భావ సమైక్యతకు ప్రతిజ్ఞ రచించిన.. పైడిమర్రి’ని స్మరిద్దాం!

నేడు పైడిమర్రి జయంతి సందర్భంగా..


                  @@@
జాతీయ ప్రతిజ్ఞ’ పదాలతో పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో అకుంఠిత దేశభక్తి ని , సోదరభావాన్ని పెంపొందించే దిశగా ప్రతిఙ్ఞ రచన చేపట్టిన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతిని (జూన్ 10)పురస్కరించుకొని  ఆయనకు నివాళులు…
భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం ఆధారంగా భారతీయ సమాజం నడుస్తుంది. స్వాతంత్ర్య పోరాటం ద్వారా ప్రజల్లో జాతీయ భావం పెరిగింది
.

వందేమాతరం వంటి ఎన్నో దేశ భక్తి గీతాలు ఆనాటి పౌరులలో చైతన్యం నింపాయి.ఆ ప్రభావం స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్ద కాలంలో బాగా ఉంది. నాటి నేతలు కూడా స్వాతంత్ర్య  ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు.అయితే 1962నాటికి దేశంలో ఆర్థిక, సాంఘిక పరిస్థితులు క్రమేణా క్షీణించసాగాయి. ఒకవైపు పాకిస్థాన్, చైనా వంటి పొరుగు దేశాలతో యుద్ధాలు, రాజకీయ నాయకుల్లో క్రమంగా పెరుగుతున్న స్వార్ధం తదితర అంశాలు విశాఖపట్నంలో డి టి ఓ గా పని చేస్తున్న పైడిమర్రి వెంకట సుబ్బారావును కలసివేశాయి. పౌరులలో దేశభక్తి, సోదర భావం పెంచడానికి చైనాలో దేశభక్తి గీతాలు ఉన్నాయని ఆయన తెలుసుకుని, మన దేశంలో కూడా ఇటువంటి గీతాలుంటే బావుంటుందని, అయితే అవి సరళంగా, హామీ రూపంలో ఉంటే ప్రజల హృదయాల్లో స్థిర స్థాయిగా ఉంటాయని ఆయన ఆశించారు.


1962 సెప్టెంబర్ 17న సుబ్బారావు “భారత దేశం-నా మాతృభూమి” ప్రతిజ్ఞ రాశారు. ఆయన మిత్రుడు, ఆనాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తెన్నేటి విశ్వనాధం సహకారంతో ప్రతిజ్ఞ పదాలు అయితే పాఠ్య పుస్తకాలలో చేరాయి. రచయిత పేరు మాత్రం ప్రతిఙ్ఞ ప్రక్కన లేదు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ లో జన్మించిన కవులకు, కళాకారులకు గుర్తింపు ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో పైడిమర్రి వెలుగులోకి వచ్చారు. ఎలికట్టె శంకర్రావు వంటి కవులు, జనవిజ్ఞానవేదిక వంటి సంస్థలు చేసిన కృషి ఫలితంగా పైడిమర్రి పేరు ఈనాడు అందరికీ తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ఆయన పేరు ప్రతిజ్ఞ వద్ద చేరింది.
విభిన్న మతాలు, కులాలు, భాషలున్న మన దేశంలో మనమంతా ఒకే జాతిగా మెలగాలంటే భావ సమైక్యత చాలా అవసరం. అందుకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది. ప్రతిజ్ఞతో పాటు పైడిమర్రి పలు రచనలు చేశారు. ఆయన జీవిత చరిత్రని వివిధ భాషల్లో ప్రముఖ ప్రచురణ సంస్ధ వి.జి ఎస్ ముద్రించింది.
1916 జూన్ 16న నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పుట్టిన పైడిమర్రి కవిగా, రచయితగా, బహుభాషాకోవిదుడిగా, నీతి నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా, గొప్ప దేశభక్తుడిగా పేరు పొంది 1988 ఆగస్ట్ 13న తుదిశ్వాస విడిచారు. ఆయన కాల భైరవుడు వంటి నవలలు, నౌకరి వంటి కథలు రాశారు. ఆనాటి పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. పదవీ విరమణ అనంతరం హోమియోపతి ద్వారా రోగులకు ఉచిత సేవలు అందించారు. తొలుత ఆధ్యాత్మిక రచనలు చేసినప్పటికీ, తరువాత కాలంలో మనిషికెంత భూమి కావాలి? వంటి విప్లవాత్మక రచనలు చేశారు. దేశానికి జాతీయ ప్రతిజ్ఞను అందించిన పైడిమర్రిని నిత్యం స్మరించుకోవాలి. అలాగే
ప్రతిజ్ఞని రోజూ పఠించడంతో పాటు,నిత్యం ప్రతిజ్ఞ పదాలని పాటించినప్పుడే పైడిమర్రికి నిజమైన నివాళి.

వ్యాసకర్త:-
యం.రాం ప్రదీప్ తిరువూరు, 9492712836
జనవిజ్ఞానవేదిక ప్రతినిధి !