👉₹1042.53.కోట్లతో లాంలాంఛన పంపిణీ!
👉సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. బడిగంట మోగక ముందే, బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం మోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
👉 బడి గంట కంటే ముందే కానుకల గంట…
వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. బడిగంట మోగకముందే, బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈరోజే మోగిస్తుంది.
👉 వరుసగా నాలుగో ఏడాది విద్యా కానుక…
ఈ రోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫాం వంటి వాటి కోసం ఏ ఒక్కపాప, బాబు వారి తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంలో వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లోనూ ఒకటి నుంచి పదో తరగతివరకూ చదువుతున్న ప్రతి విద్యార్ధికి ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యాకానుక కిట్‌ను ఇవ్వనుంది.
👉 బట్టల కుట్టుకూలీతో సహా… విద్యాకానుక కిట్.
ప్రతి విద్యార్ధికి కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫాం, ఒక స్కూల్‌బ్యాగు, బైలింగివల్ టెక్ట్స్‌బుక్(ఒక పేజీ ఇంగ్లిషు ఒక పేజీ తెలుగు), నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఇవి కాకుండా పిల్లలందరికీ ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ కూడా విద్యాకానుక కిట్ ద్వారా ఇస్తున్నాం. వారికి వసతులు కల్పిస్తూ… బడి తెరిచే సమయానికి వారికి ఇవ్వవలిసినవి ఇస్తూ.. వీటి మీద ధ్యాస పెడుతూ, క్వాలిటీని మరింత మెరుగుపరిచేలా మార్పులు తీసుకువచ్చాం.
👉 ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత మెరుగ్గా…
పిల్లలకు యూనిఫాం కింద ఇచ్చే క్లాత్ గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనపించాలని యూనిఫాం డిజైన్‌లో కూడా మెరుగైన మార్పులు తీసుకొచ్చాం. నిరుడు సంవత్సరం వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగు సైజ్‌ను కూడా పెంచి మెరుగైన బ్యాగు ఇస్తున్నాం. మెరుగైన క్వాలిటీ షూ కూడా ఇస్తున్నాం. బైలింగ్‌వల్ పాఠ్యపుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకిస్తున్నాం.
ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాకానుక కిట్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కాదు వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతం.
👉 ఒక్కో విద్యార్ధికి ₹ 2400 ఖర్చుతో కిట్…
కానీ ఈ రోజు ఆ పిల్లలు జగన్ మామయ్య ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే.. విద్యాకానుక పండగ కార్యక్రమంలో ప్రతి స్కూళ్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులంతా పాలుపంచుకునే గొప్ప వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఆ పిల్లలకు మంచి మేనమామగా సంతోషపడుతున్నాను. ఈ రోజు నుంచి అందిస్తున్న ఈ విద్యాకానుక కిట్స్ కోసం అయ్యే ఖర్చు ₹ 1042 కోట్లు.
43.10 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ… ఒక్కో విద్యార్ధికి ఇచ్చే స్కూల్ బ్యాగుతో సహా ఇచ్చే యూనిఫాం, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ కలుపుకుని వీటి ఖరీదు ₹.2400 ఖర్చుచేస్తున్నాం.
ఆ పిల్లల తల్లులకు అన్నగా సంతోషంగా ఈ ఖర్చు చేస్తున్నాం.
ఒక్క విద్యాకానుక కింద ఈ నాలుగేళ్లలో ₹ 3366 కోట్లు ఖర్చు చేసింది.
👉 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు….
విద్యావ్యవస్ధలో మన ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి. పాఠశాల స్ధాయి నుంచే పేదపిల్లల ఇంగ్లిషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలని ఆలోచన చేశాం. మన పిల్లలు ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన పిల్లలు ఉండాలి కానీ.. తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ అడుగులు వేశాం. మన పిల్లలకు ఎక్కడైనా ఎదిగేందుకు వీలుగా టోఫెల్ పరీక్షలకు వారిని సిద్ధం చేసే కార్యక్రమం ఈ యేడాది నుంచే మొదలవుతుంది.
