J.SURENDER KUMAR
జర్నలిస్టు ఉద్యమనేత, ఐజేయూ( ఇండియన్ జర్నలిస్టు యూనియన్) స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారులు, అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి 8.50 గంటలకు కన్నుమూసారు. హృద్రోగ సమస్యతో గత వారం రోజులుగా ఆయన బాధపడుతున్నారు. ఆయన గత మూడురోజులుగా విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఏపీయూడబ్ల్యూజే విస్తరణకు ఆయన విశేష కృషి చేశారు. అంబటి తన జీవితంలో ప్రతి క్షణం యూనియన్ పటిష్టతకే అంకితం చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్టు యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆంద్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్లాంట్ లెవల్ యూనియన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( ఏపీఎన్ఈఎఫ్) అధ్యక్షులు గా వివిధ పత్రికలలో ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పాటుకు కృషిచేసి నాన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదం చేశారు. ఐజేయూ నాయకుడిగా దేశంలోని జర్నలిస్టు నాయకులు అందరితో ఆయనకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి అంబటి ని ఆదర్శంగా తీసుకునే వారు. జర్నలిస్టు సమస్యలపై ఆయన సలహా సంప్రదింపులను కూడా తీసుకునేవారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
టియుడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు, శేఖర్ విరహత్ అలీ, నాయకులు నరేందర్ రెడ్డి, మజీద్ ఆలపాటి సురేష్, తాడూరి కరుణాకర్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు
ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంతాపం!
అంబటి ఆంజనేయులు మృతికి ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్య దర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, సాంబశివరావు, స్సామ్నా అధ్యక్ష, కార్యదర్శులు నల్లి ధర్మారావు, సీహెచ్ రమణారెడ్డి , ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, వసంత్, రఘు, రామారావు, ఎంవీ సుబ్బారావు, అజేయ్, మురళి తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.