@@@
తర తరాలు గా ఆధిపత్య వర్గాల దాడుల్లో అనేకమంది అమాయక గిరిజనులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆధునిక యుగంలో కూడా వారి జీవితాల్లో గొప్ప మార్పు ఏమి రాలేదు. దేశ వ్యాప్తంగా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా వంటి పోరాట యోధులు గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడారు.
గిరిజనుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రావాలంటే ముందు వారు ఉన్నత విద్యావంతులై ఉండాలని బిర్సా భావించారు.

ఇందుకు అనుగుణంగా ఆయన ముందు ఆదివాసీలకు చదువు నేర్పడం మొదలెట్టారు. విలువిద్య, గెరెల్లా యుద్ధ పద్దతులు నేర్పసాగారు. వారిలో స్వేచ్ఛాభావనలు మేల్కొలపసాగారు. బిర్సా సభ వుందంటే ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చేవారు. 16 యేండ్లకు బిర్సా తిరుగులేని నాయకుడైనాడు. ఆదివాసీలు అటవీసంపదపై పన్నులు కట్టడం మానేశారు. మతం మారడం ఆగిపోయింది. ఇది ఆంగ్లేయులకు కోపం తెప్పించింది ..సైన్యాన్ని బిర్సా ముండా పైకి పంపారు. మొదటిలో బిర్సా వారిని గెరెల్లా పద్దతులలో ఎదురుకొని తీవ్రంగా పోరాడాడు. అయినా ఆంగ్లేయుల కుయుక్తుల ముందు ఓడిపోయారు. డబ్బు ఆశ చూపి ఆయన ఆచూకి తెలుసుకొని ఒక కొండగుహలో అనుచరగణంతో సమావేశంలో వున్న బిర్సాను చుట్టుముట్టి అరెష్ట్ చేసింది బ్రిటీష్ సైన్యం.
1900 సంవత్సరం, జూన్ 9 న, బీహారు జైలులో అకస్మాత్తుగా మరణించాడా విప్లవవీరుడు.
భారత పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిలువెత్తు చిత్రపటం పెట్టి ఆయన త్యాగాన్ని గౌరవించిందిభారతప్రభుత్వం. 1875 లో పుట్టిన బిర్సా 1900 లో అంటే 25 యేట అమరుడైనాడు. ఈనాటికి బీహార్ , జార్ఖండ్ లలో ఆదివాసీ తెగలు బిర్సా ముండాని ఒక జానపద యోధుడిగా, గొప్ప పోరాట యోధుడిగా గౌరవిస్తారు, ఆరాధిస్తారు.
( వ్యాసకర్త )
యం.రాం ప్రదీప్, తిరువూరు, 9492712836