతి ఒక్కరికి తేనెటీగలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. వీటికి హానిచేసే పనులు మానుకోవాలి. ఇళ్లదగ్గర తేనెటీగలకోసం పూల మొక్కలు పెంచాలని ఆహార, వ్యవసాయ సంస్థవారు సూచిస్తున్నారు. ఎప్పుడైతే మనం రసాయన సేద్యానికి మరలామో, తేనెటీగల మనుగడ ప్రమాదంలో పడింది. పంటలపై విచక్షణా రహితంగా ఫెస్టిసైడ్స్ వాడడంవల్ల తేనెటీగల అభివృద్ధి తగ్గుతోంది. ఆ మేరకు పంటలు కూడా తగ్గు తున్నాయి. దానికి మరిన్ని రసాయనిక ఎరువులు వాడటం వల్ల మరిన్ని పర్యావరణ సమస్యలు ఉత్పన్నమై మొత్తం భూగోళం ప్రమాదపు అంచులకు చేరుకుంది. అందుకే మిద్దె తోటలు, పెరటి తోటలను పెంచాలి. మనం తేనెటీగల్ని పెంచిపోషిస్తే, అవి మనల్ని పెంచిపోషిస్తాయి. ఎందుకంటే ప్రకృతికి ఎంతో మేలుచేసే వీటి మనుగడ తప్పనిసరి అంటున్నారు పర్యావరణ ప్రేమికులు.
తేనెటీగలకు హాని కలిగించే పురుగుమందులను నిషేధించే చట్టం తేవడం ద్వారా స్లోవేనియా మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది.
తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఇప్పుడు కృత్రిమ పద్ధతుల్లో వీటిని పెంచుతున్నారు.అడవుల క్షీణత వల్ల ఇప్పుడు స్వచ్ఛమైన తేనె పెద్దగా లభించడం లేదు. కాబట్టి తెనేటీగలను రక్షిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం- ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఇందుకు ఉమ్మడి కృషి అవసరం.
( వ్యాసకర్త: యం.రాం ప్రదీప్ తిరువూరు. 9492712836 )