👉 టోఫెల్ కోసం అమెరికా ఈటీఎస్‌తో ఒప్పందం…
ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్ధ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్( ఈటీఎస్ ) ప్రిన్స్‌టన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రిన్స్‌టన్‌లో టోఫెల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మన పిల్లలకు ఇస్తారు. ఈ టోఫెల్ అనే పరీక్షకు పిల్లలకు తర్ఫీదు ఇస్తూ తయారు చేస్తున్నాం. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి వరకు టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలు నిర్వహించి వారికి టోఫెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా ఇంగ్లిషు వినడమే కాకుండా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికన్ యాక్సెంట్, డైలెక్ట్‌లో వస్తుంది.
వీరికి ఇవన్నీ తీసుకువచ్చే కార్యక్రమంలో ఈ సంవత్సరం టోఫెల్‌ను కూడా ప్రవేశపెడుతున్నాం.
👉 ప్రతిభా ఉపాధ్యాయులకు అమెరికాలో ఓరియెంటేషన్…
అంతే కాకుండా రాష్ట్ర స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో… ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ హైస్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ వెరసి 26 జిల్లాల్లోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లిషు టీచర్లను అందరికీ స్ఫూర్తినిస్తూ.. వారికి మెరుగైన ఓరియెంటేషన్ కోసం ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్‌టన్‌కు కూడా పంపిస్తున్నాం.
మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలని, అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి, మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలు అందరికన్నా ముందడుగులో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా అనలెటిక్స్ మొదలు చాట్ జీపీటీ వరకూ మన సిలబస్‌లోకి ఎలా అనుసంధానం చేయాలి, వాటిని ఎలా అనుసంధానం చేసి, మన పిల్లలను ముందు వరుసలో నిలబెట్టగలుగుతాము అనేది అధ్యయనం చేసే దిశగా వేగంగా ఆలోచనలు చేస్తున్నాం.
👉విద్యారంగంలో విపరీతమైన మార్పులు..
కనిపించేటట్లుగా నాలుగేళ్లలో చేశాం. ఇప్పటికే మనబడి నాడు–నేడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపులు మారి కళ్లముందు కనిపిస్తున్నాయి. బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. గవర్నమెంట్ స్కూళ్లు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లిష్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి.. మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లే ఉండేట్లుగా మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి.
👉 బైజూస్ కంటెంట్‌తో…
నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్ కు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ తీసుకొచ్చి ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా స్కూళ్లలో గోరుముద్ద, అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 75 శాతం హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగిస్తూ, జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతిఏటా ₹ 15 వేలు ఏటా ఇస్తున్నాం.
ఒక్క అమ్మ ఒడి అనే కార్యక్రమానికి మాత్రమే ₹ 19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పని చేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్‌లు అందించాం. అక్షరాలా 5,18,740 ట్యాబ్‌లు ₹ 685 కోట్లు ఖర్చు చేసి నిరుడు ఇచ్చాం.
మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజున డిసెంబర్ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తాం.
👉 డిజిటల్ దిశగా మారుతున్న క్లాస్‌రూములు..
ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ బడులలో నాడు–నేడు అయిపోయిన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ తీసుకొస్తున్నాం.
డిజిటల్ బోధన పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి చదువును సులభంగా అర్థమయ్యేట్లు చేస్తున్నాం.
తొలిదశలో నాడు నేడు పూర్తయిన దాదాపు 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆ పైన ఉన్న 30,232 క్లాస్ రూముల్లో డిజిటల్ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. డిజిటల్ బోర్డులు ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఉంటాయి. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్‌లో డిజిటిల్ బోర్డులను కూడా చూశాను.ఈడిజిటల్ బోర్డులు 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఉంటాయి.
2వ దశలో మరో 22 వేల స్కూళ్లు, మరో 16 వేల యూనిక్ స్కూళ్లలో డిసెంబర్ 21న మరో 31,700 ఐఎఫ్‌బీ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తాం.
దీంతో డిసెంబర్ 21కల్లా నాడు–నేడులో ఫేజ్1, ఫేజ్2 పూర్తి చేసుకున్న దాదాపు 33 వేల స్కూల్స్‌లో 6వ తరగతి, ఆపైన క్లాస్ రూములన్నీ కూడా మొత్తం డిజిటల్ బోధన వైపు అడుగులు పడుతాయి.
