J.SURENDER KUMAR,
కనీస అవసరాలు తీర్చుకోలేని ఆ కుటుంబాలకు శక్తికి మించిన అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో వైద్యానికి నోచుకోని సదరు బాధిత కుటుంబాలకు (ఫేస్ బుక్) సామాజిక మిత్రులు ₹1.21 లక్షలు సాయం అందించి వారికి అండగా నిలిచారు.
వివరాలు ఇలా ఉన్నాయి, ధర్మపురి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన మసీదు లక్ష్మి , శంకర్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఓ కుమారుడు, శంకర్ అనారోగ్య కారణంతో కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉంటూ ఇటీవల కోలుకున్నాడు. దాంతో లక్ష్మి కూలి పని చేస్తూ కుటుంబ పోషణ తో పాటు పిల్లల్ని చదివిస్తూ వచ్చింది.
ఏడాది క్రితం లక్ష్మికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఆరోగ్యశ్రీ ద్వారా కొన్నిసార్లు కీమోథెరపీ చేయించుకుంది . ప్రస్తుతం వైద్య పరీక్షలకు , మందులకు తీవ్ర ఇబ్బందులు పడుతుంది.
ఇదిలా ఉండగా బుగ్గారం మండలం యశ్వంత్ రావు పేట గ్రామానికి చెందిన బోయిని చిన్న లక్ష్మి ,గంగన్న వృద్ధ దంపతులు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పెన్షన్ తోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఏడాది క్రితం లక్ష్మికి రెండు కిడ్నీలు చెడిపోయాయి. డయాలసిస్ కోసం ఓ పైపు ను అమర్చడానికి దాతల సాయంతో సర్జరీ చేయించారు.

వారానికి రెండుసార్లు జగిత్యాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటుండగా ప్రయాణ ఖర్చులు ,మందులు కొనుగోలు భారంగా మారాయి. వీరి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి వీరి వైద్యం కోసం సాయం అందించాలని జూన్ 4న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఎన్నారైలు, ఇతర దాతలు లక్ష్మీ బ్యాంకు ఖాతాకు ₹ 1.21 లక్షలు విరాళాలు పంపించారు. దాతలందించిన విరాళాలను రమేష్ స్థానిక సీఐ రమణ మూర్తి ద్వారా శుక్రవారం క్యాన్సర్ బాధితురాలుకు రూ 75 వేలు, కిడ్నీ బాధితురాలుకు ₹ 46 వేలు అందజేశారు.