లా అండ్ ఆర్డర్ కు ఐపీఎస్ లు ?
కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు..
J.SURENDER KUMAR,
నవంబర్, డిసెంబర్ మాసంలో తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యేకంగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు మరికొన్నిటికి రిటర్నింగ్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు చర్చ. దీంతోపాటు సమస్యాత్మకమైన కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్, ధన ప్రభావం, తదితర అంశాల నేపథ్యంలో ఐపీఎస్ అధికారులను నియమించే కసరత్తు కూడా చేస్తున్నట్టు చర్చ.
జూన్ రెండు నాటి వరకు ఈ అంశంపై అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటన జారి చేయలేదు.
ఈ సారి రాష్ట్రంలో హోరా హోరీగా కురుక్షేత్ర సంగ్రామంగా తలపించేలా జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తోంది. అధికారం దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ప్రారంభించటంతో రాష్ట్రంలో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. శాంతి భద్రతలు, ధన ప్రభావం కట్టడి చేసే ప్రక్రియకు కేంద్ర ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రిటర్నింగ్ అధికారులుగా ఐఏఎస్ అధికారులు ఎందుకంటే ?
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు అవకతవకల ఆరోపణలపై నాటి ఎన్నికల అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడం స్ట్రాంగ్ రూమ్ తాళాలు గల్లంతు, తదితర అంశాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జగిత్యాలలో నాటి ఎన్నికల నిర్వహణ చేపట్టిన అధికారులను విచారించి వాంగ్మూలాలు సేకరించడం, విచారణలో పరస్పర ఆరోపణలు తదితర అంశాల నేపథ్యం ఒకటి, కాగా వేములవాడలో అధికార పార్టీ అభ్యర్థి పౌరసత్వ వివాదం, మహబూబ్ నగర్ లో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో వివాదం, 2018 అసెంబ్లీ ఎన్నికల లో జగిత్యాల అసెంబ్లీ అధికార పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రం నమోదులో తప్పులున్నాయంటూ పోటీలో ఉన్న నాటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాటి రిటర్నింగ్ అధికారిగా కొనసాగిన జగిత్యాల ఆర్డిఓ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన, స్పందన కరువైందని, అధికార పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలతో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి విచక్షణ, అధికారం మేరకు ఆమోదం పొందింది అనే ఆరోపణలు ఉన్నాయి.

మునుగోడు రిటర్నింగ్ అధికారి ఉదంతం!
ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సింబల్ మార్పు వివాదంలో రిటర్నింగ్ అధికారిగా కొనసాగిన నల్గొండ ఆర్డీవో జగన్నాథ రావు పై అధికార పార్టీ ఒత్తిడి మేరకే జరిగిన సంఘటన నేపథ్యంలో ఆయనను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. గత నెల చివరి వారం వరకు ఆయనకు తిరిగి పోస్టింగ్ లభించిన సమాచారం లేదు.
ఓట్ ఫ్రమ్ హోమ్.. సమస్య కానున్నదా ?
కరోనా నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ‘ ఓట్ ఫ్రమ్ హోమ్ ‘ కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని సెగ్మెంట్లలో అమలు చేసింది. ఈ విధానం ఆశాజనకంగా ఉండటంతో ఆ విధానాన్ని కొనసాగించాలని ఎన్నికల సంఘం భావించి రాష్ట్రంలో తొలిసారిగా ‘మునుగోడు ‘ ఉప ఎన్నికలో ఈ విధానాన్ని అమలు చేశారు. మునుగోడు లో 8131 మంది ఓటర్లు అర్హులు ఉండగా.. 739 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకున్నారు.
ఓటర్లల్లో మరింత చైతన్యాన్ని తీసుకురాగలిగితే రానున్న కాలంలో ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానాన్ని అమలు చేయాలా ? లేదా ? అన్న తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే.
అధికార నేతల ఒత్తిడే సమస్య ?
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి అయిదు రోజుల్లోగా ఆయా నియోజకవర్గాల్లో 80 సంవత్సరాలు పైబడిన వృద్ధ, దివ్యాంగా ఓటర్లు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందించిన ‘ 12-డి ‘ దరఖాస్తును భర్తీ చేసి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయాలి. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. అధికారులు ఓటర్ల నివాస ప్రాంతాల వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. రహస్య విధానంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. రహస్య ఓటు మినహా మిగతా ప్రక్రియనంతా అధికారులు వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. ( పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రాంతాలు, పోలింగ్ బూతుల సమాచారం కోసం అధికార పార్టీ నేతల ఒత్తిడి రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహించే డివిజన్, జిల్లాస్థాయి అధికారులు తట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చునే చర్చ కేంద్రఎన్నికల కమిషన్ లో జరిగినట్టు సమాచారం ) పోస్టల్ బ్యాలెట్ ను ఎంచుకున్న వారిని పోటీలో ఉన్న అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను తమకు అనుకూలంగా ఓటు కోసం అనేక విధాలుగా ప్రభావితం చేసే అవకాశం తో పాటు, వారు ఏ కారణంతోనైనా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేని పక్షంలో ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే అవకాశం ‘ ఓట్ ఫ్రమ్ హోం ‘ విధానంలో ఉండదు. తిరిగి వారితో ఓటు వేయించడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని కమిషన్ చర్చలో వచ్చిన సమాచారం.
తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ!
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు జూన్ 2వ తేదీన ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యే ఉద్యోగులు మూడేళ్లకు మించి ఒకేచోట పని చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాంటి అధికారులను , ఉద్యోగులను గుర్తించి బదిలీ చేయాలని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పనిచేయకుండా ఉండాలి అని ఆదేశించింది.
జూలై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలి!
ఈ సంవత్సరం చివరిలోగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బదిలీల ప్రక్రియను జూలై 31 లోగా పూర్తిచేసి కేంద్ర ఎన్నికల కమిషన్ అందజేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిలను ఆదేశించింది.
పోలీస్ శాఖలోని ఎస్‌ఐలను ఎట్టిపరిస్థితుల్లో సొంత జిల్లాలో నియమించకూడదని స్పష్టం చేసింది. సీ ఈ సీ ఇటీవల పదోన్నతి పొంది, అదే ప్రాంతంలో పనిచేస్తున్నా, బదిలీలు చేయాలని పేర్కొంది. తమ బంధువులు ఎవరూ విధులు నిర్వహించే నియోజకవర్గం, లేదా జిల్లా పరిధిలో ఎన్నికల్లో పోటీచేయడం లేదని అధికారులు ధ్రువపత్రాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో లేవని, ఆయా అధికారులు నామినేషన్ల దాఖలు గడువుకు రెండు రోజుల ముందు నిర్ధారిత నమూనాలో పత్రాలు ఇవ్వాలని పేర్కొంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇప్పటికే భాగస్వాములైన అధికారులను, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, ముందస్తు అనుమతి తీసుకుని, ఆ ప్రక్రియ పూర్తయిన తరవాత బదిలీ చేయాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఓటరు నమోదు కార్యక్రమం…
మరోవైపు తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలి. జూన్ 24 నుంచి జులై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్ కేంద్రాల బౌండరీల నిర్ధారణ చేయనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొందిస్తారు. ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటారు. కమిషన్ అనుమతి లభించగానే అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.