వీడియో కాన్ఫరెన్స్ లో..
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత కార్యక్రమాలను పూర్తిచేసే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, డిజిపి అంజని కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్దత సమావేశంపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించగా, జగిత్యాల సమీకృత జల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ద కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న, ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, దీనికోసం సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు.

👉 అక్టోబర్ 1 నాటికి!
అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పకడ్బందీగా రెండో విడత ఓటర్ జాబితా రూపకల్పన కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా రూపకల్పనలో సర్వీస్ ఓటర్లు, తొలగించిన ఓటర్ల క్షేత్రస్థాయి ధ్రువీకరణ, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
👉 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు!
జిల్లాలో ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన, గత సాధారణ ఎన్నికల సమయంలో శాంతిభద్రత సమస్యలు వచ్చిన పోలింగ్ కేంద్రాలను, రాత్రి వరకు పోలింగ్ జరిగిన కేంద్రాలు క్రిటికల్ గుర్తించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులకి, వీఆర్వోలకు ఓటరు జాబితా రూపకల్పన ఏరోనేట్ 2.0, బిఎల్. ఓ .యాప్ పై అవగాహన కల్పించాలని అన్నారు.
👉 రూట్ మ్యాప్ లు !
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాలు , పోలింగ్ కేంద్రాలు రూట్ మ్యాప్లతో కూడిన మ్యాపింగ్ సిద్ధం చేయాలని అన్నారు. ఈవీఎం, వివి ప్యాట్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను గుర్తించి వారికి తగిన శిక్షణ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
👉 ఓటర్ల మార్పులు చేర్పులు
గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు నూతనంగా నమోదు చేసిన ఓటర్ల వివరాలు, ఓటరు జాబితాలో వచ్చిన మార్పులు, తొలగించిన ఓటర్లను క్షేత్రస్థాయిలో జరిపిన ధ్రువీకరణ ప్రక్రియ వాటిపై నివేదిక తయారు చేసి సమర్పించాలని, దివ్యాంగులు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్లకు ఓటు హక్కు కల్పన కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలను వివరించాలని ఆయన పేర్కొన్నారు.
👉 వెబ్ కాస్టింగ్
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండాలని, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించాలని, అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలని వారికి అవసరమైన శిక్షణ అందించాలని ఆయన పేర్కొన్నారు.
👉 డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ,
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పకడ్బందీ బందోబస్తు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని, పక్క ప్రణాళికతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఆయన సూచించారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్ లత, ఆర్డీఓ లు మాధురి, వినోద్ కుమార్, సిఐ రాజ్ కుమార్, తహసిల్దార్ రాజేందర్, ఎన్నికల డి.టి. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.