👉 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో .₹ 6,392.94 కోట్లు జమ.
👉 ఒకటవవతరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్ధులకు
👉 సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
J.SURENDER KUMAR,
మన పిల్లలు ప్రపంచాన్ని ఏలాలన్న సంకల్పంతో..ఏ తల్లైనా, తండ్రి అయినా తమ పిల్లలకు తమ కంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు, ఆ పరిస్థితులు తమ పిల్లలకు రాకూడదని ఏ తల్లి,తండ్రైనా కోరుకుంటారు. వచ్చే తరం మనకంటే బాగుండాలనే కాకుండా ప్రపంచంలో పోటీని, ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితుల్లోకి మన పిల్లలు రావాలన్న గట్టి సంకల్పంతో మన ప్రభుత్వం నాలుగేళ్లుగా అడుగులు ముందుకు వేసింది.
అందులో భాగంగానే ఈ రోజు అమ్మఒడి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాం. పది రోజుల పాటు ప్రతిమండలంలోనూ పండగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ పాలుపంచుకుంటారు. ఆ అక్కచెల్లెమ్మలు, పిల్లలతో పాటు వాళ్లూ కూడా ఆ సంతోషంలో భాగస్వామ్యులవుతారు. తమ పిల్లలను బడికి పంపిస్తున్న నా అక్కచెల్లెమ్మలందరినీ నిండుమనస్సుతో అభినందిస్తున్నాను. 1వతరగతి నుంచి 12వతరగతి వరకూ చదివిస్తున్న 42.62 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తద్వారా 83.15 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ…₹.6393 కోట్లు వాళ్ల బ్యాంకుల ఖాతాల్లో 10 రోజుల పండగ వాతావరణంలో జమ చేస్తారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్, ప్రైయివేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్ధుల అందరి తల్లులకు అమ్మఒడి వర్తింపచేస్తున్నాం. అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బుధవారం బటన్ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతల్లో సీఎం జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.
👉 బటన్ నొక్కడం తెలియని బడుద్దాయిలకు చెప్పండి..
4 ఏళ్లలో రూ. 26,067 కోట్లు.
అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా 4 సంవత్సరాలలో ₹.26,067 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఎలాంటి లంచాలు లేకుండా, వివక్షకు చోటు లేకుండా నేరుగా ₹.26వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు… బటన్ నొక్కడం అంటే ఇదీ అన్న విషయం అర్ధమయ్యేలా చెప్పండి. ఇది పిల్లలను చదివించుకునేందుకు, తమ పిల్లలను బడికి పంపించినందుకు, బడులలో 75 శాతం హాజరు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం. అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది.
70 ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతుంది. ఇక మీదట కూడా జరుగుతుంది.
👉 బంగారు భవిష్యత్తు కోసం బడికి పంపించండి…
తల్లులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను , మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరినీ బడికి పంపించండి. ఈ రోజు మనం ఇస్తున్న అమ్మఒడి అనే కార్యక్రమం కాకుండా ఈ నాలుగేళ్లలో మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో నాలుగు మాటలు చెబుతాను.
నాలుగేళ్లలో గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తునాయి. ప్రభుత్వ బడులన్నింటిలోనూ ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభం మొదలు కాగానే.. మెరుగైన విద్యాకానుక కిట్‌లను ప్రతి పిల్లవాడు, పాప చేతిలో పెడుతున్నాం. గతంలో క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి చూశాం. మన ప్రభుత్వంలో మూడోతరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ఉండేలా నాలుగేళ్లలో అడుగులు వేశాం. మన పిల్లలు ఇంగ్లిషు చక్కగా మాట్లాడాలి, అర్ధం చేసుకునే పరిస్థితి రావాలి, మన పిల్లలు విదేశాలకు వెళ్లాలన్న కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలని, మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారు కావాలని… మూడోతరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫెల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కరిక్యులమ్‌లోకి తీసుకొచ్చాం.
👉 అంతర్జాతీయ స్ధాయిలో….
గతంలో తెలుగుమీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్లలో నేడు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోకి కూడా పిల్లలకుపాఠాలు ఎలా చెప్పాలి ? పిల్లలు ఆ స్ధాయిలో ఎలా ఎదగాలి ? అని ఆలోచన చేస్తున్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే.
పిల్లలకు బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషు పక్కపక్కనే ఇవ్వడమే కాకుండా, బైజూస్ కంటెంట్‌ను మన పాఠాల్లోకి అనుసంధానం చేసే కార్యక్రమం ఈ నాలుగేళ్లలోనే జరిగింది.
👉 డిజిటల్ క్లాస్ రూములు...
6వతరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌ను డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్‌ను తీసుకొచ్చి… వారికి సులభంగా చదువులు అర్ధమయ్యే విధంగా డిజిటల్ బోధనను మీ జగన్ మామయ్య ప్రభుత్వం స్కూళ్లలోకి తీసుకొచ్చింది . ఒకేరకమైన తిండి పిల్లలు తినలేరని, పౌష్టికాహారం ఉండాలని రోజుకొక మెనూతో పాటు చిక్కీ, రాగిజావ కూడా తీసుకొచ్చి గోరుముద్ద పేరుతో మంచి భోజనం ఉండాలని ఆలోచన చేసింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వమే. పిల్లలు ఎదగాలి. ఎదిగే పిల్లల మెదడు ఎదగాలంటే సరైన పోషణ ఉండాలి. సరైన తిండి ఉండాలని ఆలోచన చేసి అంగన్‌వాడీలలో సైతం మార్పులు తీసుకొచ్చాం. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణం అమలు చేస్తున్నాం. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తున్నాం. ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అమలవుతుంది.
👉 నాడు –నేడు ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు
..
రాష్ట్రంలో ఉన్న 45వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు ద్వారా వాటి రూపురేఖలన్నీ సమూలంగా మార్చే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే జరుగుతుంది.
గవర్నమెంటు స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వతరగతి పిల్లలకు వారితో పాటు టీచర్లకూ ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తున్నది కూడా మీ మేన మామ ప్రభుత్వమే. అది కూడా మీ మేనమామ పుట్టినరోజున మీతోపాటు ఆ ఆనందాన్ని పంచుకునేటట్టుగా ప్రవేశపెట్టాం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేద పిల్లలు పెద్ద చదువుల కోసం అప్పలు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఏ తల్లీతండ్రికి తమ పిల్లలను చదివించుకునేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి రావద్దనే.. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వం.
చదువులు ఒక్కటే కాదు పిల్లల మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం తల్లిదండ్రులు భరించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ ఖర్చుల కూడా వారి నెత్తిన భారం కాకూడదని చెప్పి.. వారి కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే.
పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు సత్య నాదెళ్లతో పోటీ పడే విధంగా… ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. విదేశీచదువులు చదవాలంటే షాక్ కొట్టే మాదిరి ఫీజులుంటాయి, అవి చదవలేనిపరిస్థితి ఉండకూడదని.. 21 ఫ్యాకల్టీలలో ప్రపంచంలోనే టాప్ 50 లో ఉన్న .. టాప్ 350 కాలేజీలలో ఏ విద్యార్ధికి సీటు వచ్చిన రూ.1.25 కోట్ల వరకూ పూర్తి ఫీజును భరించడానికి ముందుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే.
స్టాన్‌ఫోర్ట్, కార్నెగీ మెల్లన్ వంటి పెద్ద కాలేజీలు గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ రూ.80–రు.90 లక్షల వరకు ఫీజులు ఉంటాయి. వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి… ఆ ఫీజులు రూ.1.25 కోట్లు అయినా ఫర్వాలేదు, మీకు సీటు వస్తే చాలు చదివించడానికి మీ మేనమామ ఉన్నాడని భరోసా ఇస్తున్నాం.
జీవితంలో స్ధిరపడడానికి చదువు ఎంత అవసరమో అందరికీ గుర్తుండాలని చెప్పి, పదోతరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు–షాదీ తోఫా అమలు చేస్తుంది కూడా మీ మేనమామ ప్రభుత్వమే.
👉 రూ.66,722 కోట్లతో విద్యారంగంలో సంస్కరణలు.
ఇలా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం. ఆ పేద పిల్లలు చదవాలి, ఎదగాలి ప్రపంచంతో పోటీపడాలి. ఆ పోటీ ప్రపంచంలో నెగ్గాలి. ఇదొక్కటే మీ దగ్గర నుంచి మీ మేనమామ కోరుకుంటుంది. మన కళ్లెదుటనే ఇన్ని మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తున్నా.. గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా? అని అడుగుతున్నాను.
👉 ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరికీ చెప్పాలి.
మనం చేసిన ఈ విప్లవాత్మక మార్పులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయన్నది చూస్తే.. వీటిలో మన కళ్లెదుటనే మనకే కనిపించేది.
పేద పిల్లలు పేదవర్గాలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో చెప్పే చదువులు వేరు. డబ్బులు కట్టి ప్రయివేటు బడులలో చెప్పించే చదువులు వేరు అని… రెండు రకాల చదువుల్ని… ఆ చదువుల్లోని అంటరానితనాన్ని తుదిముట్టించడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది.
ఈ రోజు ఆ పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు నా పేద పిల్లలకు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి.
రెండో మార్పు ఏమిటంటే… మామూలుగా గవర్నమెంట్ బడుల ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ బడులలో క్వాలిపైడ్ టీచర్లు ఉన్నా కూడా అక్కడ విద్యావిధానం, కరిక్యులమ్, మీడియమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వసతులు వంటివన్నీ ఏమాత్రం బాగాలేవు అన్న పరిస్థితి ఇంతకముందు వినిపించేది.
నాలుగేళ్ల మీ మేనమామ ప్రభుత్వంలో గవర్నెమెంటు బడులు .. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా.. ప్రయివేటు బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది.
👉 పెత్తందారీ విద్యావిధానాన్ని బద్దలుకొట్టి..
గిరిజన పిల్లలు, దళితుల పిల్లలు, బీసీ, మైనార్టీలు, పేదల పిల్లలు వీళ్లంతా ఎప్పటికీ చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతకాలి. గ్రామాల్లో వీళ్లంతా చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతకాలి. మరికొంత మంది కూలీలుగానూ, పనివారిగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ విద్యావిధానాన్ని బద్దలుకొట్టి… నా గిరిజన పిల్లలు, నా దళితులు, బీసీలు, మైనార్టీ పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే ఇంగ్లిషు మీడియం చదువులతోపాటు, వాళ్ల బడుల్లో కూడా టోఫెల్, డిజిటల్ విద్యను సైతం వారి చేతుల్లో పెడుతుండడం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పు. ఇది కూడా ఈ నాలుగేళ్ల పాలనలో పాలనలోనే కనిపిస్తుంది.
👉 ప్రభుత్వ బడుల్లలో ఆణిముత్యాలు, వజ్రాలు, రత్నాల కోసం..
నాలుగో మార్పు… గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు ఉంటాయని.. ఈ వజ్రాలు, రత్నాలు, ఆణిముత్యాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. కాబట్టే పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెపుతాను.
👉 వెలుగుతున్న ప్రభుత్వ బడులు...
టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి.
75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో గతేడాది 66.50 శాతం పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు.
ఈ యేడాది జేఈఈ అడ్వాన్స్‌డు పరీక్షల్లలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్ధులు అద్భుత ప్రతిభ చూపించారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్‌ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం కూడా ఈ సంవత్సరం రాబోతోంది.
విద్యారంగంలో మనం చేస్తున్న మార్పులతో స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరం గమనిస్తే.. స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితం.
ఇదే సందర్భంగా అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంటున్న తల్లులకు మీ అన్నగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో రూ.1000 మీ పిల్లల వెళ్లే స్కూలు మెయింటినెన్స్ కోసం, మరో రూ.1000 టాయిలెట్స్ మెయింటినెన్స్ కోసం కలిపి రూ.2వేలు కాంట్రిబ్యూట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ డబ్బులు కూడా మీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులలో పేరెంట్స్ కమిటీ సూపర్‌విజన్‌లో, హెడ్ మాష్టర్ పర్యవేక్షణలోనే ఖర్చు చేసి, స్కూళ్లు బాగా ఉండేటట్టు చేస్తారు.
👉 గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం…
ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీ అందరితో పంచుకుంటాను. మొట్టమొదటిసారిగా గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఐదుమంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో నా చెల్లెమ్మ పుష్పశ్రీవాణి మొట్టమొదట డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత నా చెల్లెమ్మకే దక్కుతుంది.
ఈ రోజుకి కూడా మీ జగనన్న కేబినెట్‌లో గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైబల్ అడ్వైజర్ కమిటీని వేసిన చరిత్ర కూడా మనదే.
👉 నవరత్నాలను ప్రతి గిరిజనుడికీ చేర్చాలని...
ఉత్తరాంధ్రాకు 4 కొత్త మెడికల్ కాలేజీలు..
నవరత్నాల్లోని ప్రతి పథకమూ మారుమూలలో ఉన్న ట్రైబల్ గ్రామాలకి చేర్చాలని తపన, తాపత్రయం పడుతున్న ప్రభుత్వం మనదే.
ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. చివరి ఊరు వరకూ ప్రభుత్వ పథకాలు అత్యంత పారదర్శకంగా అందాలని, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తాపత్రయంలో అడుగులు పడుతున్నాయి.
ఈ రోజు ఇదే గిరిజన ప్రాంతంలో ఆసుపత్రులకు దిక్కులేని పరిస్థితులు ఉంటే.. ఐదు ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. మరోవైపున ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది.
👉
ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు. మరొకటి కురుపాంలో రాబోతోంది.
మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి.
వచ్చే నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం.
ఇదే గిరిజనుల కోసం ఏకంగా 1,47,242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్‌ఆర్ డీకేటీ పట్టాలు 3,62,737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఒక్క కురుపాంలోనే 21,311 కుటుంబాలకు 38,798 ఎకరాలు పంపిణీ చేశాం.
అంతే కాకుండా వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది.
👉 నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం…
ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్ట్ అయినా నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. ఈ రోజు మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, మైనార్టీలు 84 శాతం ఉద్యోగాల్లో కనిపిస్తున్నారు. సీఎం ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.