👉 ఆడపిల్లలకు మరింత అండగా..
ఆడ పిల్లలకు మరింత అండగా నిలుస్తూ, బడుల్లో నాడు నేడుతో పాటు టాయిలెట్ల నిర్మాణం, మెయింటెనెన్స్‌పై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటినెన్స్, స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ తీసుకొచ్చాం.
బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ అమలు చేస్తున్నాం. ఇవన్నీ పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించి సక్సెస్ కావాలని అడుగులు వేయిస్తుంది మీ మేనమామ ప్రభుత్వం.
👉 ఉన్నత విద్యలోనూ మార్పులు..
హయ్యర్ ఎడ్యుకేషన్‌లో మార్పులు తెచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే.. ఎంత మంది పిల్లలుంటే అంతమందినీ చదివించినా సరే.. సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన ద్వారా నగదు జమ చేస్తున్నాం.
ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పధకంతో ఇప్పటి వరకు మన ప్రభుత్వం ₹ 10,636 కోట్లు. ఖర్చు చేసింది.
పిల్లలందరూ పెద్ద చదువులు చదివేటప్పుడు భోజనం, వసతి కోసం ఇబ్బంది పడకూడదని, వాళ్ల తల్లిదండ్రులూ అంత కన్నా ఇబ్బంది పడే పరిస్ధితి రావద్దని, ఒక్కో పిల్లాడికిఏడాదికి ₹ 10 నుంచి ₹ 20 వేల వరకు ఖర్చు చేసి జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. ఇప్పటివరకు ఈ పథకానికి ₹ 4,275 కోట్లు ఖర్చు చేశాం.
👉 జగనన్న విదేశీ విద్యాదీవెన…
మన పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా నిలబడాలని తపన, తాయపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా ₹ 1. 25 కోట్ల వరకూ ఖర్చయినా పర్వాలేదు. మీ జగన్ మామయ్య చదివిస్తాడు.
టాప్ 50 యూనివర్సిటీల్లో 213 మంది మన పిల్లలు చదువుతున్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం ₹ 20 కోట్లు ఖర్చు చేశాం. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి.
కల్యాణమస్తు, షాదీ తోఫా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లిళ్లు చేసేటప్పుడు వధూవరులకు టెన్త్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రేరణ అవుతుందని.. ఈ పథకంలో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకు వేశాం. ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈపథకాలకోసమే విద్యా రంగంలో నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు ₹.60,329 కోట్లు.
చదువుల గురించి, ఆ అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తున్నాడో గమనించాలని ప్రతి చెల్లెమ్మకూ తెలియజేస్తున్నా. తేడా ఒక్కసారి గమనించమని కోరుతున్నా.
👉 గతానికీ ఇప్పటికీ తేడా…
గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయాలని చంద్రబాబుకు మనసే లేదు. గతంలో చంద్రబాబుకు ఆలోచన వేరు. ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు.
పేదలు చదువుకుంటే, అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. వారికి గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన వస్తే.. ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తతత్వం చంద్రబాబుది.
👉 చంద్రబాబు పేదల వ్యతిరేకి..
అన్ని విషయాల్లో చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ది. పేదలకు వ్యతిరేక బుద్ధి. పేదలు బాగు పడకూడదన్న దుర్బుద్ధి.
కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా.
👉 వాలంటీర్లు– లంచాలకు తావులేని వ్యవస్ధ..
.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావుండకూడదని చెప్పి.. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. గ్రామాల్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి, అక్కచెల్లెమ్మలకు రేషన్ సరుకులు మొదలు పేదలు, రైతులందరూ ఎటువంటి ఇబ్బంది, లంచాలు ఉండకూడదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే వాలంటీర్ల వ్యవస్ధ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. వెంటనే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు–నేడు స్కూల్స్‌లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా అనేక వ్యవస్ధలను గ్రామస్ధాయిలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం.
ఈ నాలుగు సంవత్సరాల్లోనే మనం ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, అక్కచెల్లెమ్మలకు ఇచ్చే అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, దిశ యాప్.. ఇటువంటివన్నీ తీసుకొచ్చాం.
భారత దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది.